Digital Roads: డిజిటల్ హైవేలు!
ABN, Publish Date - Jul 07 , 2025 | 01:13 AM
జాతీయ రహదారులపై ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చర్యలు తీసుకుంటోంది. రోడ్డుపై నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడిపేవారిని నియంత్రించేలా దేశంలోని పలు జాతీయ రహదారులను డిజిటల్, స్మార్ట్ హైవేలుగా మార్చాలని నిర్ణయించింది.
జాతీయ రహదారులు ఇక స్మార్ట్‌గా.. రోడ్లపై ఏఐతో కూడిన సీసీ కెమెరాల ఏర్పాటు
రాష్ట్ర పోలీసు, రవాణా శాఖకు అనుసంధానం
ప్రమాదాలు జరిగితే వెంటనే కమాండ్ కంట్రోల్
సెంటర్‌కు లొకేషన్, కి.మీ. నంబర్‌తో సహా వివరాలు
వీడియోతో సహా పంపనున్న నిఘా కెమెరాలు
వెంటనే అక్కడికెళ్లి సాయం అందించనున్న సిబ్బంది
నాగ్‌పూర్-హైదరాబాద్ హైవేపై మొదలైన పనులు
తర్వాత ఖమ్మం-దేవరపల్లి, హైదరాబాద్-బెజవాడ,
కర్నూల్-రాయచూర్ మార్గాల్లో అమలు
నిర్మాణమే స్మార్ట్‌గా ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారులపై ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చర్యలు తీసుకుంటోంది. రోడ్డుపై నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడిపేవారిని నియంత్రించేలా దేశంలోని పలు జాతీయ రహదారులను డిజిటల్, స్మార్ట్ హైవేలుగా మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ పరిధిలో ఉన్న పలు కీలక రహదారులను కూడా డిజిటల్, స్మార్ట్ రోడ్లుగా మార్చనుంది. ఈ మేరకు ప్రతి రోడ్డుపైనా అత్యంత అధునాతనమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో అనుసంధానం చేయనున్నారు. ఏఐతో అనుసంధానమైన కెమెరా వ్యవస్థను రాష్ట్ర పోలీసు, రవాణా శాఖకు అనుసంఽధానం చేస్తారు. దీంతో రోడ్డుపై వాహనం ఎలా వెళ్తోంది, ఎంత స్పీడ్‌తో వెళ్తోందనే విషయంతోపాటు సవ్య దిశలోనే వెళ్తోందా, లేదా అనేదీ తెలిసిపోతుంది. తద్వారా.. నిబంధనలను ఉల్లంఘించి వాహనం నడిపిన వారికి జరిమానా పడడంతోపాటు వాహన ప్రయాణ వీడియో కూడా ఫోన్‌కు వచ్చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీ-గురుగ్రామ్‌ను కలిపే ద్వారక ఎక్స్‌ప్రె్‌సవేపై ఏఐతో పనిచేసే సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే విధానాన్ని దేశంలోని ఇతర రహదారులతోపాటు తెలంగాణలోనూ అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోనూ డిజిటల్ హైవే పనులు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా హైదరాబాద్-నాగ్‌పూర్ మార్గం (ఎన్.హెచ్-44)లో స్మార్ట్ హైవే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం 591 కిలోమీటర్లు ఉంటుంది. తెలంగాణ పరిధిలో 251 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం ఇది టోల్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (టీవోటీ) విధానంలో ఉంది. ఈ మొత్తాన్ని డిజిటల్ హై వేగా మార్చనున్నారు. తాజాగా ఈ బాధ్యతలు దక్కించుకున్న ఓ సంస్థ.. పనులు కూడా ప్రారంభించింది.
అత్యాధునిక సీసీ కెమెరాలు..
స్మార్ట్, డిజిటల్ హై వే ఏర్పాటులో భాగంగా.. రహదారిపై 360 డిగ్రీల కోణంలో పనిచేసే అత్యాధునిక సీసీ కెమెరాలను ప్రతి కిలోమీటర్‌కు (రెండు వైపులా) ఒకటి చొప్పున 251 కెమెరాలను అమర్చుతారు. మూల మలుపులు, వంకరలు ఉన్నచోట రెండు చొప్పున కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం రోడ్లపై ఏర్పాటుచేసే వాటికంటే అత్యంత శక్తిమంతంగా ఈ కెమెరాలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో వీటిని ఏర్పాటుచేస్తారు. ఇవి 24 గంటలూ రోడ్లపై నిఘా ఉంచుతాయి. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక మానిటరింగ్ కేంద్రాలను హైవే పైనే ఒకటి, రెండు చోట్ల ఏర్పాటుచేయడంతోపాటు ప్రత్యేకంగా సిబ్బంది కూడా ఉంటారు. ఈ కెమెరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు, రవాణా శాఖకు అనుసంధానం చేస్తారు. ఇవి ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను అంచనా వేస్తుంటాయి. రహదారిపై ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు లొకేషన్‌తోపాటు కిలోమీటర్ నంబర్‌తో కూడిన అన్ని వివరాలను వీడియోతో సహా పంపుతుంది. వెంటనే హైవేపై ఉండే అంబులెన్స్, సిబ్బంది అక్కడికి చేరుకుని అవసరమైన సాయం అందిస్తారు. అంతేకాదు.. స్పీడ్ డిటెక్షన్, రాంగ్ రూట్, ప్రమాదాల వీడియోను చిత్రీకరించడం వంటి పలు రకాల సేవలను వీటి ద్వారా అందించనున్నారు. ఫలితంగా రోడ్లన్నీ అత్యంత భద్రతగా ఉండడంతోపాటు ప్రమాదాలు తగ్గేందుకూ అవకాశం ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అంటున్నారు. త్వరలోనే హైదరాబాద్-నాగపూర్ హైవేపై ఈ సాంకేతిక విధానం అందుబాటులోకి రానుంది.
త్వరలో మరో మూడు ఎన్‌హెచ్‌లపై..
ప్రస్తుతానికి నాగపూర్-హైదరాబాద్ రూట్‌లో డిజిటల్ హైవే విధానం అందుబాటులోకి రానుండగా.. త్వరలో రాష్ట్రం గుండా వెళ్తున్న మరో మూడు జాతీయ రహదారులపైనా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారిపై ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరితగతిన పనులు పూర్తిచేసి రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో రహదారిని ప్రారంభించేలోపు లేదా ఆ తరువాతనైనా డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన పనిలో నిమగ్నమయ్యారు. ఇక కర్నూల్-రాయచూర్ మార్గంలోనూ స్మార్ట్ రోడ్డు విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలోనూ దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ రహదారిపై అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు 17 బ్లాక్‌స్పాట్‌ల వద్ద పలు రకాల పనులు చేపట్టగా.. అవి పలు దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసలను, ఆరు వరుసల రోడ్డుగా మార్చేందుకు డీపీఆర్ సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు.. ఈ రోడ్డుపైనా అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎ్‌స)ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
నిర్మాణమే స్మార్ట్‌గా.. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం
రాష్ట్రంలోని పలు జాతీయ రహదారులతోపాటు రాష్ట్రానికే సూపర్ గేమ్‌చేంజర్‌గా భావిస్తున్న రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తరభాగంలోనూ ఈ సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా ఇక నుంచి రాష్ట్రానికి మంజూరయ్యే జాతీయ రహదారులను ఈ విధానంలోనే నిర్మించనున్నట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 6 వరుసలతో 161 కిలోమీటర్ల మేర నిర్మించబోయే ఉత్తరభాగంలో నిర్మాణ సమయంలోనే ఈ సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు అవసరమైన వ్యవస్థలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే వివరాలను కూడా ఖరారు చేసినట్టు తెలిసింది.
Also Read:
కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..
మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
For More Telangana News And Telugu News
Updated Date - Jul 07 , 2025 | 07:23 AM