Counterfeit Alcohol: నిన్న కల్తీ కల్లు.. నేడు కల్తీ మద్యం
ABN, Publish Date - Jul 24 , 2025 | 03:26 AM
మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్.. నిన్న కల్తీకల్లు కేసులతో సతమతమైన ఎక్సైజ్ శాఖను ఇప్పుడు కల్తీ మద్యం కలవరపెడుతోంది. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే రెక్టిఫైడ్ స్పిరిట్(ఆర్‌ఎ్‌స)తో యథేచ్ఛగా కల్తీమద్యాన్ని తయారు చేస్తున్నారు.
రెక్టిఫైడ్ స్పిరిట్‌తో కల్తీ మద్యం తయారీ
బ్రాండ్ల వారీగా నకిలీ లేబుల్స్, స్టిక్కర్లు
సూర్యాపేట ఘటన ఎక్సైజ్‌లో కలవరం
హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్.. నిన్న కల్తీకల్లు కేసులతో సతమతమైన ఎక్సైజ్ శాఖను ఇప్పుడు కల్తీ మద్యం కలవరపెడుతోంది. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే రెక్టిఫైడ్ స్పిరిట్(ఆర్‌ఎ్‌స)తో యథేచ్ఛగా కల్తీమద్యాన్ని తయారు చేస్తున్నారు. దానికి వేర్వేరు బ్రాండ్ల వారీగా నకిలీ లేబుళ్లు, స్టిక్కర్లను అంటిస్తూ.. విక్రయాలు సాగిస్తున్నారు. మూడ్రోజుల క్రితం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలోని ఒక రైస్‌మిల్లులో పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారీ కేంద్రం గుట్టు రట్టయిన నేపథ్యంలో.. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ తరహా దందాపై దృష్టిసారించారు. మేళ్లచెరువు రైస్ మిల్లులో 8 నెలలుగా కల్తీ మద్యం తయారవుతున్నట్లు అధికారులు తేల్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫ్యూరియస్ లిక్కర్ దందా నడిపి, అక్రమార్జనకు పాల్పడిన ముఠాలోని కొందరు తెలంగాణకు మకాం మార్చారు. వారి నుంచి 38 కార్టన్ల ఎంసీ విస్కీ క్వార్టర్ సీసాలు, 11,800 ఖాళీ బాటిళ్లు, 42.8 కిలోల మూతలు, 7,814 లేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎక్సైజ్‌శాఖ అధికారులు విచారణ జరపగా.. హైదరాబాద్ శివార్లలోని ఓ ఫార్మా కంపెనీ నుంచి రెక్టిఫైడ్ స్పిరిట్‌ను కొనుగోలు చేసి.. కల్తీ మద్యం తయారు చేసినట్లు తేలింది. అలా తయారు చేసిన మద్యాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని బెల్టు షాపుల ద్వారా విక్రయిస్తున్నారు. గతంలోనూ ఇబ్రహీంపట్నం, భువనగిరి, రామన్నపేట, నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో రాయల్‌స్టాగ్ విస్కీ తాగిన వారికి కడుపు నొప్పి వచ్చిందనే ఫిర్యాదులపై ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక కమిటీ వేసి, విచారణ జరిపితే.. ఒడిసాలోని టోంగ్ జిల్లాలోని కల్తీ మద్యం తయారీ యూనిట్ ద్వారా రాష్ట్రానికి ఆ సరుకు వచ్చినట్లు తేల్చారు.
ఫార్మా కంపెనీల నుంచి..
మెదక్, సంగారెడ్డి, రాంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఎక్సైజ్‌శాఖ లైసెన్సులు జారీచేసిన పది దాకా డిస్టిలరీస్ పరిశ్రమలున్నాయి. వాటిల్లో తయారైన రెక్టిఫైడ్ స్పిరిట్‌ను ఫార్మా కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ఆ స్పిరిట్ కేటాయింపు, రవాణా అంతా ఎక్సైజ్‌శాఖ పర్యవేక్షణలోనే జరగాలి. కానీ.. కొవిడ్ కల్లోలం సమయంలో శానిటైజర్ల అవసరం పెరగడంతో.. వాటి తయారీకి కోటాకు మించి స్పిరిట్‌ను ఫార్మా పరిశ్రమలకు కేటాయించారు. దీంతో కొన్ని కంపెనీలు లెక్కాపత్రం లేకుండా స్పిరిట్‌ను తరలించుకుపోతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పలు పరిశ్రమల నిర్వాహకులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వాస్తవానికి రెక్టిఫైడ్ స్పిరిట్ అనేది తాగడానికి ఉపయోగపడకుండా ఉండేందుకు అందులో బెంజిన్ అనే విషపూరిత రసాయనాన్ని కలిపి.. దానిని పరిశ్రమల అవసరాలకు వినియోగించుకునేలా పంపుతారు. 80ు రెక్టిఫైడ్ స్పిరిట్‌ను లిక్కర్ తయారీలో రా మెటీరియల్‌గా వాడతారు. దాన్ని శుద్ధీకరించి, ఫ్యూజల్ ఆయిల్, ఆల్దిహైడ్స్, మిథనాల్‌లను తొలగించిన తర్వాత ఎగస్ట్రా న్యూట్రిన్ ఆల్కహాల్(ఈఎన్‌ఏ) తయారవుతుంది. దీన్నుంచి లిక్కర్ తయారవుతుంది. అయితే.. అక్రమార్కులు రెక్టిఫైడ్ స్పిరిట్‌ను కొనుగోలు చేసి, నీళ్లు కలిపి.. కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. కాగా, ఎస్‌టీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్ బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా విచారణ జరిపి.. కల్తీ మద్యం తయారీ మూలాలను కనుగొని, చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 24 , 2025 | 03:26 AM