High Court: ఖాజాగూడలో ప్రభుత్వ భూమి కబ్జాపై.. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిల్
ABN, Publish Date - Jun 17 , 2025 | 04:36 AM
కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నలుగురు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు.
చెరువు ఎఫ్‌టీఎల్ 27.18 ఎకరాల్లో 47 అంతస్తుల చొప్పున 8 టవర్లు నిర్మిస్తున్నారన్న ఎమ్మెల్యేలు
భూమి విలువ రూ.10 వేల కోట్లు ఉంటుంది
హైడ్రాకు ఫిర్యాదు చేసినా లాభం లేదని తెలిపిన అనిరుధ్ రెడ్డి, యెన్నం, మురళీనాయక్, రాజేశ్ రెడ్డి
అధికారులు కుమ్మక్కయ్యారని తీవ్ర ఆరోపణ
హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదులో సర్వే నంబర్, లొకేషన్ ఎందుకు పేర్కొనలేదన్న హైకోర్టు
పూర్తి వివరాలతో మళ్లీ ఫిర్యాదు చేయాలని, ఆ కాపీ సమర్పించాలని ఎమ్మెల్యేలకు సూచన
విచారణ రెండు వారాల పాటు వాయిదా
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నలుగురు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఖాజాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా భారీ టవర్లు నిర్మిస్తున్నారని పేర్కొంటూ ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్ రెడ్డి (జడ్చర్ల), యెన్నం శ్రీనివా్‌సరెడ్డి (మహబూబ్ నగర్), మురళీనాయక్ భూక్యా (మహబూబాబాద్), కూచుకుల్ల రాజేశ్ రెడ్డి (నాగర్‌కర్నూల్) పిల్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామ పరిధిలోని పాత సర్వే నెంబర్లు 119, 122, కొత్త సర్వే నెంబరు 27లోని 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిలో బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, బండి బిందు నుంచి డెవల్‌పమెంట్ అగ్రిమెంట్ కం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (డీఏజీపీఏ) పొందిన బీ సుబ్బారెడ్డి 47 అంతస్తుల చొప్పున 8 భారీ టవర్లు నిర్మిస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. 150 మీటర్ల దూరంలో ఓక్రిడ్జ్ స్కూల్ ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా రెడ్‌మిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం తీవ్రంగా ఉందన్నారు.
ఈ భూమికి సంబంధించిన పాత సర్వే నెంబర్లను సవరించి కొత్తగా సర్వే నెంబర్లు కేటాయిస్తూ 1995లో జిల్లా రెవెన్యూ అధికారి ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలని కోరారు. సదరు ఉత్తర్వులకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టర్, తహసీల్దార్ సదరు ప్రభుత్వ భూమిని ప్రతివాదులకు బదిలీ చేయడం చెల్లదని ప్రకటించాలన్నారు. కలెక్టర్ ఎన్‌వోసీ ఇవ్వడంతో జీహెచ్‌ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసిందని, రెవెన్యూ, మునిసిపల్, జీహెచ్‌ఎంసీ చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ అక్రమాలను అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్ సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ తన భూములను తాను రక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, సుప్రీంకోర్టు కోర్టు గతంలో పలు ఇతర కేసుల్లో ఇచ్చిన తీర్పులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు.
ఈ భూమి విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రతివాదులతో కుమ్మక్కై భూకబ్జా చేశారని తీవ్ర ఆరోపణ చేశారు. ఈ మేరకు హైడ్రాకు ఫిర్యాదు చేశామని, అయినా లాభం లేదని తెలిపారు. పిటిషనర్లకు ఈ భూమి విషయంలో ఎలాంటి ఆసక్తి లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం... పిటిషనర్లు హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదులో కబ్జాకు గురైన భూమి ఎక్కడ ఉందో తెలిపే సర్వే నెంబర్లు లేవని పేర్కొంది. కబ్జాకు గురైన భూమి లొకేషన్, సర్వే నెంబరు తదితర పూర్తిస్థాయి వివరాలతో తాజాగా రిప్రజెంటేషన్ ఇవ్వాలని, దానిపై ప్రభుత్వం నిర్ణయిస్తుందని పిటిషనర్లకు సూచించింది. తాజా విజ్ఞప్తి ప్రతిని తమకు కూడా సమర్పించాలని పేర్కొంటూ విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.
Updated Date - Jun 17 , 2025 | 04:36 AM