ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: మాట్లాడుకుందాం

ABN, Publish Date - Jun 21 , 2025 | 02:59 AM

గోదావరి - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా ఇతర జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. ఈనెల 23న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉంది.

గోదావరి, కృష్ణా జల వివాదాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కూర్చొని చర్చిద్దాం

  • 23న మంత్రివర్గ సమావేశం ఉంది.. అందులో బనకచర్లపై సమాలోచన

  • ఆ తర్వాత ఒకడుగు ముందుకేసి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తా

  • ఏపీతో విభేదాలు కోరుకోవడం లేదు.. అలాగని రాజీ పడే ప్రసక్తే లేదు

  • మా ప్రాజెక్టులకు అనుమతులొస్తే.. ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరం లేదు

  • బనకచర్లపై ఏపీ నేరుగా కేంద్రానికి పీఎ్‌ఫఆర్‌ ఇవ్వడంతోనే వివాదం

  • రాజకీయంగా చచ్చిన బీఆర్‌ఎస్‌కు సంజీవనిగా జలవివాదాలు

  • సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్‌, హరీశ్‌

  • బనకచర్లకు బీజం 2016లోనే.. అప్పుడే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు!?

  • కిషన్‌రెడ్డికి కేటీఆర్‌ ట్యూషన్‌ మాస్టర్‌.. ఆయన చెప్పిందే చేస్తారు

  • గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ అవయవ దానం

  • ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

న్యూఢిల్లీ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ‘‘గోదావరి - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా ఇతర జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. ఈనెల 23న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉంది. అందులో చర్చించి, ఆ తర్వాత నేనే ఒకడుగు ముందుకేసి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిపాదించారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ ప్రీ ఫీజిబులిటి రిపోర్ట్‌ (పీఎ్‌ఫఆర్‌) ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు. పీఎ్‌ఫఆర్‌ ఇచ్చే ముందే తెలంగాణతో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదన్నారు. ఏపీతో విభేదాలు కోరుకోవడం లేదని, అలాగని రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మోదీ ప్రధాని సీట్లో కుర్చోవాలంటే చంద్రబాబు మద్దతు కావాలని, అందుకే, ఏపీ సర్కారు పీఎ్‌ఫఆర్‌ ఇచ్చిన వెంటనే కేంద్రం స్పందిస్తోందని, బనకచర్లపై అన్ని రకాల చర్యలకు సిద్ధమైందని తెలిపారు. అదే సమయంలో, 18 నెలలుగా తాము ఎన్నిసార్లు కలిసినా స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇద్దరు సీఎంలు కూర్చుని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై చర్చిద్దాం. ఒకరోజు కాకపోతే నాలుగు రోజులైనా చర్చలకు సిద్ధమే. న్యాయ, సాంకేతిక అంశాలను పరిశీలిద్దాం’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య జల వివాదాలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని తెలంగాణ వంద శాతం విశ్వసిస్తుందని, అనవసర రాద్ధాంతాలు తెలంగాణకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. వివాదాల పరిష్కారంలో తనకెలాంటి బేషజాలు లేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమేనని చెప్పారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య కాదని, రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారమని తెలిపారు. పైన, కింద ఉన్న ఏ రాష్ట్రాలతోనూ తాము వివాదాలను కోరుకోవడం లేదని, మహారాష్ట్ర, కర్ణాటకతో జల వివాదాలు తలెత్తితే.. ఏపీ, తెలంగాణ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. జల వివాదాల విషయంలో కర్ణాటకతో ఎటువంటి సత్సంబంధాలు కలిగి ఉన్నామో.. ఏపీతోనూ అలాంటి సత్సంబంధాలనే కోరుకుంటున్నామని చెప్పారు.

చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు హరీశ్‌ డ్రామాలు

తెలంగాణతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఏపీ సర్కారు నేరుగా కేంద్రం వద్దకు వెళుతుండడంతో అది బీఆర్‌ఎ్‌సకు ఆయుధంగా మారుతోందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ‘‘బీఆర్‌ఎస్‌ రాజకీయంగా చచ్చిపోయింది. ఇప్పుడు జల వివాదాలను సంజీవనిగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని, ఎటువంటి మనస్పర్థలు రాకూడదనే సదుద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడితే.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కాలంలో అవేమీ నెరవేరలేదు. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రజలను మభ్యపెట్టింది. పదేళ్ల క్రితం ఎటువంటి జల వివాదాలు ఉన్నాయో, ఇప్పటికీ అవే సమస్యలు ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌, అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు వల్ల జల వివాదాలు మరింత జఠిలంగా మారాయి. చేసిన తప్పులన్నీ చేసేసి, ఇప్పుడేమో తనకేమీ తెలియదన్నట్టు హరీశ్‌ మీడియా ముందుకొచ్చి డ్రామాలు ఆడుతున్నారు. పొడవు ఎక్కువ ఉన్నాను కాబట్టి, తనకన్నీ తెలుసనే భ్రమలో హరీశ్‌ ఉన్నారు. కానీ, పొడవున్నోడికి తెలివెక్కువ ఉండడం.. పొట్టిగున్నోడికి తెలివి కాస్త తక్కువ ఉండడం ఉండదు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇవిగో ఆధారాలు.. జీవో కాపీలు

బనకచర్లకు బీజం పడింది 2016లోనేనని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. సర్వే చేయాలంటూ 2016-18 మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని, అప్పుడే తెలంగాణ ప్రభుత్వం కోర్టులను ఎందుకు ఆశ్రయించలేదని నిలదీశారు. ‘‘సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్‌, హరీశ్‌ రావు. వాళ్ల సహకారంతో నీటి తరలింపునకు సంబంధించి ఏపీ పదేళ్లలో రెండు జీవోలు జారీ చేసింది. దీనికితోడు, 2015 జూన్‌ 18, 19న కేఆర్‌ఎంబీ సమావేశం జరిగింది. అందులో 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకోవడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 2020 జనవరి 9న మళ్లీ కేఆర్‌ఎంబీ సమావేశం జరిగింది. అందులోనూ కృష్ణా నీటిలో 66 శాతం ఏపీకి, 34 శాతం నీటిని తెలంగాణ రెండేళ్లపాటు వినియోగించుకోవడానికి అంగీకరించారు. అలాగే, 2020 అక్టోబర్‌ 6న అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశం జరిగింది. అప్పటి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రావు హాజరయ్యారు. కొత్తగా.. గోదావరి బేసిన్‌ నుంచి కృష్ణా బేసిన్‌కు 45 టీఎంసీలను తరలించేందుకు కేసీఆర్‌ అంగీకరించారు. గోదావరి వరద జలాలను తరలించుకుపొమ్మని అపెక్స్‌ కౌన్సిల్లో కేసీఆర్‌ చెప్పారు. కానీ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాత్రం 2023 జూలై 10న అప్పటి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌కు హరీశ్‌ లేఖ రాశారు. కేటీడబ్ల్యూ-2లో నీటి వినియోగాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు 50:50 రేషియోలో కేటాయించాలని కోరారు’’ అని వివరించారు. 2015, 2020ల్లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో 299 టీఎంపీలకు కేసీఆర్‌, హరీశ్‌ రావు అంగీకరించారని, తర్వాత తప్పు చేశామని ఒప్పుకొని 2023లో 50 శాతం అంటే 405 టీఎంసీలు ఇవ్వాలని లేఖ రాశారని, తాను 500 టీఎంసీలు ఇవ్వాలని అడిగితే తప్పుబడుతున్న హరీశ్‌ రావు.. 405 టీఎంసీలు చాలని లేఖ ఎలా రాశారని రేవంత్‌ నిలదీశారు.

ఈ వివరాలన్నిటినీ తాను నోటి మాటకు చెప్పడం లేదంటూ వాటికి సంబంధించిన ఆధారాలు, జీవోల కాపీలను మీడియాకు అందించారు. గత పదేళ్లలో కేసీఆర్‌ అనుమతితోనే గోదావరి, కృష్ణా నదులపై ఏపీ పలు నిర్మాణాలు చేసిందని ఆరోపించారు. ‘‘కేసీఆర్‌ నాలుగుసార్లు ఏపీ ముఖ్యమంత్రులను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని సమావేశాలు నిర్వహించారు. ఏపీ నీటి తరలింపునకు గేట్లు తెరిచారు. వైసీపీ నాయకురాలు రోజా ఇంటికెళ్లి రాగి సంగటి తిని మరీ రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు’’ అని గుర్తు చేశారు. చేసినవన్నీ చేసేసి.. ఇప్పుడేమో తమకేదీ తెలియదన్నట్టు బీఆర్‌ఎస్‌ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం.. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ, ఏపీలు ఏమైనా నిర్మాణాలు చేపట్టాలంటే మరో రాష్ట్రం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, అదే చట్టం ప్రకారం ఇప్పుడు బనకచర్లకు సైతం తెలంగాణ అనుమతి తప్పనిసరని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు వచ్చిన తర్వాత.. ఏపీ ప్రాజెక్టులపై తమకెలాంటి అభ్యంతరం లేదని పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే వరద జలాలు ఎన్ని సముద్రంలో కలుస్తున్నాయో తేలతాయని, దానికి ముందే చంద్రబాబు ఎలా చెబుతారని ప్రశ్నించారు.

కాళేశ్వరం పూర్తి చేయాలంటే.. మరో రూ.50 వేల కోట్లు కావాలి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80 వేల కోట్లే ఖర్చయితే, లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని బీఆర్‌ఎస్‌ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని రేవంత్‌ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,27,827 కోట్లకు టెండర్లు పిలిచారని, అందులో రూ.95,902 కోట్ల బిల్లుల చెల్లింపులు పూర్తి చేశారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పెండింగ్‌ పనులు పూర్తి కావాలంటే మరో రూ.50 వేల కోట్లు అవసరమని తెలిపారు. కాళేశ్వరంతో 50 వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే పెరిగిందని, దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడానికి, కాళేశ్వరానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పునర్విభజన చట్టం ప్రకారం.. కాళేశ్వరం నిర్మాణానికి ఏపీ ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. అది కొత్త ప్రాజెక్టు కాదని, పాత ప్రాజెక్టునే రీ డిజైన్‌ చేశారని బదులిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎం అని మోదీ, అమిత్‌ షా అంటున్నారని, ఆ పార్టీకే చెందిన ఎంపీ ఈటల రాజేందర్‌ మాత్రం విభేదిస్తున్నారని అన్నారు.

కిషన్‌ రెడ్డికి కేటీఆర్‌ ట్యూషన్‌ మాస్టర్‌

హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు అనుమతి, బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం తెలిపేందుకు తాను ఢిల్లీకి వస్తున్నానని తెలిసి, ఒకరోజు ముందే కిషన్‌ రెడ్డి వెళ్లి ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలిశారని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ‘‘కిషన్‌ రెడ్డి నోరు తెరిస్తే చెప్పేవన్నీ అబద్ధాలే. తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి వెళదామంటే ముందుకు రాని కిషన్‌ రెడ్డి.. కేంద్ర మంత్రిని ఏ ఉద్దేశంతో కలిశారో తెలియదు. కిషన్‌ రెడ్డికి కేటీఆర్‌ అలియాస్‌ ట్విటర్‌ టిల్లు ట్యూషన్‌ మాస్టర్‌. లైజనింగ్‌ ఆఫీసర్‌. కేటీఆర్‌ ఏం చెబితే.. కిషన్‌ రెడ్డి అదే చేస్తారు. మాట్లాడతారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌ అనేకచోట్ల డిపాజిట్లు కోల్పోయి అవయవ దానం చేసింది. బీజేపీకి జీవం పోసింది. కేసీఆర్‌ అడ్డా మెదక్‌లోనూ బీజేపీ ఎంపీ గెలవడం చూస్తుంటే.. ఏ స్థాయిలో అవయవ దానం జరిగిందో అర్థమవుతోంది’’ అని వ్యాఖ్యానించారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో మరోసారి ఢిల్లీకి వస్తానని చెప్పారు.

ఇవి కూడా చదవండి

విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

మెట్రో రైలులో అలజడి సృష్టించిన పాము..

Updated Date - Jun 21 , 2025 | 02:59 AM