Medical Colleges: అన్ని వైద్య కళాశాలల్లో పూర్తి వసతులు
ABN, Publish Date - Jun 17 , 2025 | 03:30 AM
రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు మూడేళ్లలో పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని, దీనికి కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ
నర్సింగ్ కళాశాలల్లో ఆప్షనల్‌గా జపాన్ భాష
ప్రతి నెలా విద్య, వైద్యారోగ్య శాఖలపై సమీక్ష
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, జూన్ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు మూడేళ్లలో పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని, దీనికి కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ప్రతి కళాశాలను సందర్శించి, అక్కడి అవసరాలపై నివేదిక సమర్పించాలని నిర్దేశించారు. సీఎం సోమవారం ఐసీసీసీలో వైద్యా రోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు, బోధన సిబ్బందికి పదోన్నతులు, ఖాళీల భర్తీ, అనుబంధ ఆస్పత్రుల్లో పడకల పెంపు తదితర అంశాలపై కూడా సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వెంటనే విడుదల చేస్తామని తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలు ఉంటే వెంటనే తెలియజేయాలని, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఆ శాఖ అధికారులను సంప్రదించి పరిష్కరిస్తామని చెప్పారు. నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ (జపాన్ భాష)ను ఒక ఆప్షనల్‌గా నేర్పించాలని, జపాన్‌లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని సీఎం తెలిపారు. ఈ విషయంలో మద్దతు ఇచ్చేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆస్పత్రుల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్‌ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. విద్యా, వైద్య రంగాలు ఎంతో కీలకమని, ప్రతి నెలా మూడో వారంలో ఈ రెండు శాఖలపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 17 , 2025 | 03:30 AM