Jagga Reddy: రాహుల్ జన్మదినం సందర్భంగా.. క్యాన్సర్ రోగికి జగ్గారెడ్డి ఆర్థిక సాయం
ABN, Publish Date - Jun 20 , 2025 | 04:36 AM
గురుకుల పాఠశాలలో అతడో చిరుద్యోగి. నెల వేతనం రూ. 13 వేలకు మించి లేదు. ఆ కొద్దిపాటి ఆదాయంతోనే భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు. అయితే, ఆ చిరుద్యోగి కొంత కాలం కిందట క్యాన్సర్ బారిన పడ్డాడు.
ఆఫీసుకు పిలిచి 10లక్షల అందజేత
వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తానని హామీ
ఇప్పటి వరకు వైద్యానికి అయిన ఖర్చును
సీఎంఆర్‌ఎఫ్ నుంచి ఇప్పిస్తానని భరోసా
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): గురుకుల పాఠశాలలో అతడో చిరుద్యోగి. నెల వేతనం రూ. 13 వేలకు మించి లేదు. ఆ కొద్దిపాటి ఆదాయంతోనే భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు. అయితే, ఆ చిరుద్యోగి కొంత కాలం కిందట క్యాన్సర్ బారిన పడ్డాడు. క్యాన్సర్ వైద్యం.. ఖరీదైనది కావడంతో ముచ్చటైన ఆ కుటుబం ఆర్థిక పరిస్థితి పూర్తిగా తల్లకిందులైంది. ఇప్పటికే వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేసిన కుటుంబ సభ్యులు.. ఇక ముందు ట్రీట్‌మెంట్ ఎలా చేయించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరికృష్ణ ప్రసాద్ దీన గాథ ఇది. ఆయనకు భార్య శైలజ, ఎల్‌కేజీ, ఒకటో తరగతి చదువుతున్న పాప, బాబు ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా.. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నాడు.
తన అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ఆ చిరుద్యోగిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా ఆర్థిక సాయం అందించాలన్న నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడువుగా హరికృష్ణప్రసాద్ కుటుంబాన్ని గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకుని రూ.10 లక్షల సాయం అందించారు. రానున్న రోజుల్లో వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చారు. ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానంటూ దైర్యం చెప్పారు. జగ్గారెడ్డిని కలిసిన వారిలో బాధితుడితో పాటు ఆయన భార్య, తల్లి, సోదరుడు ఉన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 04:36 AM