Foot Washing: కాళ్లు తుడిపించే వ్యవహారం.. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌కు బీఆర్ఎస్ మహిళల ఫిర్యాదు..
ABN, Publish Date - May 15 , 2025 | 06:50 PM
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ప్రస్తుతం ఓ విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ సుందరీమణుల కాళ్లను తెలంగాణ మహిళలతో కడిగించి, తుడిపించటంపై బీఆర్ఎస్ మహిళా నేతలు మండిపడ్డారు. దీంతోపాటు బతుకమ్మ విషయంలో కూడా అవమానం జరిగిందని మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఇటీవల ఓ సమావేశంలో భాగంగా ప్రపంచ సుందరీమణుల కాళ్లను తెలంగాణ మహిళలతో కడిగించి, టవల్‌తో తుడిపించటంపై బీఆర్ఎస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. కాళ్లు కడిగించడం తెలంగాణ సంస్కృతి కాదని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. సీతక్క లాంటి మంత్రులు కడిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇది మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆమె ఆరోపించారు.
చర్యలు తీసుకోవాలని...
సాధారణ మహిళలతో కడిగించడం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని సునీత పేర్కొన్నారు. మహిళలతో ఇలాంటి పనులు చేయించడం వారి గౌరవాన్ని కించపరచడమేనని ఆగ్రహించారు. అంతేకాదు బతుకమ్మనూ అవమాన పరిచారని గుర్తు చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులతో చెప్పులు వేసుకుని బతుకమ్మ ఆట ఆడించడం వంటి చర్యలు, తెలంగాణ సంస్కృతికి విరుద్ధమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బతుకమ్మ గౌరవాన్ని దెబ్బతీసిన ఇలాంటి సంఘటనలపై మహిళా కమిషన్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
మహిళల గౌరవం..
తెలంగాణలో మహిళల గౌరవం సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగమని, అలాంటి వారు తమ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ సమాజంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నారని మాజీ ఎమ్మెల్యే అన్నారు. కానీ, ఈ తరహా సంఘటనలు మహిళల గౌరవాన్ని కించపరచడం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతిలో భాగంగా మహిళల పాత్రను అర్థం చేసుకోవడం, వారి గౌరవాన్ని కాపాడడం, సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించడం చాలా అవసరమని గుర్తు చేశారు. ఈ క్రమంలో మహిళలు తమ హక్కులను, గౌరవాన్ని కాపాడుకోవడానికి సమాజంలో ఒకటిగా నిలబడాలన్నారు గొంగిడి సునీత.
Also Read:
ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్..ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..
గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - May 15 , 2025 | 08:20 PM