Kaleshwaram Commission: సర్కారు నిర్ణయాలపై ఏం చేద్దాం..?
ABN, Publish Date - Aug 04 , 2025 | 03:51 AM
కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా బీఆర్‌ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై సర్కారు క్రిమినల్ చర్యలు చేపట్టే అవకాశముందన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌తో ముఖ్య నేతలు భేటీ అయ్యారు.
ఫాంహౌస్‌లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై చర్చ
కవిత వ్యవహారం, బీసీ రిజర్వేషన్ల అంశంపైనా సమాలోచనలు
నేడు కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు వెళ్లనున్న బీఆర్‌ఎస్ నేతలు
హైదరాబాద్/గజ్వేల్/ మహదేవపూర్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా బీఆర్‌ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై సర్కారు క్రిమినల్ చర్యలు చేపట్టే అవకాశముందన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌తో ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఆదివారం ఎర్రవల్లి ఫామ్‌హౌ్‌సలో కేసీఆర్‌ను మాజీమంత్రులు తన్నీరు హరీశ్‌రావుతో పాటు పలువురు నేతలు కలిసినట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో పేర్కొన్న అంశాలేంటి? దాని ఆధారంగా రాష్ట్ర సర్కారు ఏవైనా చర్యలు తీసుకుంటే ఏం చేయాలన్న దానిపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. క్యాబినెట్ భేటీలో ఏం చర్చిస్తారు.. కాళేశ్వరం కమిటీ నివేదిక ఆధారంగా అధికారులు ఎటువంటి వివరాలను సిద్ధం చేశారు.. దాని ఆధారంగా క్యాబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోనుందన్న దానిపై వారు సమాలోచన చేసినట్లు సమాచారం. కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని పీసీ ఘోష్ కమిషన్ సూచించినట్లయితే దాన్ని ఎదుర్కొనేందుకు ఏం చేయాలన్న దానిపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం ఏం చేయబోతోంది.. దాన్ని ముందుగా పసిగట్టి అందుకు అనుగుణంగా న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు శనివారం సమావేశమైన నేపథ్యంలో.. వారి ఆలోచనలేంటి? పార్టీ పరంగా ఏ నిర్ణయాలు తీసుకుందాం.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో స్పీక ర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అంతవరకు వేచిచూసి తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించినట్లు తెలిసింది.
ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపైనా చర్చ..
కేసీఆర్‌తో భేటీలో ఎమ్మెల్సీ కవిత అంశంపైనా పార్టీ నేతలు చర్చించినట్లు తెలిసింది. అలాగే బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు శ్రావణ మాసం కావడంతో ఫాంహౌ్‌సలో చండీయాగం చేసే విషయమై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. భేటీలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కూడా పాల్గొన్నారు.
నేడు కాళేశ్వరానికి బీఆర్‌ఎస్ నేతల రాక!
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కన్నెపల్లి పంప్‌హౌ్‌సను బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు సోమవారం సందర్శించనున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, వొడితెల సతీశ్‌బాబు, సుంకె రవిశంకర్, భూపాలపల్లి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి పర్యటించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కన్నెపల్లి పంప్‌హౌ్‌సను సందర్శించి వారు స్థితిగతులను పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. అనంతరం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడతారని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..
ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన
Read latest Telangana News And Telugu News
Updated Date - Aug 04 , 2025 | 03:51 AM