BRS: బీఆర్‌ఎస్‌లో రజతోత్సవ రగడ!
ABN, Publish Date - Apr 22 , 2025 | 04:01 AM
బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల వేళ.. నేతల్లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఓవైపు 25 ఏళ్ల ఉత్సవాలను వైభవంగా జరుపుకొనేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు నేతల మధ్య సమన్వయలేమి, వర్గపోరు తెరపైకి వస్తున్నాయి.
నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలపై లొల్లి
మాజీ మంత్రులు వర్సెస్ ఎమ్మెల్సీలు
మొదట్లో హడావుడి చేసిన హరీశ్‌రావు
సభా వేదిక మార్పుతో సైలెంట్
ఎర్రబెల్లి హవాకు ఓ వర్గం నేతల చెక్?
వరంగల్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల వేళ.. నేతల్లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఓవైపు 25 ఏళ్ల ఉత్సవాలను వైభవంగా జరుపుకొనేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు నేతల మధ్య సమన్వయలేమి, వర్గపోరు తెరపైకి వస్తున్నాయి. నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలతోపాటు తనకు సమాచారమే ఇవ్వడం లేదంటూ సొంత పార్టీ నేతలపైనే కొందరు విమర్శలు చేస్తున్నారు. మొదట్లో సభ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు.. ఉనికిచర్ల వద్ద స్థలాన్ని కూడా ఖరారు చేశారు. అయితే ఏం జరిగిందో ఏమోగానీ హరీశ్‌రావు ఎంపిక చేసిన స్థలాన్ని మార్చటంతోపాటు బాధ్యతల నుంచి కూడా ఆయనను తప్పించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కూడా పక్కనపెట్టి.. సభ నిర్వహణ బాధ్యతలు మరో వర్గానికి అప్పగించారు. దీంతో గులాబీ పార్టీలో నేతల మధ్య విభేదాలు తలెత్తాయనే చర్చ జరుగుతోంది. మొదట్లో రజతోత్సవ సభ ఏర్పాట్లను హరీశ్‌రావే పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లితోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సభ నిర్వహణకు స్థలం కోసం భట్టుపల్లి, మామునూరు, ఉనికిచర్ల సమీపంలో ఖాళీ స్థలాలను రెండుసార్లు పరిశీలించారు. చివరికి ఉనికిచర్లను ఖరారు చేశారు. ఈ క్రమంలోనే నేతల మధ్య సమన్వయ లోపం బయట పడటంతో అనూహ్యంగా సభను ఘట్‌కేసర్‌కు మార్చాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. దీంతో ఉలిక్కి పడిన వరంగల్, కరీంనగర్ నేతలు కేసీఆర్‌ను కలిసి ఎల్కతుర్తిలో సభ నిర్వహించేలా ఒప్పించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ పార్లమెంట్, హనుమకొండ జిల్లా పరిధిలో ఎల్కతుర్తి ఉండటంతో ఏ ఒక్క జిల్లా నేతల ఆధిపత్యం ఉండకుండా చూశారనే చర్చ జరుగుతోంది.
ఓరుగల్లు పర్యటనకు రాని హరీశ్‌రావు..
ఉనికిచర్ల సభాస్థలిని ఫైనల్ చేసిన తరువాత హరీశ్‌రావు ఓరుగల్లు పర్యటనకు రాకపోవడం, దయాకర్‌రావు కూడా అలా వచ్చి.. ఇలా వెళ్లిపోవటం పార్టీ క్యాడర్‌లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా 18న ఎర్రవల్లి ఫామ్‌హౌ్‌సలో కేసీఆర్ ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి ఎర్రబెల్లి దూరంగా ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, సభను విజయవంతం చేసేందుకుగాను బీఆర్‌ఎస్ అధిష్ఠానం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే నియోజకవర్గంలో క్యాడర్‌ను సమన్వయం చేయడంలో ఆమె విఫలమయ్యారని ఎమ్మెల్సీ రవీందర్‌రావు పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ విమర్శించారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల విషయంలో బీఆర్‌ఎ్‌సలో కోల్డ్‌వార్ జరుగుతోంది. ఎర్రబెల్లి గతంలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించడంతో రజతోత్సవ సభకు పాలకుర్తితోపాటు వర్ధన్నపేట ఇన్‌చార్జి బాధ్యతలు కూడా తానే చూసుకుంటానని అధిష్టానానికి తెలిపారు. అయితే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డికి వర్ధన్నపేట ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాలని మరో వర్గం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చింది. దీంతో అక్కడ ఎర్రబెల్లి వర్సెస్ పోచంపల్లిగా లొల్లి కొనసాగింది. ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లోనూ ఇదే ఆధిపత్య పోరు నడుస్తోంది. కాగా, సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు కేటీఆర్ మంగళవారం ఎల్కతుర్తికి రానున్నారు. దీంతో కేటీఆర్ పర్యటనతోనైనా పార్టీలో అంతర్గత విభేదాలకు చెక్ పడుతుందా? లేదా? అనే చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Revanth Reddy: ఆ అధికారిని రిటైరయ్యాక కొనసాగించండి
BRS MLC Kavitha: పేరుకే ముగ్గురు మంత్రులు అభివృద్ధి శూన్యం
Cybercrime: సైబర్ నేరగాళ్లకు కమీషన్‌పై ఖాతాల అందజేత
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 22 , 2025 | 04:02 AM