BJP: స్థానికంపై కమలం గురి
ABN, Publish Date - Jul 15 , 2025 | 05:52 AM
స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పంచాయతీ నుంచి మున్సిపాలిటీల వరకు పట్టు సాధించే దిశగా వ్యూహాత్మక కార్యాచరణను రూపొందిస్తోంది.
పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ.. ‘బీజేపీ వస్తేనే స్వర్ణ తెలంగాణ’ నినాదంతో ప్రజల్లోకి
నేడు రాష్ట్ర పదాధికారులతో ప్రత్యేక వర్క్‌షాప్
ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ మండలాధ్యక్షులకు శిక్షణ
జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఎన్ రాంచందర్‌రావు
తొలిరోజు సోమవారం నల్గొండ, సూర్యాపేటలో పర్యటన
హైదరాబాద్, జులై 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పంచాయతీ నుంచి మున్సిపాలిటీల వరకు పట్టు సాధించే దిశగా వ్యూహాత్మక కార్యాచరణను రూపొందిస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు బీజేపీ అఽధికారంలోకి వస్తేనే ‘స్వర్ణ తెలంగాణ’ సాధ్యం అన్న నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం, గ్రామీణ ప్రాంతాల్లో మండలం, నగరాల్లో డివిజన్ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించనుంది. గ్రామాలవారీగా తమ బలం, బలహీనతలపై కూడా బీజేపీ నివేదికలను రూపొందించుకుంది. వీటి ఆధారంగా స్థానిక పార్టీ క్యాడర్‌తో సమీక్షించి అందుకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి సన్నద్ధమైంది. మంగళవారం రాష్ట్ర పదాధికారులకు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఏయే ప్రాంతాల్లో పార్టీకి పట్టుంది.. ఎక్కడ బలహీనంగా ఉంది.. వంటి అంశాలను ఇందులో సమీక్షించనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ కూడా హాజరు కానున్నారు. మరోవైపు, రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలను ఐదు జోన్‌లుగా విభచించిన పార్టీ నాయకత్వం, ఆయా జోన్‌ల పరిధిలోని మండల పార్టీ అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది.
ఉమ్మడి హైదరాబాద్, నల్గొండ జిల్లాల నాయకులకు మంగళవారం సాయంత్రం శిక్షణా సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై బుధవారం కూడా వీరికి శిక్షణ ఇవ్వనున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల్లో సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఓటు బ్యాంకు పెంచుకోవచ్చని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే తాము గణనీయంగా బలపడ్డామని భావిస్తున్న కమలనాథులు, చట్టసభల ఎన్నికల్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సీట్లు పెంచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల పార్టీ కొంత బలహీనంగా ఉన్నమాట వాస్తవం. ఆ ప్రాంతాల్లో బలోపేతం కావాలి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి కూడా మాకు అభ్యర్థుల్లేరు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. గతంతో పోలిస్తే మెరుగుపడినా, ఇంకా చేయాల్సింది చాలా ఉంది’’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు స్పష్టం చేశారు. పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి నల్గొండ నుంచి రాంచందర్‌రావు క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించడం విశేషం. తొలిదశలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలు, ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18, 19తేదీల్లో రాంచందర్‌రావు ఉత్తర తెలంగాణలో పర్యటించనున్నారు. 25, 26 తేదీల్లో దక్షిణ తెలంగాణ పరిధిలోని మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లే అవకాశం ఉందని పార్టీవర్గాలు వివరించాయి. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ స్పష్టం చేశారు. ఇందుకోసం, పార్టీ నాయకత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతోందని ఆయన చెప్పారు.
దళిత కార్యకర్త ఇంట్లో రాంచందర్‌రావు బస
స్థానిక సంస్థల ఎన్నికలే తన మొదటి టార్గెట్ అని ప్రకటించిన రాంచందర్‌రావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా సోమవారం జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. చౌటుప్పల్, నల్గొండ, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. రాంచందర్‌రావు తన సొంతూరు నల్లబండగూడెంలో దళిత కార్యకర్త ఇంట్లో రాత్రి బస చేశారు.
ఇవి కూడా చదవండి
నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '
తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 15 , 2025 | 05:52 AM