Minister Tummala: పంట వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి
ABN, Publish Date - May 01 , 2025 | 06:34 AM
పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల నేల ఆరోగ్యంతోపాటు పంటలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వాటిని వినియోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం, ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు.
రైతులకు అదనపు ఆదాయం: మంత్రి తుమ్మల
పంట వ్యర్థాలను తగలబెట్టడంతో నేల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా పంటల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎరువులు, పురుగుమందుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని తగ్గించడంతోపాటు పంట వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా సహజ వనరుల పరిరక్షణా జరుగుతుందని వివరించారు. ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు రైతులు పంట వ్యర్థాల నుంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం దక్షిణాఫ్రికాకు చెందిన బయోవేస్ట్ ఎనర్జీ సంస్థ రాష్ట్రానికి చెందిన స్పాన్ టెక్ ఇంజినీర్స్, ఎకోమ్యాక్స్ ఎనర్జీ సంస్థల మధ్య పంట వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుపై ఒప్పందం జరిగింది. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దక్షిణాఫ్రికా కాన్సులేట్ జనరల్ గిడెన్ లిబెన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ... పంట వ్యర్థాఽలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. సుమారు రూ. 1,500 కోట్ల వ్యయంతో.. 20 బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణానికి కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.
Updated Date - May 01 , 2025 | 06:35 AM