Tragic Accident: కన్న తల్లి కళ్లెదుటే..
ABN, Publish Date - Jun 28 , 2025 | 03:18 AM
ఆరేళ్ల వయసులోనే ఆ బాలుడికి నూరేళ్లు నిండాయి. ఆ చిన్నారిని టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. స్కూల్లో దిగబెట్టేందుకు తల్లి, స్కూటీపై తీసుకెళుతుండగా అదుపుతప్పిన ఆ వాహనం, టిప్పర్ కిందకు దూసుకెళ్లడంతో ప్రమాదం సంభవించింది.
టిప్పర్ చక్రాల కింద నలిగి ఆరేళ్ల బాలుడి దుర్మరణం
ఓవర్ టేక్ చేస్తూ అదుపుతప్పి టిప్పర్ కిందకు స్కూటీ
ప్రమాదం నుంచి బయటపడ్డ తల్లి.. కుమారుడి మృతి
దుండిగల్ పరిధిలోని మల్లంపేటలో విషాద ఘటన
దుండిగల్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల వయసులోనే ఆ బాలుడికి నూరేళ్లు నిండాయి. ఆ చిన్నారిని టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. స్కూల్లో దిగబెట్టేందుకు తల్లి, స్కూటీపై తీసుకెళుతుండగా అదుపుతప్పిన ఆ వాహనం, టిప్పర్ కిందకు దూసుకెళ్లడంతో ప్రమాదం సంభవించింది. టిప్పర్ టైర్ కింద నలిగి చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. దుండిగల్ పరిధిలోని మల్లంపేటలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి తల్లి సురక్షితంగా బయటపడింది. మృతుడు అభిమన్షు రెడ్డి (6). బాలుడి తల్లిదండ్రులు గుడిపల్లి రాజిరెడ్డి, నిహారిక. నిజామాబాద్ రూరల్ మండలం కేశవపూర్ వాస్తవ్యులు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ఐదేళ్ల క్రితం మల్లంపేటకొచ్చి ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు కొడుకు అభిమన్షు రెడ్డితో పాటు మూడేళ్ల కూతురు దివిషా ఉంది.
అభిమన్షు రెడ్డి భౌరంపేట రోడ్డులోని ఓ ప్రైవేటు స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం అభిమన్షును తల్లి నిహారిక తన స్కూటీ మీద ఎక్కించుకొని స్కూల్లో దిగబెట్టేందుకు బయలుదేరింది. మార్గమధ్యలో టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో స్కూటీ అదుపు తప్పి పడిపోయింది. తల్లి, కుమారుడు కింద పడిపోగా.. టిప్పర్ టైరు అభిమన్షు తల మీద నుంచి వెళ్లింది. నిహారిక ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులొచ్చి బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాందీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా దుండిగల్ ప్రమాదంలో బాలుడి మృతి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
చైనాతో ఫలించిన చర్చలు.. ఆరేళ్ల తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం..
రథయాత్రలో అపశ్రుతి.. బీభత్సం సృష్టించిన ఏనుగు..
For More National News
Updated Date - Jun 28 , 2025 | 03:18 AM