Share News

Rath Yatra: రథయాత్రలో అపశ్రుతి.. బీభత్సం సృష్టించిన ఏనుగు..

ABN , Publish Date - Jun 27 , 2025 | 11:57 AM

Rath Yatra 2025: శుక్రవారం అహ్మదాబాద్‌లో జరిగిన జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఊరేగింపులో పాల్గొన్న ఉత్సవ ఏనుగులు హఠాత్తుగా రోడ్డు మధ్య అటూ ఇటూ పరుగెడుతూ బీభత్సం సృష్టించాయి. ఈ కోలాహలంలో ఇప్పటివరకూ ఇద్దరు భక్తులు గాయపడ్డారు.

Rath Yatra: రథయాత్రలో అపశ్రుతి.. బీభత్సం సృష్టించిన ఏనుగు..
Elephant Disrupts Rath Yatra

Ahmedabad Rath Yatra Elephant rampage: శుక్రవారం అహ్మదాబాద్‌లో జరిగిన 148వ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి ఉత్సవ ఏనుగు రోడ్డుకు అడ్డంగా అటుఇటూ పరుగెడుతూ కలకలం రేపింది. దీంతో రథయాత్రలో పాల్గొన్న భక్తులు హడలెత్తిపోయారు. మావటి వాళ్లు కాసేపట్లోనే ఏనుగును నియంత్రించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ఉత్సవంలో పాల్గొన్న కొన్ని ఏనుగులను పోలీసులు పక్కకు తరలించారు. ఈ ఘటనలో కనీసం ఇద్దరు భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది.


శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమాల్‌పూర్‌లోని జగన్నాథ ఆలయంలో మంగళ హారతి నిర్వహించగా.. గుజరాత్ి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 'పహింద్' (బంగారు చీపురుతో ఊడ్చడం) ఆచారం నిర్వహించారు. ఆ తర్వాత 148వ రథయాత్ర ప్రారంభమైంది. 16 కిలోమీటర్ల పాటు సాగే ఈ ఊరేగింపులో ఉదయం 10.15 గంటల సమయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నగరంలోని ఖాదియా ప్రాంతం గుండా జగన్నాథ రథయాత్ర సాగుతుండగా ఈ ఘటన జరిగింది.


ఒక ఉత్సవ ఏనుగు అకస్మాత్తుగా ఊరేగింపు నుంచి పక్కకు జరిగి రోడ్డు మీదుగా పరుగులు పెట్టింది. రద్దీగా ఉండే ఇరుకైన వీధిలోకి వెళ్లడంతో ప్రజల్లో భయాందోళనలు రేకెత్తాయి. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై గుంపుగా గుమికూడిన ప్రజల్ని దూరంగా వెళ్లిపొమ్మని హెచ్చరించారు. కాసేపట్లోనే మావటి వాళ్లు కూడా ఆవేశంగా పరుగెత్తిన ఏనుగును వెంబడించి అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత ఒకట్రెండు ఏనుగులు కూడా ఇలాగే ప్రవర్తించాయి. వీటన్నింటిని పోలీసులు ఊరేగింపు జరుగుతున్న చోటు నుంచి పక్కకు తరలించారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. అయినప్పటికీ, షెడ్యూల్ ప్రకారమే ఊరేగింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాగా, ఊరేగింపులో ఏనుగు భీభత్సం సృష్టించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అట్టహాసంగా పూరీ రథయాత్ర ప్రారంభం..

కరుణానిధి బాటలోనే నేను.. ప్రాణమున్నంతవరకూ పార్టీ అధ్యక్షుడినే

Read Latest Telangana News and National News

Updated Date - Jun 27 , 2025 | 02:32 PM