eSIM Scam: మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
ABN, Publish Date - Aug 31 , 2025 | 03:05 PM
దేశంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దానికి అనుబంధంగా సైబర్ మోసాలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో మోసం eSIM స్కామ్. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశంలో ఇటీవల కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా మొబైల్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని మోసాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా eSIM పేరుతో కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీనివల్ల ఇప్పటికే కొంతమంది నష్టపోయారు. ఓ కేసులో మోసగాళ్లు, ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి OTP లేకుండానే రూ. 4 లక్షలు లూటీ చేశారు. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన Indian Cybercrime Coordination Centre (I4C) అప్రమత్తమై ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది.
ఈ స్కామ్ ఎలా జరుగుతుంది?
ఈ స్కామ్ ఎంతో కఠినమైన టెక్నిక్‌తో చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ముందుగా మోసగాళ్లు బాధితుడికి కాల్ చేసి, ఒక eSIM యాక్టివేషన్ లింక్ పంపిస్తారు. ఆ లింక్ పై క్లిక్ చేస్తే, బాధితుడి ఫిజికల్ సిమ్ eSIMగా మారిపోతుంది. దీంతో అసలు SIM నెట్‌వర్క్ పనిచేయడం మానేస్తుంది. వచ్చే కాల్స్, మెసేజ్‌లు అన్నీ మోసగాళ్ల చేతిలోకి వెళ్తాయి. దీని వల్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్‌కి అవసరమైన OTPలు కూడా మోసగాళ్ల eSIMకే వెళతాయి. ఆ క్రమంలో వాళ్లు సులభంగా బ్యాంక్ లావాదేవీలను పాస్‌వర్డ్ లేదా ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ లేకుండానే తీసుకుంటారు.
ఈ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలి
ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి నుంచి eSIM లింక్ వస్తే వెంటనే డిలీట్ చేయండి. అలాంటి లింక్స్ మీద క్లిక్ చేయొద్దు. నిజమైన నెట్‌వర్క్ ప్రొవైడర్లు ఇలాంటివి పంపించరు.
మీ సిమ్‌ని eSIM గా మార్చాలనుకుంటే, నేరుగా మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే తీసుకోండి. మూడో వ్యక్తి సహాయం తీసుకోవద్దు
హఠాత్తుగా మీ ఫోన్‌లో నెట్‌వర్క్ ఆగిపోతే, అది స్కామ్ సంకేతం కావచ్చు. వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్, మొబైల్ నెట్‌వర్క్ సపోర్ట్‌కి కాల్ చేయండి.
ఐ4సీ గురించిన సమాచారం
Indian Cybercrime Coordination Centre (I4C) 2020లో హోం మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడింది. దీని ముఖ్య ఉద్దేశం సైబర్ నేరాలను ఎదుర్కొనడం, వివిధ రాష్ట్రాల పోలీసు శాఖల మధ్య సహకారం పెంపొందించడం. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ eSIM స్కామ్ విషయంలో ముందుగానే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో టెక్నాలజీని సురక్షితంగా ఉపయోగించాలంటే అప్రమత్తత చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మీ మొబైల్ సిమ్, బ్యాంకింగ్ సమాచారం మీ చేతుల్లోనే ఉంచుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 31 , 2025 | 03:23 PM