Mumbai Indians: అగ్రస్థానం చేరుకున్న ముంబై ఇండియన్స్.. ఆసక్తికరంగా ప్లేఆఫ్
ABN, Publish Date - May 02 , 2025 | 07:32 AM
Mumbai Indians: రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్‌లోకి చేరుకుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 గెలిచి, నాలుగింటిలో మాత్రమే ఓడింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా ఆరో విజయం. ముంబై విజయంతో ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)లో లీగ్ దశలో 50 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే గురువారం ముంబై (Mumbai Indians) వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసి రికార్డ్ సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టును 100 పరుగుల తేడాతో ఓడించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. దీంతో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా RR నిలిచింది. ఇప్పటికే చెన్నై ఈ రేసు నుంచి తప్పుకుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచులో ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం ఆటకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 16.1 ఓవర్లలో 117 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది.
మొత్తంగా..
ఈ విజయంతో ముంబై (Mumbai Indians) ప్లేఆఫ్స్ కు చేరుకునే అవకాశాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ జట్టు 11 మ్యాచ్‌ల్లో మొత్తంగా ఏడో విజయాన్ని సాధించింది. ఈ జట్టు 4 ఓటములతో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పుడు ముంబై సొంతంగా అర్హత సాధించాలంటే మిగిలిన 3 మ్యాచ్‌ల్లో 2 గెలవాలి. ఇకపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే, వారు తమ మిగిలిన మ్యాచ్‌లలో కనీసం 2 విజయాలు సాధించాలి. ప్రస్తుతం ఆర్సీబీ 10 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌కు క్వాలిఫై కావడానికి సాధారణంగా 16 పాయింట్లు ఉండాలి.
హైదరాబాద్ మాత్రం..
మరోవైపు హైదరాబాద్ జట్టు మాత్రం అన్ని మ్యాచ్‌లను గెలవాల్సి ఉంది. ఈరోజు GT SRHతో ఆడనుంది. హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 6 ఓటములతో 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలవడం ద్వారా, ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. తర్వాత SRH మిగిలిన 4 మ్యాచ్‌లను గెలవాలి. దీంతోపాటు ఇతర జట్ల కంటే రన్ రేట్‌ను మెరుగ్గా ఉంచుకోవాలి. ఒకవేళ ఈరోజు హైదరాబాద్ ఓడిపోతే ప్లేఆఫ్ రేసులో ఇబ్బందులు మరింత పెరుగుతాయి. మిగిలిన మ్యాచ్‌లను గెలవడానికి ఇతర జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది.
మ్యాచ్ గెలిస్తే
గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 3 ఓటములతో 12 పాయింట్లతో ఉంది. ఈరోజు మ్యాచ్ గెలిస్తే ఈ జట్టు 14 పాయింట్లతో నంబర్ 1 స్థానానికి చేరుకుంటుంది. తన రన్ రేట్‌ను ముంబై కంటే పైన ఉంచుకోవాలి. ఈరోజు GT ఓడిపోతే, ఈ జట్టు సొంతంగా ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగిలిన 4 మ్యాచ్‌లలో 3 గెలవాల్సి ఉంటుంది. టాప్ 6 జట్లలో, నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌లో ఛాన్స్ దక్కించుకుంటాయి. KKR జట్టు ఏడో స్థానంలో ఉంది. కానీ ఇక్కడి నుంచి అన్ని మ్యాచ్‌లను గెలవాలి, అప్పుడే ఏదో ఒకటి జరుగుతుంది. ఇదెలా ఉండగా, పంజాబ్ కింగ్స్ జట్టు 10 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 10 పాయింట్లతో లక్నో ఆరో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..
Read More Business News and Latest Telugu News
Updated Date - May 02 , 2025 | 07:36 AM