Nicholas Pooran: 29 ఏళ్లకే రిటైర్‌మెంట్.. బిగ్ షాక్ ఇచ్చిన లక్నో స్టార్!
ABN, Publish Date - Jun 10 , 2025 | 08:55 AM
ఒక లక్నో సూపర్‌జెయింట్స్ స్టార్ బ్యాటర్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ఇచ్చేశాడు. 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. మరి.. ఎవరా ప్లేయర్ అనేది ఇప్పుడు చూద్దాం..
కరీబియన్ విధ్వంసక వీరుడు నికోలస్ పూరన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. 29 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడీ లక్నో సూపర్ జెయింట్స్ స్టార్. ఇది కఠినమైన నిర్ణయమని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌లో రాసుకొచ్చాడు పూరన్. వెస్టిండీస్ తరఫున 61 వన్డేల్లో 1,983 పరుగులు.. 106 టీ20ల్లో 2,275 పరుగులు చేశాడీ పించ్ హిట్టర్. అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2016లో అరంగేట్రం చేశాడు పూరన్. పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో డెబ్యూ చేశాడు.
సడన్ షాక్!
పొట్టి ఫార్మాట్‌లో అదరగొడుతుండటంతో 2019లో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కించుకున్నాడు పూరన్. 9 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించాడీ కరీబియన్ స్టార్. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ విధ్వంసక బ్యాటింగ్‌తో అభిమాన గణాన్ని మరింతగా పెంచుకున్నాడు. అయితే హఠాత్తుగా అతడు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇటీవల విండీస్ టీ20 టీమ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన ఆటగాడు.. ఇలా హఠాత్తుగా తప్పుకోవడం ఏంటని విస్మయానికి లోనవుతున్నారు. వచ్చే సంవత్సరం జరిగే టీ20 వరల్డ్ కప్‌నకు 8 నెలల ముందు రిటైర్‌మెంట్ ప్రకటించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. కాగా, ఎంతో ఆలోచించే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చాడు పూరన్. ఇన్నాళ్లూ తనకు సహకరించిన కుటుంబ సభ్యులు, విండీస్ బోర్డు, అభిమానులకు అతడు ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఆట తనకు ఎన్నో మర్చిపోలేని తీపి జ్ఞాపకాలను ఇచ్చిందన్నాడు పూరన్. విండీస్ కోసం బరిలోకి దిగిన ప్రతిసారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించానని తెలిపాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 10 , 2025 | 09:17 AM