Share News

నయా నడాల్‌

ABN , Publish Date - Jun 10 , 2025 | 05:16 AM

టెన్నిస్‌ దిగ్గజాలు అనగానే ప్రస్తుత తరానికి గుర్తొచ్చే పేర్లు రోజర్‌ ఫెడరర్‌, రఫెల్‌ నడాల్‌, నొవాక్‌ జొకోవిచ్‌. ఈ ముగ్గురు కలిసే దాదాపు అరవైకిపైగా గ్రాండ్‌స్లామ్స్‌ను కొల్లగొట్టారు. ఏ మేజర్‌ టోర్నీ ని చూసినా ఈ ముగ్గురిలో ఇద్దరు కచ్చితంగా...

నయా నడాల్‌

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

టెన్నిస్‌ దిగ్గజాలు అనగానే ప్రస్తుత తరానికి గుర్తొచ్చే పేర్లు రోజర్‌ ఫెడరర్‌, రఫెల్‌ నడాల్‌, నొవాక్‌ జొకోవిచ్‌. ఈ ముగ్గురు కలిసే దాదాపు అరవైకిపైగా గ్రాండ్‌స్లామ్స్‌ను కొల్లగొట్టారు. ఏ మేజర్‌ టోర్నీ ని చూసినా ఈ ముగ్గురిలో ఇద్దరు కచ్చితంగా ఫైనల్లో ప్రత్యర్థులుగా ఉండేవారు. అంతలా.. వీళ్లు రెండు దశాబ్దాల పాటు ప్రపంచ టెన్ని్‌సను శాసించారు. ఈ త్రయంలో ఇప్పటికే ఫెడరర్‌, నడాల్‌ ఆటకు వీడ్కోలు పలికారు. జొకో ఇంకా ఆటలో కొనసాగుతున్నా, మునుపటి స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌ కోసం రెండేళ్లుగా దండయాత్ర చేస్తున్నా, సఫలం కాలేకపోతున్నాడు. చివరిసారిగా 2023లో యూఎస్‌ ఓపెన్‌ నెగ్గాడు. మరి.. ఆ బిగ్‌ త్రీ తర్వాత ఎవరు అంటే.. వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు కార్లోస్‌ అల్కారజ్‌. అసాధారణ ఆటతీరుతో, అలుపెరగనిపోరాట పటిమతో రయ్‌మంటూ దూసుకొచ్చాడీ స్పెయిన్‌ సంచలనం. తాజాగా వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించి మట్టికోర్టులో రఫెల్‌ నడాల్‌కు వారసుడిగా కితాబు అందుకుంటున్నాడు. 2021 నుంచే గ్రాండ్‌స్లామ్‌ ఆడడం మొదలుపెట్టిన ఈ 22 ఏళ్ల కుర్రాడు.. అప్పుడే ఐదు మేజర్‌ టైటిళ్లు నెగ్గి నవతరం ఆటగాళ్లలో మేటిగా నిరూపించుకున్నాడు.


సంచలనాలతో మొదలై..

తన దేశానికే చెందిన 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వీరుడు నడాల్‌ అంటే కార్లో్‌సకు ఎంతో అభిమానం. అతడిలా కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను అందుకోవాలని నాలుగేళ్ల వయసులోనే రాకెట్‌ పట్టిన అల్కారజ్‌.. ఇప్పుడు నడాల్‌ రికార్డులనే బద్దలు కొడుతున్నాడు. ఎర్రమట్టి కోర్టు రారాజుగా ఉన్న నడాల్‌పై 2022 మాడ్రిడ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో నెగ్గి.. క్లేకోర్టులో నడాల్‌ను ఓడించిన టీనేజర్‌గా (19 ఏళ్లు) రికార్డు సృష్టించాడు. ఇదే టోర్నీ సెమీ్‌సలో నాటి వరల్డ్‌ నెం.1 జొకోవిచ్‌ను, ఫైనల్లో నెం.3 జ్వెరెవ్‌ను ఓడించి ఏకంగా మాడ్రిడ్‌ కిరీటాన్ని అందుకున్నాడు. అదే ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌తో పాటు వరల్డ్‌ నెం.1 ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. 19 ఏళ్లకే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌గా నిలిచిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఇలా, అల్కారజ్‌ టీనేజర్‌గా ఉన్నప్పుడే ప్రపంచ టెన్ని్‌సలో ప్రకంపనలు సృష్టించాడు. అంతేకాదు.. వింబుల్డన్‌లో 2018 నుంచి చాంపియన్‌గా ఉన్న జొకోవిచ్‌ను 2023 ఫైనల్లో చిత్తుచేశాడు. వరుసగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గి జోరుమీదున్న జొకోవిచ్‌కు ఆ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఓటమి రుచి చూపించాడు. ఆ మరుసటి ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో జ్వెరెవ్‌ను చిత్తుచేసి మొదటిసారి ఎర్రమట్టి కోర్టులో పాగా వేశాడు. ఆ వెంటనే వింబుల్డన్‌లో వరుసగా రెండో ఏడాదీ విజేతగా నిలిచి జొకోవిచ్‌కు కొరకరాని కొయ్యలా మారాడు.


ఆ తర్వాత కొన్నిరోజులు గాయం బారిన పడ్డా వెంటనే కోలుకున్న అల్కారజ్‌.. ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌తో మళ్లీ గాడిన పడ్డాడు. తనలోని అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తూ.. ఫైనల్లో జానిక్‌ సినర్‌తో సుదీర్ఘంగా దాదాపు ఐదున్నర గంటలపాటు పోరాడి పైచేయి సాధించాడు. వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్‌ కిరీటాన్ని ముద్డాడి క్లేకోర్టు కింగ్‌ నడాల్‌ను మరిపించాడు.

అచ్చం

అతనిలా...

గతవారం ఫ్రెంచ్‌ ఓపెన్‌తో అల్కారజ్‌ కెరీర్‌లో ఐదో గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం అతడి వయసు 22 ఏళ్ల 33 రోజులు. సరిగ్గా.. ఇదే వయసులో నడాల్‌ 2008 వింబుల్డన్‌ ఫైనల్లో ఫెడరర్‌ను ఓడించి కెరీర్‌లో ఐదో గ్రాండ్‌స్లామ్‌ను సాధించాడు. ఇది యాదృఛ్చికమే అయినా.. ఆరాధ్య ఆటగాడి రికార్డును సమం చేయడం తన అదృష్టంగా భావిస్తానని అల్కారజ్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

ఇవీ చదవండి:

ఆర్సీబీపై వేలాడుతున్న నిషేధం కత్తి

లేడీ అంపైర్‌పై అశ్విన్ సీరియస్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 05:16 AM