హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనీ
ABN , Publish Date - Jun 10 , 2025 | 05:13 AM
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మహీకి చోటు లభించింది. ఈమేరకు ఐసీసీ సోమవారం...

మహీకి అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మహీకి చోటు లభించింది. ఈమేరకు ఐసీసీ సోమవారం ప్రకటించింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మన్ననలు అందుకున్న ధోనీ ఆధ్వర్యంలో భారత్ రెండు ఐసీసీ వరల్డ్ కప్‌లు (2007 టీ0, 2011 వన్డే) అందుకుంది. అలాగే అతడి సారథ్యంలో 2013 చాంపియన్స్ ట్రోఫీ కూడా టీమిండియా సాధించింది. ధోనీ నాయకత్వంలోనే భారత జట్టు 2009లో టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకుంది. ‘ప్రపంచ వ్యాప్తంగా అన్ని తరాల క్రికెటర్ల సేవలను గుర్తించే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఎందరో గొప్ప క్రికెటర్ల మధ్య నా పేరు ఉండబోతోందన్న భావనే అద్భుతంగా ఉంది. ఈ సందర్భాన్ని ఎప్పటికీ మరువలేను’ అని ధోనీ పేర్కొన్నట్టు ఐసీసీ తెలిపింది. ‘అన్ని ఫార్మాట్లలో కలిపి 538 మ్యాచ్‌లు, 17,266 అంతర్జాతీయ పరుగులు, కీపర్‌గా 829 మందిని అవుట్ చేయడం ధోనీ అసాఽధారణ ప్రతిభకు, ఫిట్‌నెస్‌కు నిదర్శనం’ అని ఐసీసీ కొనియాడింది. ధోనీతో పాటు మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), హషీమ్ ఆమ్లా, గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా), డానియెల్ వెటోరి (న్యూజిలాండ్), సనా మిర్ (పాకిస్థాన్), సారా టేలర్ (ఇంగ్లండ్)లకు కూడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది.
ఇక..హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న 11వ భారత క్రికెటర్ ధోనీ. ఇంతకుముందు గవాస్కర్, సచిన్, సెహ్వాగ్, డయానా ఎడుల్జీ, అనిల్ కుంబ్లే, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, వినూ మన్కడ్, నీతూ డేవిడ్ ఈ జాబితాలో ఉన్నారు.
ఇవీ చదవండి:
ఆర్సీబీపై వేలాడుతున్న నిషేధం కత్తి
లేడీ అంపైర్‌పై అశ్విన్ సీరియస్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి