Virat Kohli: కోహ్లీ సంచలన నిర్ణయం.. రిటైర్‌మెంట్ తర్వాత ఊహించిన రీతిలో..!
ABN, Publish Date - May 18 , 2025 | 01:09 PM
భారత జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. వన్డేల్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయితే తాజాగా అతడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఇప్పటికే టీ20ల నుంచి వైదొలిగిన కింగ్.. ఐపీఎల్ రూపంలో సంవత్సరానికి ఒకసారి పొట్టి ఫార్మాట్‌లోనూ మెరుపులు మెరిపించనున్నాడు. అయితే సుదీర్ఘ ఫార్మాట్ నుంచి అతడు తప్పుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫామ్, ఫిట్‌నెస్ ఉన్నా అర్ధంతరంగా రిటైర్‌మెంట్ ఇచ్చేయడం ఏంటని విస్మయానికి లోనవుతున్నారు. ఈ తరుణంలో వాళ్లకు మరో షాకింగ్ న్యూస్. టెస్టులకు గుడ్‌బై చెప్పేసిన కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో ఆడాలని అతడు డిసైడ్ అయ్యాడని సమాచారం. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
ఆడతాడా?
ఇంగ్లీష్ దేశవాళీ క్రికెట్‌లో మిడిలెసెక్స్ క్లబ్ తరఫున కోహ్లీని ఆడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇంగ్లీష్ డొమెస్టిక్ వన్డే టోర్నమెంట్ అయిన మెట్రో బ్యాంక్ కప్‌లో విరాట్‌ను బరిలోకి దింపాలని భావిస్తున్నారట. అందుకోసం కోహ్లీతో ఇంగ్లీష్ క్రికెట్‌కు సంబంధించిన అధికారులు చర్చలు జరుపుతున్నారని.. అతడు ఓకే కూడా చెప్పేశాడని సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. అన్నీ కుదిరితే ఈ ఏడాదే కౌంటీ చాంపియన్‌షిప్ లేదా మెట్రో బ్యాంక్ కప్‌లో కోహ్లీ ఆడటం ఖాయమని వినిపిస్తోంది. అయితే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్నందున ఇంగ్లీష్ నేలపై విరాట్ బరిలోకి దిగడం అనుమానం మారింది. ఒకవేళ కౌంటీల్లో ఆడినా ది హండ్రెడ్, టీ20 బ్లాస్ట్ లాంటి పొట్టి ఫార్మాట్ టోర్నీల్లో అతడు ఆడేందుకు వీలు లేదు.
రూల్స్ ఏం చెబుతున్నాయి..
బీసీసీఐ రూల్స్ ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లు ఓవర్సీస్ టీ20 లీగ్స్‌లో ఆడేందుకు అనర్హులు. అయితే టీ20ల్లో ఆడకపోయినా కౌంటీల్లో మాత్రం కోహ్లీని దింపాలని మిడిలెసెక్స్ క్లబ్ భావిస్తోందట. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో డెర్బీషైర్, గ్లౌకెస్టర్‌షైర్ జట్లతో తలపడనుంది. ఈ మ్యాచుల్లో విరాట్‌ను ఆడించాలని ఆ క్లబ్ పట్టుదలతో ఉందని తెలుస్తోంది. అయితే మిడిలెసెక్స్ ప్రతిపాదనకు కోహ్లీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో.. లేదో.. చూడాలి. కాగా, కొడుకు అకాయ్ పుట్టాక కోహ్లీ ఫ్యామిలీతో కలసి ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్నాడు. స్వదేశం లేదా విదేశం ఎక్కడ మ్యాచులు ఉన్నా ఆడేసి తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కుతున్నాడు. ఈ నేపథ్యంలో కౌంటీ క్రికెట్ ఆఫర్‌కు అతడు ఎస్ చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇంగ్లీష్ దేశవాళీల్లో ఆడే బదులు మన రంజీల్లో ఆడొచ్చు కదా.. ఇక్కడి యువకులకు తన అనుభవం నుంచి పాఠాలు నేర్పొచ్చు కదా అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కోహ్లీ ఏం చేస్తాడనేది అతడికే తెలియాలి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 18 , 2025 | 01:12 PM