Rohit Sharma: వచ్చాడు.. ఔట్ అయ్యాడు.. రిపీట్.. ఇక ఆ దేవుడే కాపాడాలి
ABN, Publish Date - Jan 23 , 2025 | 02:38 PM
Ranji Trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతోంది. అటు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో విఫలమవుతున్న హిట్‌మ్యాన్.. ఇటు డొమెస్టిక్ క్రికెట్‌లోనూ తుస్సుమన్నాడు.
వచ్చాడు, ఆడాడు, పోయాడు.. రిపీట్. కొన్నాళ్లుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మది ఇదే పరిస్థితి. వన్డేలు, టెస్టులు.. ఫార్మాట్ ఏదైనా బ్యాట్‌తో చెలరేగే రోహిత్ ఇటీవల కాలంలో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో దారుణంగా విఫలమైన హిట్‌మ్యాన్.. సిడ్నీ టెస్టులో బరిలోకి దిగలేదు. దీంతో పేలవ ఫామ్ నుంచి బయటపడేందుకు దేశవాళీ క్రికెట్‌ను నమ్ముకున్నాడు. జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో బ్యాట్‌తో విజృంభించాలని భావించాడు. అయితే అతడికి తట్టుకోలేని అవమానం ఎదురైంది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
గర్జించని బ్యాట్!
రోహిత్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా వైఫల్యాలు చూస్తున్న హిట్‌మ్యాన్.. దేశవాళీల్లోనూ దాన్నే కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ 19 బంతుల్లో 3 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఉమర్ రజీన్ మీర్ అనే అనామక బౌలర్ చేతుల్లో ఔటై అభిమానుల్ని తీవ్రంగా నిరాశపర్చాడు హిట్‌మ్యాన్. క్రీజులో ఉన్నంత సేపు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. భారీ షాట్లను కొట్టేందుకు ప్రయత్నించినా సరిగ్గా టైమింగ్ చేయలేకపోయాడు రోహిత్. డిఫెన్స్‌లోనూ తడబడుతూ కనిపించాడు.
ఇదేం బ్యాటింగ్?
ఉమర్ మీర్ ఆఫ్ సైడ్ వేసిన బంతి కాస్త ఎత్తులో రావడంతో దాన్ని పుల్ చేయబోయాడు రోహిత్. కానీ బంతి అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. దీంతో స్లిప్ ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో పాటు ఇతర టీమిండియా స్టార్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. యశస్వి జైస్వాల్ (4), అజింక్యా రహానె (12), శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబె (0) రెండంకెల స్కోరు చేసేందుకు కూడా చెమటోడ్చారు. దీంతో ముంబై ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 33.2 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జమ్మూ ప్రస్తుతం 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 42 పరుగులతో ఉంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ బ్యాటింగ్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇక అతడ్ని దేవుడే కాపాడాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనామక బౌలర్‌కు వికెట్ అప్పగించడం ఏంటి? ఆ స్థాయి ఆటగాడికి ఇది తట్టుకోలేని అవమానమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ చదవండి:
కోహ్లీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 23 , 2025 | 02:46 PM