Rishabh Pant: డేంజరస్ సెలబ్రేషన్.. పంత్ పరిస్థితేంటి.. డాక్టర్ ఏమన్నారంటే?
ABN, Publish Date - Jun 28 , 2025 | 08:45 PM
టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ సూపర్బ్ నాక్స్‌తో అదరగొడుతున్నాడు. ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు బాది తనలో పస ఏమాత్రం తగ్గలేదని అతడు నిరూపించాడు.
భారత జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఏకంగా 2 సెంచరీలు బాదాడు పంత్. మ్యాచ్ టీమిండియా చేజారినా అతడి బ్యాటింగ్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి. బౌండరీలు, సిక్సులతో అతడు చేసిన తాండవం, ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించిన తీరు నెవర్ బిఫోర్ అని చెప్పకతప్పదు. అయితే పంత్ బ్యాటింగ్‌తో పాటు అతడి సోమర్‌సాల్ట్ సెలబ్రేషన్ కూడా గుర్తుండిపోతుంది. సెంచరీ పూర్తయ్యాక గాల్లో పల్టీలు కొడుతూ అతడు సెలబ్రేట్ చేసుకున్న తీరుకు అంతా ఫిదా అయ్యారు. అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటే డేంజర్ తప్పదు, కాస్త తేడా వచ్చినా తిరిగి ఆడటం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్తది కాదు..
సెలబ్రేషన్స్ మోజులో గాయపడితే పంత్ తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వలేడంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ తరుణంలో అతడి డాక్టర్ దీనిపై స్పందించారు. పంత్ సోమర్‌సాల్ట్ సెలబ్రేషన్ చేయొచ్చా? లేదా? అతడి ఆరోగ్య పరిస్థితి ఏంటి? లాంటి విషయాలపై డాక్టర్ దిన్షా పార్దీవాలా క్లారిటీ ఇచ్చారు. పంత్ ఓ జిమ్నాస్ట్ అని.. అందులో అతడు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడని తెలిపారు. సోమర్‌సాల్ట్ సెలబ్రేషన్ కొత్తగా చేస్తున్నది కాదని.. రిషబ్ ఎన్నో ఏళ్లుగా దీన్ని సాధన చేస్తున్నాడని బయటపెట్టారు.
టెన్షన్ వద్దు...
‘రిషబ్ పంత్‌కు జిమ్నాస్టిక్స్‌లో ప్రావీణ్యం ఉంది. అతడు అందులో శిక్షణ తీసుకున్నాడు. చూసేందుకు రిషబ్ కాస్త భారీగా కనిపిస్తాడు. కానీ అతడి శరీరంలో ఫ్లెక్సిబిలిటీ ఇంకా అలాగే ఉంది. అందుకే అంత అలవోకగా సోమర్‌సాల్ట్ సెలబ్రేషన్ చేస్తున్నాడు. అవసరం లేకపోయినా గానీ తన సంతోషాన్ని పంచుకునేందుకు అతడు అలా చేస్తున్నాడు. భయపడాల్సిందేమీ లేదు.. సోమర్‌సాల్ట్‌ను రిషబ్ ఎన్నోసార్లు సాధన చేశాడు’ అని డాక్టర్ పార్దీవాలా చెప్పుకొచ్చారు. కాగా, 2022 డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురయ్యాడు పంత్. ఆ సమయంలో అతడికి చికిత్స అందించి కోలుకునేలా చేశారు డాక్టర్ పార్దీవాలా.
ఇవీ చదవండి:
రొనాల్డో సీక్రెట్ బయటపెట్టిన సైంటిస్ట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 28 , 2025 | 08:49 PM