Lords Pitch Report: ఇంగ్లండ్‌కు టీమిండియా ఫీవర్.. మొత్తం కథ మారిపోయిందిగా!
ABN, Publish Date - Jul 09 , 2025 | 02:12 PM
లార్డ్స్ టెస్ట్‌కు జోరుగా సిద్ధమవుతోంది భారత జట్టు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఘనవిజయం సాధించడంతో అదే రిజల్ట్‌ను ఇక్కడా రిపీట్ చేయాలని చూస్తోంది.
భారత్‌తో 5 టెస్టుల సిరీస్ మొదలవక ముందు ఇంగ్లండ్ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం నుంచి కోలుకొని ఫుల్ ఫిట్‌గా కనిపించాడు. జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో ఆ టీమ్ భారీ విజయం సాధించింది. బౌలింగ్ యూనిట్‌లో లోటుపాట్లు ఉన్నా బ్యాటింగ్ బలం, సొంతగడ్డపై అనుకూల పరిస్థితులు, అలవాటు పడిన పిచ్‌లు, బజ్‌బాల్ ఫార్ములా వెరసి టీమిండియాతో సిరీస్‌లో దుమ్మురేపుతామని భావించింది ఇంగ్లీష్ టీమ్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు లేని భారత కుర్ర జట్టును ఓ ఆటాడుకోవాలని అనుకుంది. కానీ కట్ చేస్తే.. 2 వారాల్లో సీన్ రివర్స్ అయింది. గిల్ సేన మొత్తం కథను మార్చేసింది.
పిచ్ చేంజ్..
భారత్‌ను భయపెడదామని అనుకున్న ఇంగ్లండ్.. ఇప్పుడు టీమిండియాను చూసి వణుకుతోంది. మొదటి టెస్టులో బ్యాటింగ్ బలంతో గెలిచిన స్టోక్స్ సేన.. ఎడ్జ్‌బాస్టన్‌లో 336 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలో చూసుకున్నా యంగ్ ఇండియా జోరు ముందు ఆతిథ్య జట్టు నిలబడలేకపోయింది. ముఖ్యంగా సారథి గిల్ నేతృత్వంలోని బ్యాటింగ్ ఆర్డర్‌ను చూసి ఇంగ్లండ్ తెగ భయపడుతోంది. గిల్, జైస్వాల్, పంత్, రాహుల్.. ఇలా ఒకరికి పోటీగా ఒకరు పరుగుల వర్షం కురిపిస్తూ ఉండటంతో దెబ్బకు పిచ్‌ను మార్చేసింది. 3వ టెస్ట్‌కు ఆతిథ్యం ఇస్తున్న లార్డ్స్‌లో ఎలాగైనా నెగ్గాలనే తాపత్రయంలో ఫుల్ గ్రీన్ వికెట్‌ను రెడీ చేయిస్తోంది ఇంగ్లండ్.
వాటే ప్లాన్..
బజ్‌బాల్‌తో భారత్‌ను కుమ్మేద్దామని భావించిన ఇంగ్లండ్.. లీడ్స్, ఎడ్జ్‌బాస్టన్‌లో బ్యాటింగ్‌కు సహకరించే వికెట్లు తయారు చేయించింది. కానీ అక్కడ ఆతిథ్య జట్టు బ్యాటర్ల కంటే టీమిండియా బ్యాటర్లు మరింత చెలరేగి ఆడారు. దీంతో వాళ్లను అడ్డుకునేందుకు లార్డ్స్‌లో పచ్చికతో కూడిన పేస్ పిచ్‌ను రూపొందిస్తోంది. అలాగే స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్, పేస్ ఆల్‌రౌండర్ గస్ అట్కిన్సన్‌ను ఈ మ్యాచ్ కోసం దించుతోంది. దీనిపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు. ‘పిచ్‌పై పచ్చిక కనిపిస్తోంది. కానీ మ్యాచ్ రోజే వికెట్ ఎలా ఉంటుందనే క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఎక్కువగా లోస్కోర్లు నమోదవుతాయి. బౌలర్లకు పిచ్ నుంచి మద్దతు లభిస్తూ ఉంటుంది. అయితే ఎక్కువ సేపు క్రీజులో నిలబడితే పరుగులు అవే వస్తాయి. ఇదే అప్రోచ్‌తో మేం ముందుకెళ్తాం’ అని సితాన్షు కోటక్ చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 09 , 2025 | 02:19 PM