Boys Playing With Loaded gun: పిస్టల్ చేతపట్టి పోలీసులకు చుక్కలు చూపించిన అమెరికా చిన్నారులు..
ABN, Publish Date - May 13 , 2025 | 04:02 PM
అమెరికాలో ఇద్దరు చిన్నారులు లోడెడ్ తుపాకీతో చెలగాటమాడి పోలీసులకే చుక్కలు చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఇద్దరు చిన్నారులు తుపాకీ చేతపట్టి కలకలం సృష్టించారు. పట్టుమని పదేళ్లు కూడా లేని ఆ ఇద్దరూ తుపాకీతో బయటకు రావడంతో స్థానికులు హడలిపోయారు. ఆ తుపాకీలో బుల్లెట్లు కూడా ఉన్నాయని తెలిసి ఏ అనర్థం జరుగుతోందో అని బెంబేలెత్తిపోయారు. వారి తీరు చూసి పోలీసులకు కూడా ముచ్చెమటలు పట్టాయి. అయితే, తెలివిగా వ్యహరించిన పోలీసులు చిన్నారుల నుంచి తుపాకీని జాగ్రత్తగా తీసుకున్నారు. న్యూమెక్సికో రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏడేళ్లు, తొమ్మిదేళ్ల వయసున్న ఇద్దరు బాలురు లోడెడ్ తుపాకీతో ఆటలాడం చూసిన స్థానికులు వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి దాదాపు 50 కాల్స్ పోలీసులకు వెళ్లాయి. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులను చూడగానే చిన్నారులు సినీ ఫక్కీలో ఓ బాక్సు మాటున దాక్కున్నారు. తుపాకీని మాత్రం విడిచిపెట్టలేదు. పోలీసులు పలు మార్లు వారిని హెచ్చరించినా చిన్నారులు పెడచెవిన పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు డ్రోన్ సాయంతో మరోవైపు నుంచి వారి కదలికలపై నిఘా పెట్టారు. వారి నుంచి తుపాకీ ఎలా తీసుకోవాలా అని ఆలోచించి చివరకు గాల్లో నాన్ లీథల్ గన్ను పేల్చారు. ఆ శబ్దానికి చిన్నారులు ఇద్దరు దడుసుకున్నారు. వారు తికమకపడుతున్న సమయంలోనే మెల్లగా అక్కడికి చేరుకున్న పోలీసులు వారి వద్ద తుపాకీని తీసేసుకున్నారు.
అయితే, చిన్నారులపై ఎలాంటి కేసు పెట్టలేదు. వారి కుటుంబాలను పిలిపించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టిన డ్రోన్ కార్యక్రమంపై కూడా పోలీసులు ప్రశంసలు కురిపించారు. డ్రోన్ వల్లే పరిస్థితిని నిశితంగా గమనించి తగు చర్యలు తీసుకోగలిగామని అన్నారు. అయితే, చిన్నారుల చేతికి తుపాకీ ఎలా దొరికిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. చిన్నారులతో పాటు కుటుంబానికి కూడా కౌన్సెలింగ్, థెరపీ చేయించే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
న్యూమెక్సికోలో ఇటీవల కాలంలో చిన్నారులు ఇలాంటి ప్రమాదకర చర్యలకు దిగిన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. మార్చ్‌లో లాస్ క్రూసెస్‌లో వెలుగు చూసిన ఓ ఘటనలో ముగ్గురు మరణించగా 15 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో పెరుగుతన్న నేరాలపై పోలీసులు, చట్ట సభల సభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
కృష్ణబిలంలో పడి నక్షత్రం ధ్వంసం.. అద్భుత ఫొటో షేర్ చేసిన నాసా
ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ
భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు
Updated Date - May 13 , 2025 | 04:08 PM