Phd Delivery Agent: పీహెచ్‌డీ చేసినా డెలివరీ బాయ్‌గా జీవనం.. ఇతడి స్టోరీ తెలిస్తే..
ABN, Publish Date - Jul 07 , 2025 | 09:58 PM
పీహెచ్‌డీ చేసినా కూడా డెలివరీ బాయ్‌గా జీవనం గడుపుతున్న ఓ చైనా వ్యక్తి ఉదంతం ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల వంటి అంశాలపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అతడు ఓ ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేశాడు. కానీ చివరకు డెలివరీ బాయ్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయినా తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెబుతున్న ఈ చైనా వ్యక్తి ఉదంతం ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, డింగ్ యాంజావో వయసు 39 ఏళ్లు. టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు చదివాడు. సింగ్హువా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో డిగ్రీ పట్టా పొందాడు. ఆ తరువాత పెకింగ్ యూనివర్సిటీ నుంచి ఎనర్జీ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశాడు. నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా కూడా పొందాడు. బయోడైవర్సిటీలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మరో డిగ్రీ చేశాడు. ఇన్ని ఉన్నత చదువులు చదివినా కూడా అతడికి నచ్చిన జాబ్ మాత్రం దొరకలేదు. పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్‌గా చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో, అతడు డెలివరీ బాయ్‌గా మారిపోయాడు. జాబ్‌ల కోసం విసిగి వేసారి చివరకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.
‘ఇది చాలా స్థిరమైన జాబ్. ఇందులో వచ్చే ఆదాయంతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇందులో కాస్త కష్టపడి పనిచేస్తే మంచి సంపాదన లభిస్తుంది. ఇది మరీ అంత దారుణమైన జాబ్ ఏమీ కాదు’ అని డింగ్ స్థానిక మీడియాతో చెప్పుకొచ్చాడు. ఓ వ్యక్తి స్థాయిని, సామర్థ్యాన్ని అతడి ఉద్యోగాన్ని బట్టి బేరీజు వేయకూడదని డింగ్ అభిప్రాయపడ్డారు. డెలివరీ బాయ్‌గా తనని తాను పోషించుకోవడంతో పాటు సమాజానికి ఎంతో కొంత సాయం చేస్తున్నానని అన్నాడు.
ప్రైవేటు ట్యూటర్‌గా చేయడం తన వల్ల కాలేదని కూడా డింగ్ అన్నాడు. పిల్లల కోసం వెతుక్కుంటూ వెళ్లేంత చొరవ లేక చివరకు ఈ వృత్తిని ఎంచుకున్నట్టు చెప్పాడు. ఇక త్వరలో చదువులు పూర్తి చేసుకోనున్న వారికి అతడు కొన్ని సూచనలు చేశాడు. నిరుత్సాహం వద్దని, ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగాలని అన్నాడు. అయితే, ఈ ఉదంతం పెద్ద చర్చకే దారి తీసింది. ప్రస్తుత కాలంలో ఉన్నత చదువులు, వాటి విలువపై జనాలు రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చారు.
ఇవీ చదవండి:
పనిమనిషి కుటుంబ ఆదాయం నెలకు రూ.1.3 లక్షల.. నెటిజన్ పోస్టు వైరల్
నా కుటుంబాన్నే అవమానిస్తారా.. నెట్టింట డాక్టర్‌తో భారత్ చెస్ గ్రాండ్‌మాస్టర్ వాగ్వాదం
Updated Date - Jul 07 , 2025 | 10:03 PM