Vidit Gujrathi: నా కుటుంబాన్నే అవమానిస్తారా.. నెట్టింట డాక్టర్‌తో భారత్ చెస్ గ్రాండ్‌మాస్టర్ వాగ్వాదం
ABN , Publish Date - Jul 04 , 2025 | 05:44 PM
భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ విదిత్ కుటుంబసభ్యులెవరూ అసలైన డాక్టర్లు కారంటూ ఓ కేరళ వైద్యుడు నెట్టింట చేసిన కామెంట్ కలకలం రేపుతోంది. ఈ కామెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విదిత్ తన కుటుంబాన్ని అవమానిస్తే సహించేది లేదని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: డాక్టర్స్ డేను పురస్కరించుకుని భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీ తన తల్లిదండ్రులకు చెప్పిన శుభాకాంక్షలు ఊహించని మలుపు తిరిగాయి. లివర్ డాక్‌గా నెట్టింట పాప్యులర్ అయిన కేరళ వైద్యుడు సిరియాక్ అబీ ఫిలిప్స్‌తో తగాదాకు దారి తీశాయి. తన కుటుంబాన్ని ఎందుకు అవమానిస్తున్నావని విదిత్ లివర్ డాక్టర్‌పై ఫైరైపోయారు. ప్రస్తుతం ఇది నెట్టింట సంచలనం రేపుతోంది (Vidit Gujrathi LiverDoc clash).
డాక్టర్స్ డే నాడు విదిత్ తన కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లిదండ్రులు, భార్య, సోదరి ఉన్న ఫ్యామిలీ ఫొటోను పంచుకున్నారు. వైద్య రంగంలో వారి స్పెషాలిటీలను వివరిస్తూ అభినందనలు తెలియజేశారు. తన తండ్రి ఆయుర్వేదిక్ మైగ్రేన్ స్పెషలిస్టు అని, తల్లి కాస్మెటాలజిస్టు అని, భార్య హోమియోపతిలో ఎంబీబీఎస్ చేసిందని, తన సోదరి ఫిజియోథెరపిస్టు అని అన్నారు.
ఈ పోస్టుకు లివర్ డాక్ స్పందించారు. విదిత్ కుటుంబసభ్యులు ఎవరూ నిజమైన డాక్టర్లు కారని అన్నారు. ఈ కామెంట్‌పై విదిత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘అవతలి వారిని అవమానిస్తూ మీరు మీ బ్రాండ్‌ను నిర్మించుకున్నారు. ఇతరులను హేళన చేస్తూ రీట్వీట్స్ కోసం మీరు ప్రయత్నిస్తే నా కుటుంబం ఎలాంటి గుర్తింపు ఆశించకుండా రోగులకు స్వస్థత చేకూరుస్తోంది. మీ లెక్కలకు అందనంత మందిని వారు ఆరోగ్యవంతులను చేశారు. కాబట్టి, మీ హద్దులు మీరవద్దు. జనాలకు ఉపయోగపడేది ఏదైనా చేయండి’ అంటూ ఘాటుగా పోస్టు పెట్టారు.
‘సర్టిఫైడ్ డాక్టర్లు అయిన నా తల్లిదండ్రులు నా కోసం తమ కెరీర్‌ను పక్కన పెట్టారు. నా వెంట వివిధ దేశాలకు వచ్చారు. జనాలకు స్వస్థత చేకూర్చేందుకు ఎల్లప్పుడూ తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మీరు వారితో ఏకీభవించాల్సిన అవసరం లేదు. అయతే, వారిని తీసిపారేస్తామంటే మాత్రం ఒప్పుకునేది లేదు’ అని అన్నారు.
దీనికి లివర్ డాక్ మరోసారి స్పందించారు. డా.బిధన్ చంద్ర రాయ్ సేవలను స్మరించుకుంటూ దేశంలో డాక్టర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటారని తెలిపారు. ఇండియాలో అత్యుత్తమ ప్రతిభ గల వైద్యుల్లో ఆయన ఒకరని అన్నారు. భారత వైద్య వ్యవస్థలో మేలి మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఆయుర్వేదం, హోమియోపతి, కాస్మటాలజీ, ఫిజియోథెరపీలు క్లీనికల్ మెడిసిన్ పరిధిలోకి రావని అన్నారు. హెల్త్‌కేర్ రంగానికి అనుబంధ విభాగంగా ఫిజియోథెరపీకి మాత్రం గుర్తింపు ఉందని అన్నారు. ఆయుర్వేద వైద్యం కూడా క్లినికల్ మెడిసిన్ అనే అభిప్రాయం కలిగించేలా విదిత్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. దీనికి విదిత్ మరోసారి మండిపడ్డారు. తన కుటుంబాన్ని అవమానిస్తే సహించేది లేదని అన్నారు. అయితే, ఇలాంటి వ్యర్థ సంభాషణలతో తాను కాలాన్ని వృథా చేసుకోదలుచుకోలేదంటూ వాగ్వాదాన్ని ముగించారు.
ఇవీ చదవండి:
అమెరికన్లు మరీ ఇలాంటోళ్లని అనుకోలేదు.. ఎన్నారైకి దిమ్మతిరిగే షాక్
మీటింగుల్లో మాట్లాడొద్దంటూ ముఖం మీద చెప్పిన అమెరికన్ సహోద్యోగి.. ఎన్నారైకి షాక్