Share News

Indian Accent: మీటింగుల్లో మాట్లాడొద్దంటూ ముఖం మీద చెప్పిన అమెరికన్ సహోద్యోగి.. ఎన్నారైకి షాక్

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:33 PM

తనను మీటింగుల్లో మాట్లాడొద్దని అమెరికన్ సహోద్యోగి ఒకరు ముఖం మీదే చెప్పాడంటూ ఓ ఎన్నారై నెట్టింట ఆవేదన వెళ్లబోసుకున్నాడు. తన యాస అర్థంకాక అతడు ఇలా అన్నాడని తెలిపారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Indian Accent: మీటింగుల్లో మాట్లాడొద్దంటూ ముఖం మీద చెప్పిన అమెరికన్ సహోద్యోగి.. ఎన్నారైకి షాక్
Indian Man Accent Discrimination

ఇంటర్నెట్ డెస్క్: ‘నీ యాస మాకు అర్థం కావట్లేదు.. దయచేసి మీటింగుల్లో మాట్లాడొద్దు’ అని అమెరికన్ సహోద్యోగి ముఖంపై చెప్పడంతో ఓ ఎన్నారై భారీ షాక్ తగిలింది. ఈ పరిస్థితి నుంచి ఎలా కోలుకోవాలో తెలియట్లేదంటూ అతడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తన వయసు 32 ఏళ్లని, తానో అమెరికా కంపెనీలో పని చేస్తున్నట్టు సదరు ఎన్నారై తెలిపారు. అక్కడ తను తప్ప మిగతా అందరూ అమెరికన్లే అని అన్నాడు. అయితే, ఇటీవల ఓ రోజు ఆఫీసులో ఊహించని అనుభవం ఎదురైందని తెలిపారు. సహోద్యోగి చేసిన సూచనతో పరువు పోయినట్టు అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇటీవలి మీటింగ్‌లో నేను నా సహోద్యోగిని (ఆయనకు 55 ఏళ్లు ఉంటాయి) ఓ ప్రాజెక్టుకు సంబంధించిన అప్‌డేట్ అడిగాను. నాకు అప్పగించిన విధుల్లో ఇదీ ఒకటి. అయితే, మీటింగుల్లో నేను మాట్లాడుతుంటే యాస అర్థం కావట్లేదని ఆ అమెరికన్ ఉద్యోగి అన్నారు. అంతేకాకుండా, మీటింగుల్లో నన్ను మాట్లాడొద్దని ముఖం మీదే చెప్పేశారు’ అని రెడిట్‌లో ఆ ఎన్నారై రాసుకొచ్చారు. తన కెరీర్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారని, తాను మాట్లాడుతుంటే సహోద్యోగులు మధ్యలో అడ్డుపడటం గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నాడు.


‘నాకు చాలా అవమానంగా అనిపించింది. తలకొట్టేసినట్టైంది. నా తోటి ఉద్యోగులకు ఏదైనా సరే హుందాగా, మర్యాదగా చెబుతుంటాను. కానీ నన్ను గతంలో ఇలా ఎవరూ అనలేదు. ఇదే క్లైంట్ కోసం నేను ఏడాదిగా పనిచేస్తున్నాను’ అని ఎన్నారై వాపోయారు. ‘ఇలాంటి పరిస్థితి మీలో ఎవరైనా ఎదుర్కున్నారా? ఇలాంటి విషయాలకు ప్రొఫెషనల్‌గా ఎలా స్పందించాలి. నలుగురిలో విలువ కోల్పోకుండా ఆత్మాభిమానాన్ని ఎలా కాపాడుకోవాలి’ అని ప్రశ్నించారు.

ఈ పోస్టుపై సహజంగానే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది అతడి పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. ‘ఇది దురుసు ప్రవర్తనే. అవతలి వారి యాస, మాట అర్థం కాకపోతే మరోసారి చెప్పమని అడగాలి. లేకపోతే నెమ్మదిగా మాట్లాడమని అనాలి. అంతేకానీ, అసలు నోరెత్తొద్దని చెప్పడం అవమానించడమే’ అని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తొందరపడొద్దని మరికొందరు అన్నారు. అవతలి వారికి నిజంగానే మాట అర్థం కావట్లేదేమో ఓసారి కనుక్కోవాలని సలహా ఇచ్చారు.


భారతీయుల యాస అర్థంకాక తానూ ఓసారి ఇబ్బంది పడ్డానని మరొకరు తెలిపారు. ఈ విషయంలో మేనేజర్ సాయం తీసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.

ఇవీ చదవండి:

అప్పు కావాలంటూ మేనేజర్ వేధింపులు.. లబోదిబోమంటున్న ఉద్యోగి

ఇంతలా నన్ను అవమానిస్తారా.. ఇంకెప్పుడూ ఇండియాకు రాను: నెదర్‌లాండ్స్ పౌరుడు

Read Latest and Viral News

Updated Date - Jun 30 , 2025 | 04:44 PM