Maid Family Income: పనిమనిషి కుటుంబ ఆదాయం నెలకు రూ.1.3 లక్షల.. నెటిజన్ పోస్టు వైరల్
ABN , Publish Date - Jul 04 , 2025 | 08:18 PM
తన పని మనిషి కుటుంబ ఆదాయం నెలకు రూ.1.3 లక్షలు అంటూ ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. వాళ్లు పన్ను కూడా చెల్లించనక్కర్లేదని సదరు నెటిజన్ తెలిపారు. ఇదంతా చూస్తుంటే అసలు దేశంలో మిడిల్ క్లాస్ వర్గం ఏదన్న సందేహం కలుగుతోందని అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఓ నెటిజన్ తన పనిమనిషి కుటుంబ సంపాదనపై పెట్టిన పోస్టు పెద్ద చర్చకు దారి తీసింది. భారత్‌లో ఆర్థిక అసమానతలు, వర్గ విభజనపై కొత్త ప్రశ్నలకు దారి తీసింది. ప్రస్తుతం దేశంలో మధ్యతరగతి వారంటే ఎవరో అర్థం కావట్లేదంటూ సదరు నెటిజన్ పెట్టిన పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు (Maid Family Income Debate).
తాను టైర్-3 నగరంలో ఉంటున్నట్టు సదరు నెటిజన్ చెప్పుకొచ్చారు. తన పని మనిషి కొన్నేళ్లుగా తమ ఇంట్లోనే పని చేస్తున్నట్టు తెలిపారు. ఆమె మూడు ఇళ్లల్లో పని చేసి నెలకు రూ.30 వేలు తెచ్చుకుంటోందని అన్నారు. ఆమె భర్త దినసరి కూలీ అని అతడి ఆదాయం నెలకు రూ.35 వేలు అని తెలిపారు. ఇక వారి పెద్ద కొడుకు దుస్తుల దుకాణంలో నెలకు రూ.30 వేల జీతంపై పని చేస్తుంటాడని తెలిపారు. ఆమె చిన్న కూతురు ప్రస్తుతం టైలరింగ్ పని నేర్చుకుంటూ నెలకు రూ.3 వేలు తెచ్చుకుంటోందని తెలిపారు.
శిక్షణ పూర్తయ్యాక ఆమెకు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. వారి చిన్న కుమారుడు ప్లంబింగ్ పని నేర్చుకుంటున్నాడని, త్వరలో అతడు కుటుంబానికి రూ.15 వేల నుంచి రూ.25 వేలు ఇచ్చే స్థితికి వస్తాడని తెలిపారు. ఈ లెక్కలన్నీ చూస్తే ప్రస్తుతం వారి ఆదాయం నెలకు రూ.98 వేలని, త్వరలో అది రూ.1.3 లక్షలకు చేరుతుందని అన్నారు. ఇంత సంపాదన ఉన్నా పైసా పన్ను చెల్లించనక్కర్లేదని తెలిపారు.
ఇక వారికి ప్రభుత్వం నుంచి ఉచితంగా రేషన్ అందుతోందని అన్నారు. వారి ఇంటి అద్దె కేవలం రూ.6 వేలని అన్నారు. స్వగ్రామంలో వారికి ప్రభుత్వం గృహ పథకం కింద ఓ ఇల్లు కూడా మంజూరైందని తెలిపారు. వారసత్వంగా వచ్చిన పొలాన్ని లీజుకిచ్చి ప్రతి మూడు నెలలకు మరో రూ.40 వేల ఆదాయం పొందేందుకు వారు రెడీగా ఉన్నారని తెలిపారు. ‘ఆమె ఆదాయం బాగున్నందుకు నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నా. ఆమె తన జీవితమంతా ఎంతో కష్టపడింది. కానీ ఇదంతా పరిశీలిస్తే అసలు భారత్‌లో మిడిల్ క్లాస్ వర్గం అంటే ఎవరన్న సందేహం కలుగుతోంది’ అని సదరు నెటిజన్ కామెంట్ చేశారు.
దీనిపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అసంఘటిత రంగంలోని వారి సంపాదన ప్రస్తుతం మిడిల్ క్లాస్ వర్గాల స్థాయికి చేరుకుంటోందని కొందరు అభిప్రాయపడ్డారు. జీతం పొందేవారికంటే మిన్నగా ఉంటోందని అన్నారు. మరి కొందరు మాత్రం ఈ పోలికను తప్పుబట్టారు. అసంఘటిత రంగంలో ఉద్యోగ భద్రత లేకపోవడం, కఠిన పని వాతావరణం వంటివి పరిగణనలోకి తీసుకుంటే ఈ పోలికను ఏ రకంగానూ సమర్థించలేమని తెలిపారు.
ఇవీ చదవండి:
నా కుటుంబాన్నే అవమానిస్తారా.. నెట్టింట డాక్టర్‌తో భారత్ చెస్ గ్రాండ్‌మాస్టర్ వాగ్వాదం
అమెరికన్లు మరీ ఇలాంటోళ్లని అనుకోలేదు.. ఎన్నారైకి దిమ్మతిరిగే షాక్