ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆహార వృథా అరికట్టలేమా..

ABN, Publish Date - May 11 , 2025 | 11:01 AM

ఒక పెళ్లి విందులో... యాభై రకాల స్వీట్లు... ఉత్తరాది, దక్షిణాది వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలకు తోడు చైనీస్‌ రుచులు ప్రత్యేకం. ఇంకా ఛాట్‌ ఐటమ్స్‌, కట్‌ ఫ్రూట్స్‌... వివిధ ఫ్లేవర్లలో ఐస్‌క్రీమ్స్‌ మామూలే. చవులూరించే ఈ ఆహారాలన్నింటినీ రుచి చూడటం మాట అటుంచి, చూడటానికే చాలా సమయం పట్టిందన్నారు అతిథులు.

అన్నం పరబ్రహ్మ స్వరూపం... ఆహారాన్ని భగవంతుని స్వరూపంగా భావించే దేశం మనది. ఇది నాణేనికి ఒకవైపు. మరోవైపు... ఆహారాన్ని పెద్ద ఎత్తున వృథా చేస్తున్న దేశాల లిస్టులో కూడా ముందున్నాం. మనదగ్గరే కాదు... ప్రపంచ దేశాలన్నింటికీ ఇదొక పెద్ద సమస్యగా మారింది. ఇంట్లో, రెస్టారెంట్లో... పండగలకు, పబ్బాలకు... ఇతరత్రా శుభకార్యాల పేరిట తినేదాని కన్నా వృథా చేస్తున్నదే ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి.. ఆహార వృథాను ఆపడం ఎలా..

ఒక పెళ్లి విందులో... యాభై రకాల స్వీట్లు... ఉత్తరాది, దక్షిణాది వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలకు తోడు చైనీస్‌ రుచులు ప్రత్యేకం. ఇంకా ఛాట్‌ ఐటమ్స్‌, కట్‌ ఫ్రూట్స్‌... వివిధ ఫ్లేవర్లలో ఐస్‌క్రీమ్స్‌ మామూలే. చవులూరించే ఈ ఆహారాలన్నింటినీ రుచి చూడటం మాట అటుంచి, చూడటానికే చాలా సమయం పట్టిందన్నారు అతిథులు. ‘గొప్పలు కాకపోతే... మరీ ఇన్ని పదార్థాలు అవసరమా?’ అని పెదవి విరచిన వాళ్లూ లేకపోలేదు.

పండగపూట... అమ్మ, నానమ్మ తెల్లారకముందే నిద్ర లేచి పంచభక్ష్య పరమాన్నాలను వండారు. బొబ్బట్లు, పాయసం, మిరపకాయ బజ్జీ, పెరుగు వడ, ఫులిహోర, కొబ్బరి అన్నం, రెండు కూరలు, పప్పు, రసం, పెరుగు, అప్పడాలు, వడియాలు, రోటి పచ్చడి, ఆవకాయ... ఇలా రకరకాల రుచులను డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టారు. ఇంతకీ వాళ్లింట్లో ఉన్నది మొత్తం నలుగురే. ‘తిన్నా, తినకున్నా పండగ కాబట్టి పద్ధతి ప్రకారం ఆ మాత్రం వంటకాలు ఉండాల్సిందే’నని ఆడవాళ్ల వాదన.


భార్యాభర్తలు ఇద్దరూ కార్పోరేట్‌ సంస్థల్లో పనిచేస్తున్నారు. బిజీగా ఉండటం వల్ల ఎప్పుడూ ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టడమే. పిల్లలు సహా ఎవరికి ఇష్టమైనవి వాళ్లు ఆర్డర్‌ పెట్టుకుంటారు. బిర్యానీ, కబాబ్‌లు, స్టార్టర్స్‌, రోటీలు, సైడ్‌ డిష్‌లు, కూల్‌ డ్రింక్‌లు మామూలే. నలుగురు తినడానికి అవి ఎక్కువే. తిన్నంత తినీ మిగతాది ఫ్రిజ్‌లో పెడతారు. మరుసటి ఉదయం గుర్తుంటే పనిమనిషికి ఇస్తారు. లేదంటే అదంతా సాయంత్రం డస్ట్‌బిన్‌లోకి వెళ్తుంది.

పై మూడు సందర్భాల్లో సాధారణంగా కనిపించేది ఆహార వృథా. గొప్పలు, ఆచారాలు, ఇష్టాలు... కారణం ఏదైనా ఆహారం వృథా అనేది మనదగ్గరే కాదు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతి పేద్ద సమస్యగా నిపుణులు చెబుతున్నారు. ఆహార సృష్టి, ఆహార వినియోగం కన్నా ఆహార వృథా అధికమైతే భవిష్యత్తు ప్రమాదభరితమే అని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.


రెండో స్థానం

మనదేశాన్ని ఒకవైపు అన్నం పెట్టే అన్నపూర్ణగా కీర్తిస్తున్నప్పటికీ, మరోవైపు తినడానికి నాలుగు మెతుకులు దొరక్క, ఆకలితో అలమటిస్తున్న వారు కూడా అత్యధిక సంఖ్యలోనే ఉన్నారని లెక్కలు తేలుస్తున్నాయి. ‘2025 గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌’లోని మొత్తం 127 దేశాల్లో ఇండియా స్థానం 105. విస్మయం కలిగించే విషయం ఏమిటంటే... ఆహార వృథాలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాం. మనకన్నా ముందు చైనా ఉంది. ప్రపంచ జనాభాలో తొలి, మలి స్థానాల్లో ఉన్న దేశాల్లోనే ఈ పోకడ తీవ్రంగా ఉందని అర్థం అవుతోంది. మనదేశంలో ఏటా ఎంత లేదన్నా 92 వేల కోట్ల రూపాయల విలువగల ఆహారం నేలపాలవుతోందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే సగటున ప్రతీ వ్యక్తి 55 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. ‘ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ గణాంకాల ప్రకారం మన దేశంలో ఉత్పత్తి చేస్తోన్న మొత్తం ఆహారంలో మూడో వంతు వృథా అవుతోంది. రోజూ మూడు పూటలా ఆహారానికి నోచుకోని అభాగ్యులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆహార వృథాని అరికడితే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీళ్లందరికీ పట్టెడు మెతుకులు పెట్టినట్టే. అయితే పరిష్కారానికంటే ముందు సమస్య ఎక్కడుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.


- పొలాల దగ్గరే: మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. అయితే విచారించదగ్గ విషయం ఏమిటంటే... ఆయా పంటలకు తగినంతగా నిల్వ, రవాణా రంగాలు అభివృద్ధి చెందలేదు. ఈనాటికీ పండించిన పండ్లు, కూరగాయల్లో 5 నుంచి13 శాతం, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాల్లో 3 నుంచి 7 శాతం వృథా అవుతున్నాయి. ‘కోల్డ్‌ స్టోరేజ్‌’, రవాణా, ప్యాకేజింగ్‌ వసతులు లేకపోవడం ఈ వృథాకు ముఖ్య కారణం. ఎండనక, వాననక రైతులు కష్టపడి పండించిన ఉత్పత్తులు వినియోగదారుల దగ్గరకి రాకముందే పాడైపోవడం అత్యంత బాధాకరం.

- కనీస అవగాహన: ‘బై వన్‌, గెట్‌ వన్‌ ఫ్రీ’... ఆఫర్ల వల్ల అవసరం ఉన్నా లేకున్నా కొనడం వినియోగదారులకు బాగా అలవాటయింది. వీటిల్లో తొందరగా పాడై పోయేది ఆహారపదార్థాలే. ఇక రెస్టారెంట్‌ వృథాల గురించి చెప్పక్కర్లేదు. విందులు, వినోదాల పేరిట హోటల్‌కు వెళ్లిన ప్రతిసారీ తినగలమా? లేదా? అనేది ఆలోచించకుండా కస్టమర్లు ఆర్డర్‌ చేస్తారు. తినేంత తినేసి మిగతాది వదిలేస్తారు. సదరు ఎంగిలి పదార్థాలను మరో ఆలోచన లేకుండా రెస్టారెంట్‌ వాళ్లు చెత్తలో వేస్తారు. వాళ్లకు ఆల్రెడీ డబ్బులు అందాయి కాబట్టి ఏ బాధ ఉండదు. అయితే సమయం, వనరులు, డబ్బు... ఇలా ఆహారోత్పత్తిలో ఎన్నో ముడిపడి ఉంటాయి. ఆహారాన్ని నేలపాలు చేయడం అంటే దేశ ఆర్థిక రంగాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసినట్టే.


- బిగ్‌ ఫ్యాట్‌ వెడ్డింగ్స్‌: మన ‘అలా్ట్ర గ్రాండ్‌’ వివాహాలు దుబారా ఖర్చులకు కేరాఫ్‌గా మారాయి. పెళ్లి, ఇతర వేడుకల్లో ప్రతిష్ట, దర్పం చూపించడానికి, మర్యాద కోసం లెక్కకు మించి ఆహార పదార్థాలను తయారుచేస్తున్నారు. పెళ్లి తతంగం అయిపోయాక సుమారు 40 శాతం ఆహార పదార్థాలు వ్యర్థాల్లో చేరుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి.

- మార్కెట్లలో: ప్రస్తుతం నేచురల్‌ ప్రొడక్ట్స్‌కే ప్రపంచమంతా ఓటేస్తోంది. అందుకే ఇదివరకటికన్నా ఎక్కువగా నేడు కాస్మొటిక్స్‌, హెల్త్‌కేర్‌ రంగ తయారీల్లో ఆహారోత్పత్తులను వినియోగిస్తున్నారు. అయితే తగిన స్టోరేజ్‌, రవాణా వసతులు లేకపోవడంతో ఆయా కర్మాగారాలకు వెళ్లక ముందే ఈ పదార్థాలు చెడిపోతున్నాయి. అవి తినడానికీ పనికిరావు, కాబట్టి వాటిని వ్యర్థాలుగా పడేస్తున్నారు.


ఆహార వృథాను తగ్గించాలంటే ఆహారాన్ని సేకరించే ఫుడ్‌ బ్యాంకులు, ఎన్‌జీఓ సంస్థల అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే మనదేశంలో ‘ఫీడింగ్‌ ఇండియా’, ‘ఇండియా ఫుడ్‌బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌’, ‘నో ఫుడ్‌ వేస్ట్‌’ లాంటి స్వచ్చంధ సంస్థలు పెళ్లిళ్లు, ఫంక్షన్లలో మిగిలిన ఆహార పదార్థాలను సేకరించి అన్నార్తులకు అందిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆధునిక సాంకేతికతను వినియోగించి కోల్డ్‌ స్టోరేజ్‌, ప్యాకేజింగ్‌ పద్ధతులను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామస్థాయిలో కూడా రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ఈ సమస్య నివారణలో ప్రభుత్వంతో పాటూ వినియోగదారుడిదీ పెద్ద పాత్రే. ఎప్పుడైనా సరే షాపింగ్‌కు ఒక లిస్ట్‌ రాసుకుని వెళ్లాలి. ఆ లిస్ట్‌లో ఉన్నవాటినే తప్ప ఆఫర్లలో కనిపించినవి, కౌంటర్‌ దగ్గర ఊరించిన పదార్థాలను కొనడం మానుకోవాలి. విందులు, వినోదాల సమయంలో టేబుళ్ల మీద భోజనాలను ప్రోత్సహించాలి.


బఫేలను తగ్గించుకోవాలి. వంటింటి ఆర్గానిక్‌ వ్యర్థాలను పెరట్లో మొక్కలకు ఎరువులుగా ఉపయోగించడం అలవరచుకోవాలి. అపార్ట్‌మెంట్లలో కూడా ఇలాంటి సదుపాయాలను ఏర్పరిస్తే ఇంకా మంచిది. ఇలా చిన్ని చిన్ని చర్యలతో పెద్ద మార్పులకు శ్రీకారం చుడితే... ఆహార వృథాను తొందరలోనే అరికట్టవచ్చు. తద్వారా ఆకలిబాధతో అలమటిస్తున్న ఎంతోమంది కడుపు నింపొచ్చు. ఆహార వృథా పట్ల చిన్నప్పటి నుంచే పిల్లల్లో అవగాహనను పెంపొందించాలి. పెద్దలు ఆహార వృథాను నేరంగా భావించాలి. భావితరాలను దృష్టిలో పెట్టుకుని, ఆహార నిపుణులు చెబుతున్న చిన్న చిన్న సూచనలను పాటిస్తే తప్పకుండా మనకే కాదు ఈ ధరిత్రికి కూడా మేలు జరుగుతుంది. అందుకే ఈసారి ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టినప్పుడో, ప్లేట్‌లో ఆహారాన్ని వదిలేసినప్పుడో, ఆహారం విషయంలో ఆడంబరాలకు పోయేటప్పుడో ఒక్క క్షణం ఆలోచించండి.

- డి.పి.అనురాధ


అనుసరణ మార్గాలు...

నేడు అనేక దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆహార వృఽథా. ఒక్కో దేశం ఒక్కో పద్ధతిలో ఈ సమస్య నివారణ కోసం కృషి చేస్తున్నాయి. కొన్ని దేశాల చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెందిన ‘పే యాజ్‌ యువ్‌ త్రో’ ప్రోగ్రాం గురించి చెప్పుకోవాలి. అక్కడ ఎంత చెత్త వేస్తే అంత డబ్బు ప్రభుత్వానికి కట్టాలి. దీంతో ఫుడ్‌ వేస్టేజ్‌ 30 శాతానికి తగ్గిందట. ఇక డెన్మార్క్‌లో ‘స్టాప్‌ వేస్టేజ్‌’ ఆహారోద్యమం ఉప్పెనలా ఎగసింది. ఆహార వృథా గురించి అవగాహన కార్యక్రమాలు, చట్టాలు చేశారు. దీంతో అయిదేళ్లలో ఆహార వృఽథా 25 శాతానికి తగ్గింది. ఇటు ఆహార వృథాను, అన్నార్తుల సంఖ్యను తగ్గించేందుకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 900 పైచిలుకు ఫుడ్‌బ్యాంకులు పనిచేస్తున్నాయట.


చిన్న ఆలోచన...

పెద్ద మార్పు...

‘బఫే’ భోజనాలలో తొందరగా తినగలిగే వెసులుబాటు ఉంటుంది. లెక్కకు మంచి ఆహారపదార్థాలు ఊరిస్తున్నప్పుడు ఏది ఎంత తినాలో తెలియక ప్లేటులో వేసుకుని, ఆ తర్వాత వృథా చేస్తాం. దీన్ని అరికట్టడానికి ఈ దిగువ పేర్కొన్న అంశాలపై దృష్టిపెట్టాలి. ఇవన్నీ చాలా సులభంగా ఆచరించగల చిన్న చిన్న అంశాలే.

- ప్లేట్‌ సైజు తగ్గించాలి: ప్రస్తుతం ఉపయోగిస్తున్న భోజన ప్లేట్ల వ్యాసాన్ని 3 సెంటిమీటర్లకు తగ్గిస్తే... ఓ ప్లేట్‌లోని ఆహార వృథా 19.5 శాతం తగ్గుతుందట.

- చాలా హోటల్స్‌, రెస్టారెంట్లలో టేస్ట్‌ కోసం ఫుడ్‌ శాంపిల్స్‌ను ప్రత్యేకంగా పెడుతుంటారు. అయితే వీటిని పెద్ద గిన్నెలలో కాకుండా చిన్న గిన్నెల్లో ఉంచితే, వృథా చాలా మటుకు తగ్గుతుంది.

- ఉష్ణోగ్రతలు నియంత్రించగల పాత్రలలో ఆహార పదార్థాలను ఉంచితే ఎక్కువసేపు తాజాగా ఉంటాయి.

- ఖరీదైన ఆహార పదార్థాలను అప్పటికప్పుడు వడ్డించడం వల్ల వృఽథాను అరికట్టవచ్చు.


- వంటల కోసం ఫ్రోజెన్‌, డ్రై ఆహార పదార్థాలను ఉపయోగించడం మంచిది. వీటిని ఎప్పటికప్పుడు, తక్కువ సమయంలో తాజాగా వండొచ్చు.

మనదేశం పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. కానీ తగిన విధంగా నిల్వచేసే వసతులు మనదగ్గర లేనందువల్ల 40 శాతం పండ్లు, కూరగాయలు మార్కెట్‌లోకి రాక ముందే చెడిపోతున్నాయి. చెన్నైకి చెందిన ‘గ్రీన్‌పాడ్‌ ల్యాబ్‌’ అనే స్టార్టప్‌ ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని కనుగొంది. ప్రత్యేకమైన ప్యాకేజింగ్‌ కవర్లను ఈ స్టార్టప్‌ రూపొందించింది. పండ్లు, కూరగాయలని ఈ కవర్లలో ప్యాక్‌ చేయడం వల్ల వాటి నాణ్యత, తాజాదనంలో మార్పు రాదు. అలాగే అవి తొందరగా పరిపక్వం చెందకుండా నివారిస్తాయి.

ఆహార వృథా నివారణకు దిల్లీకి చెందిన ‘వేస్ట్‌లింక్‌’ అనే స్టార్టప్‌ సృజనాత్మక పరిష్కారాన్ని అందిస్తోంది. ఆహార పదార్థాలను తయారుచేసే కర్మాగారాల్లో మిగిలిపోయిన ముడి పదార్థాలను, ఆహార ఉప ఉత్పత్తులను సేకరించి... జంతువుల ఆహారాన్ని తయారుచేస్తోంది. ఈ ఆహార పదార్థాలలో పోషక విలువలు ఎక్కువగా ఉండడం విశేషం.


ఎంతెంత?

ఏ ఆహారాన్ని ఎంత వృథా చేస్తున్నాం..

- ఆహార గింజలు: 12 శాతం

- మాంసం: 12 శాతం

- పాల ఉత్పత్తులు: 17 శాతం

- పండ్లు, కూరగాయలు: 28 శాతం

- సీఫుడ్‌ : 33 శాతం

మొత్తం ఆహారంలో 30 నుంచి 40 శాతం అసలు తినడమే లేదు.


ఈ వార్తలు కూడా చదవండి

CBI: రూ.70 లక్షల లంచం డిమాండ్‌

Operation Sindoor: ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..

Southwest Monsoon: ముందుగానే నైరుతి రుతుపవనాలు

Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్‌

Read Latest Telangana News and National News

Updated Date - May 11 , 2025 | 11:01 AM