Rahul Gandhi: కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ సంచలన ఆరోపణలు.. ఆధారాలు చూపిస్తూ..
ABN, Publish Date - Aug 07 , 2025 | 07:33 PM
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియా ముందు చూపిస్తూ వివరించారు.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియా ముందు చూపిస్తూ వివరించారు. ఓటర్ జాబితాలో అనేక నకిలీ ఓట్లు ఉన్నాయన్నారు. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తుండడంతో అనుమానం వచ్చిందని.. మహారాష్ట్ర, హర్యాణా, మధ్యప్రదేశ్ ఫలితాలతో తమ అనుమానాలు బలపడ్డాయని చెప్పారు.
మహారాష్ట్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్రలో ఐదు నెలల్లో ఏకంగా 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని చెప్పారు.
మహారాష్ట్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఐదేళ్లలో ఎంత మంది నమోదయ్యారో.. ఐద నెలల్లో అంత కంటే ఎక్కువగా ఐదు నెలల్లో నమోదయ్యారని తెలిపారు. లోక్‌సభ, విధానసభ ఎన్నికల మధ్య మొత్తం కోటి మంది ఓటర్లు నమోదయ్యారని తెలిపారు.
ఓటరు జాబితాలో చాలా వరకు అడ్రస్ లేకుండానే ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఓటర్ల లిస్ట్‌లో పేర్లు ఉన్నా.. ఫోటోలు సరిగా లేవన్నారు. ఈసీని ఎలక్ట్రానిక్ డేటాను కోరగా.. ఇవ్వడం లేదంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.
కర్ణాటకలో 16 పార్లమెంట్ స్థానాల్లో తామే గెలుస్తామని అంచనా వేయగా.. 9 సీట్లు మాత్రమే వచ్చాయని రాహుల్ అన్నారు. బెంగళూరు సెంట్రల్‌తో పాటూ 7 లోక్‌సభ సీట్లలో అనూహ్యంగా ఓటమిపాలయ్యామని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల విషయంలో బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ పరిధిలో 6.5లక్షల ఓట్లలో లక్ష ఓట్లు నకిలీవని తమ పరిశోధనలో తేలిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
చాలా మంది వివిధ రాష్ట్రాల్లో ఒటు హక్కును కలిగి ఉన్నారని రాహుల్ ఆరోపించారు. ఉదాహరణకు ఆదిత్య శ్రీవాస్తవ్ అనే ఓటరు కర్ణాటక, మహారాష్ట్ర, యూపీలో ఓటర్ ఐడీలు కలిగి ఉన్నాడంటూ ఆయన వద్ద ఉన్న ఆధారాలు చూపించారు.
చాలా ఓటర్ల ఇళ్ల నంబర్లు 0 గా ఉన్నాయని, కొన్ని చిరునామాల్లో తప్పుడు పేర్లు కూడా ఉన్నట్టు కనిపించిందని రాహుల్ గాంధీ అన్నారు. ఒకే చిరునామాలో 50 నుంచి 80 మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. దర్యాప్తు జరుగుతున్నప్పుడు కొందరు అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు.
బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ, మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్ల జాబితాలోనూ భారీ అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ తెలిపారు. 11,965 డూప్లికేట్ ఓటర్లు, 40,009 నకిలీ, తప్పుడు చిరునామా, 10,452 సింగిల్ అడ్రస్‌విగా కాగా 4132 తప్పుడు ఫొటోలు ఉన్న ఓటర్లు ఉన్నారన్నారు. అలాగే మరో 33,692 ఓటర్లు ఫారం-6 దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
కర్ణాటకలో ఓటర్ల జాబితా విషయంలో రాహుల్ గాంధీ ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఎన్నికలనకు సంబంధించిన అంశాలపై న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు.
రాహుల్ ఆరోపణలకు సంబంధించిన అధికారిక డిక్లరేషన్, నకిలీ ఓటర్ల వివరాలను సమర్పించాలని కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా సూచించారు. అయితే ఆధారాలు తప్పని తేలితే.. 1059 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం శిక్ష పడే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు.
Updated Date - Aug 07 , 2025 | 07:42 PM