Basavatarakam Indo American Cancer Hospital: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన
ABN, Publish Date - Aug 13 , 2025 | 09:52 PM
రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్ నందమూరి బాలకృష్ణ దంపతులు శంకుస్థాపన చేశారు. తుళ్లూరులో ఈ7 రహదారిని ఆనుకుని ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. 2019లోనే ఈ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. కానీ గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టారు.
పేదవారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించడం తన కన్నతల్లి కోరిక అని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆమె కోరికే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిగా సేవలందిస్తోందని చెప్పారు. లాభాపేక్ష లేని ఈ ఆసుపత్రి.. దాతల సహకారంతో నడుస్తుందన్నారు. బుధవారం (2025, ఆగస్టు 13) తుళ్లూరులో ఈ7 రహదారిని ఆనుకుని ఆసుపత్రి నిర్మాణానికి చైర్మన్ నందమూరి బాలకృష్ణ దంపతులు శంకుస్థాపన చేశారు.
అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 2019లో శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. కానీ అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అంధకార పరిస్థితులు ఏర్పాడ్డాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టలేక పోయామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పనులు చేపట్టామన్నారు. వర్షం రూపంలో భగవంతుడు సైతం ఆశీస్సులు అందించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో మొత్తం 21 ఎకరాల్లో 500 బెడ్ల సామర్థ్యంతో రూ. 750 కోట్లతో ఈ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నారు.
Updated Date - Aug 13 , 2025 | 09:52 PM