CM Chandrababu: కుట్రలను ముందే పసిగట్టాలి: సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Oct 21 , 2025 | 11:02 AM
మంగళగిరి APSP బెటాలియన్‍లో పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కుట్రలు ముందే పసిగట్టాలని పోలీసులకు సూచించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని వారిని అప్రమత్తం చేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలను పసిగట్టాలని పోలీసులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు హితవు పలికారు.
పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన అంశంతో మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూశారన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి వేరే వాళ్లపై నెపం వేసి రాజకీయ లబ్దిపొందాలని చూశారన్నారు.
అక్టోబర్ 21వ తేదీ మంగళవారం మంగళగిరి APSP బెటాలియన్‍లో పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పోలీస్ వ్యవస్థ సమర్థంగా ఉండాలని.. నేరస్తులు భయపడేలా పని చేయాలని వారికి సీఎం సూచించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గూగుల్ పెట్టుబడులు విశాఖపట్నంకు వచ్చాయంటే.. అది ఒక నమ్మకమన్నారు.
అతిపెద్ద పెట్టుబడులు వస్తున్నాయంటే పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నామని ఆయన వివరించారు.
ఈగల్, శక్తి బృందాలతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. డ్రగ్స్, గంజాయి స్థావరాలను గుర్తించి వాటిని ధ్వంసం చేస్తున్నారని చెప్పారు.
నేర రహిత సమాజం కోసం పని చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Updated Date - Oct 21 , 2025 | 11:05 AM