Induru Bhumanna Died In Bahrain: దారుణం.. చనిపోయిన ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలు
ABN, Publish Date - Oct 01 , 2025 | 06:00 PM
గల్ఫ్‌లో ఉపాధి కోసం వలస వెళ్లి.. అసువులు బాసిన తెలంగాణ ప్రవాసీకి దాదాపు ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలు జరిగిన సంఘటన తాజాగా బహ్రెయిన్‌లో చోటు చేసుకుంది.
గల్ఫ్‌లో ఉపాధి కోసం వలస వెళ్లి.. అసువులు బాసిన తెలంగాణ ప్రవాసీకి దాదాపు ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలు జరిగిన సంఘటన తాజాగా బహ్రెయిన్‌లో చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం తిరుమలపల్లికి చెందిన ఇందూరు భూమన్న ఉపాధి కోసం గల్ఫ్‌లోని బహ్రెయిన్‌కు గతంలో వలస వెళ్లాడు. 2019లో అతడు తప్పిపోయాడు. కొన్ని రోజుల తర్వాత.. అతడి మృతదేహం సముద్ర తీరంలో స్థానికులు కనుగొని.. పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని.. ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
భూమన్న కంపెనీ నుంచి పారిపోయి అక్రమంగా పని చేసుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది. అయితే భూమన్న మరణానికి పరిహారం చెల్లంచాలంటూ అతడి కుటుంబం.. మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ తిరిగి చేసిన పోరాటం ఫలించలేదు. ఈ నేపథ్యంలో అతడి మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తూ ఆఫిడవిట్‌ను ఆ కుటుంబం పంపలేదు. దీంతో చాలా ఆలస్యమైంది. కనీస పరిహారం కూడా దక్కకపోవడంతో ఆ కుటుంబం మిన్నకుండిపోయింది.
ఇక ఇటీవల బహ్రెయిన్‌లోని పెండింగ్ మృతదేహాలను ప్రభుత్వం క్లియర్ చేస్తుంది. ఆ క్రమంలో ఇందూరు భూమన్న మృతదేహం గురించి సామాజిక సేవకుడు డొర్నాల శివకుమార్.. తెలుగు కళా సమితి, కిమిడి మణిధర్, జావీద్ బాషాల సహకారంతో భూమన్న కుటుంబాన్ని సంప్రదించారు. అనంతరం భూమన్న కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన పత్రాలను వారు పొందారు. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం అతడి దహన సంస్కరాలు జరిపించారు.
అలాగే తూర్పు గోదావరి, విశాఖపట్టణం జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళల మృతదేహాలు సైతం ఐదేళ్లకుపైగా పెండింగ్‌లో ఇలాగే ఉండిపోయాయి. ఆ మృతదేహాలకు సైతం శివకుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు చెందిన శివకుమార్ బహ్రెయిన్‌లో జీవిస్తున్నారు. అక్కడి తెలుగు వారికి కార్మిక బంధువుగా ఆయన పేరు పొందారు. ఆపదలో ఉన్న వారికి శివకుమార్ తన వంతు సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే బహ్రెయిన్‌లోని తెలుగు ప్రవాసీ సంఘం తెలుగు కళా సమితి సైతం ఆయనకు పూర్తిగా తన తోడ్పాటును అందిస్తోంది.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం
For More NRI News And Telugu News
Updated Date - Oct 01 , 2025 | 08:03 PM