Delhi Rains: ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం
ABN , Publish Date - Sep 30 , 2025 | 02:33 PM
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ, విమానయాన సంస్థలు కీలక ప్రకటనలు జారీ చేశాయి.
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతం (NCR)లో మంగళవారం ఉదయం భారీ వర్షం (Delhi Rains) కురిసింది. ఈ వర్షం ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, పండుగ సీజన్‌లో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు, విమాన సేవల్లో అంతరాయం వంటి సమస్యలను తెచ్చిపెట్టింది. ఢిల్లీతో పాటు నోయిడా, గాజియాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. గాలులతో కూడిన ఈ వర్షం రాజధానిలో ఒక్కసారిగా వాతావరణాన్ని చల్లబరిచింది.
వాతావరణ సూచన ఏంటి?
భారత వాతావరణ శాఖ (IMD) సూచనల ప్రకారం ఢిల్లీ NCRలో ఈ రోజంతా తేలికపాటి వర్షం కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ, గురుగ్రామ్‌లో మధ్యాహ్నం 2:55 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, నోయిడా, గాజియాబాద్‌లో ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
విమాన సంస్థల కీలక సూచనలు
వర్షం కారణంగా విమాన సేవలపై కూడా ప్రభావం పడింది. ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేశాయి. ఇండిగో సోషల్ మీడియా X పోస్ట్‌లో ఢిల్లీలో నిరంతర వర్షం, ఉరుములతో కూడిన వానల కారణంగా విమాన సేవలు ఆలస్యం కావచ్చని తెలిపింది. మా బృందం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, వాతావరణం మెరుగైన వెంటనే సేవలు సాధారణ స్థితికి వస్తాయని ప్రకటించింది.
ముందుగానే బయలుదేరాలి
అదే సమయంలో, ఎయిర్ ఇండియా కూడా ఢిల్లీ నుంచి వచ్చే, వెళ్లే విమానాలు వర్షం కారణంగా ప్రభావితమవుతాయని తెలిపింది. విమానయాన సంస్థలు ప్రయాణికులకు తమ విమాన స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవాలని, రోడ్లపై ట్రాఫిక్ ఆలస్యం కారణంగా కొంత ముందుగానే బయలుదేరాలని సూచించాయి. మీ విమాన స్థితి గురించి మా వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా చెక్ చేసుకోవాలని కోరింది. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ముందుగానే బయలుదేరాలని సూచించింది.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సూచన
ఇదే సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో ప్రస్తుతం విమానాల ఆపరేషన్లు సరిగానే జరుగుతున్నాయని తెలిపింది. ఈ వర్షం కారణంగా ఢిల్లీ, NCR ప్రాంతంలో ప్రయాణం చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విమానంలో ప్రయాణించే ముందు విమాన స్థితిని ఆన్‌లైన్ ద్వారా చెక్ చేసుకుని వెళ్లాలని కోరింది. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి, ఎయిర్‌పోర్ట్‌కు ముందుగానే బయలుదేరాలని సూచించింది. దీంతోపాటు IMD వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి