Prof Mamidala Ramulu: ఏరో స్పేస్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయి : ప్రొ.మామిడాల రాములు
ABN, Publish Date - Dec 23 , 2025 | 12:24 PM
తెలంగాణ విమానయాన తయారీ రంగంలో వృత్తి నైపుణ్యత పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని అమెరికాలోని బోయింగ్ విమాన తయారీ సంస్థ శాస్త్రవేత్త, పరిశోధన విభాగ అధిపతి ప్రో. మామిడాల రాములు అన్నారు.
తెలంగాణ విమానయాన తయారీ రంగంలో వృత్తి నైపుణ్యత పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని అమెరికాలోని బోయింగ్ విమాన తయారీ సంస్థ శాస్త్రవేత్త, పరిశోధన విభాగ అధిపతి ప్రో. మామిడాల రాములు పేర్కొన్నారు. ఏరో స్పేస్ రంగ నిపుణులకు వృత్తి, ఉపాధి కల్పన రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బోయింగ్ రూపకల్పన, పరిశోధనతో అనుబంధం ఉన్న సీనియర్ విద్యావేత్త, వాషింగ్టన్, సియాటిల్ విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్, తెలంగాణా ముద్దు బిడ్డ, జనగాం ప్రాంత వాసి ప్రొ. మామిడాల రాములు తో సోమవారం డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లోని CSTD డిజిటల్ క్లాస్‌రూమ్‌లో ముఖాముఖి చర్చ (ఇంటరాక్టివ్ సెషన్) జరిగింది. ఈ అకాడమిక్ చర్చలో అన్ని విభాగాల అధ్యాపకులు, పరిశోధనా విద్యార్ధులు, విశిష్ట విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రో. మామిడాల రాములు మాట్లాడుతూ విద్యా రత్నాలకు నిలయాలు సంక్షేమ వసతి గృహాలని వివరించారు.తాను కూడా అలాంటి సంక్షేమ వసతి గృహం నుంచే వచ్చానని చెప్పుకోవడానికి సంతోషంగా ఉందన్నారు. పెద్దొళ్ల ఇళ్లలో అన్నానికి ప్రాధేయపడే స్థాయి నించి పెద్దోళ్ల పిల్లలకు పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగినట్లు పేర్కొన్నారు. ఎవరిని అయినా ఉన్నత స్థాయిలో నిలిపే ఏకైక సాధనం 'విద్య' మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. విద్యలో రాణించేవారిని ప్రోత్సహించాలని, విద్య విలువలు, వృత్తి నైతికతను పాటించాలని సూచించారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాని చెప్పారు. తనను చదువుకోకుండా తన తల్లిదండ్రులను అప్పటి దొరలు ప్రభావితం చేసినప్పటికీ నమ్ముకున్న 'చదువు' అనే సాధనంతో ఉన్నత విద్యను అమెరికాలో చదివి, అక్కడే ప్రొఫెసర్ గా విధులు నిర్వహించే స్టాయికి ఎదిగానని ఆయన వెల్లడించారు.
ప్రఖ్యాత విమాన తయారీ రంగ సంస్థ పరిశోధన, అభివృద్ధి సంస్థకు ఉన్నతాధికారిగా నియమితమయ్యే స్థాయికి చేరానని ఇది ఓ తెలంగాణా బిడ్డగా తనకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. విద్యా విధానంలో పాఠ్య అంశాల సిద్ధాంతపరమైన భోధనతో పాటు ప్రయోగధారిత బోధనా ఉండాలని వెల్లడించారు. ఒక్క థియరీ మాత్రమే చదివి వంద శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినా ఉపయోగం ఉండదని, ప్రాక్టికల్ గా అనుభవం గడించినప్పుడే మరింత ఎదగడానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యార్ధులు, పరిశోధకులు ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఒక్కసారి స్థానిక పరిస్థితుల్లో సరైన గుర్తింపు రాకపోయినా నైపుణ్యం కలిగిన విద్యావంతుడికి ప్రపంచంలోని ఎక్కడైనా అవకాశం వస్తుందని, అందుకు తానే ఓ ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. చిన్నప్పుడే విద్యార్ధుల జిజ్ఞాసను గమనించి వారిని ఉత్సాహ పరిస్తే వారు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తారన్నారని, విద్య మాత్రమే అటు జీవితాలను ఇటు సమాజాన్ని మార్చగలదని ప్రో. మామిడాల రాములు వివరించారు.
ప్రొ. మామిడాల రాములు కృషి, పట్టుదల స్ఫూర్తిదాయకం : వీసీ ప్రొ. ఘంటా చక్రపాణితెలంగాణలోని జనగాం నుండి వచ్చిన ప్రొ. మామిడాల రాములు గ్రామీణ తెలంగాణ నుండి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థలో పనిచేయడం. పరిశోధక విద్యా వ్యాప్తి, పారిశ్రామిక రంగాలకు ఆయన చేసిన కృషి నిజంగా యువతకు స్ఫూర్తిదాయకం అని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి వివరించారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో తన విశిష్ట బోధన మరియు పరిశోధన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందన్నారు. వృత్తితో పాటు, ఆయన బోయింగ్‌పైన చేసిన పరిశోధనలు, రూపకల్పన లో విశేష అనుభవం గడించారు.
అత్యాధునిక పరిశోధన, పరిశ్రమ - విద్యా సహకారం మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో పలు సరికొత్త ఆవిష్కరణలకు ఆయన దోహదపడ్డారని వెల్లడించారు. ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదురించి ప్రపంచ గుర్తింపు పొందే స్థాయికి ఎదిగారని ప్రొ. ఘంటా చక్రపాణి ప్రశంసించారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో అనుబంధం కలిగిన ప్రముఖ విద్యావేత్త ప్రొ. మామిడాల రాములు అని, ఆ నాటి ఉద్యమ సమయంలో చురుకుగా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారని పేర్కొన్నారు. ప్రొ. రాములు తెలంగాణ గర్వించదగ్గ గొప్ప మేధావి. ఆయన డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని సందర్శించడం, యూనివర్సిటీ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులకు పరిశోధకులకు మార్గదర్శనం చేయడం గర్వకారణం అని ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.
ఈ ముఖాముఖి చర్చలో రాష్ట్ర ప్రభుత్వ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రొ. పిల్లలమర్రి రాములు, ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్ ప్రొ. లక్ష్మీనారాయణ, సామాజిక అంశాల వ్యాసకర్త డా. గుర్రం సీతారాములు, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.ఎల్ విజయ కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొని తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనేక అంశాలకు సంబంధించి పలు సందేహాలను లేవనెత్తి ప్రొ. మామిడాల రాములుతో అర్ధవంతమైన చర్చలో భాగస్వాములు అయ్యారు. కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, ఆయా విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..
తానా ఆధ్వర్యంలో ఛార్లెట్‌లో ఫుడ్ డ్రైవ్.. సక్సెస్
సుందర్ పిచాయ్‌తో ఏపీలో టెక్ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చర్చ
Updated Date - Dec 23 , 2025 | 12:36 PM