‘నెయిల్ థియరీ’ మీరేమిటో చెప్పేస్తుంది
ABN, Publish Date - May 11 , 2025 | 09:17 AM
‘ఈరోజు పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నా అందుకే మ్యాచింగ్ పింక్ అనో... ఎల్లో డ్రెస్ కాబట్టి ఎల్లో నెయిల్ పాలిష్’ అంటే మీకు ఫ్యాషన్ తప్ప దాని వెనక సైకాలజీ బొత్తిగా తెలియదనే అర్థం. ‘మీ గోళ్ల రంగుని బట్టి మీ వ్యక్తిత్వం, ఇష్టాలు ఇంకా మీ స్టేటస్.... తెలుసుకోవచ్చ’ని అంటున్నారు ఫ్యాషన్ సైకాలజిస్టులు. అందుకే ఇటీవల అమ్మాయిలు ఎంతో ఆలోచించి నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారట. అదే ప్రస్తుతం ‘నెయిల్ థియరీ’గా ట్రెండింగ్ అవుతోంది.
సోషల్ మీడియా పుణ్యమాని నిమిషానికో కొత్త ఫ్యాషన్ చిటికెలో రాజ్యమేలుతోంది. ప్రపంచాన్ని ఇట్టే చుట్టేస్తోంది. మిలీనియల్స్, జనరేషన్ జెడ్ మగువలు ఈ ఫ్యాషన్లను, ట్రెండ్లను కాస్త గట్టిగానే ఫాలో అవుతున్నారు. అప్పట్లో ఇటలీలో ప్రారంభమైన తరవాత ఎప్పుడోగానీ కొత్త ఫ్యాషన్లు మన నేలకు చేరేవి కావు. నేడు సూపర్‌స్పీడ్ సోషల్ మీడియా వల్ల అవి క్షణాల్లో అందరికీ చేరిపోతున్నాయి. దుస్తులు, యాక్ససరీస్ మాత్రమే కాదు... జుత్తు నుంచి గోళ్లదాకా కూడా కొత్త కొత్త ట్రెండ్స్ యువతరాన్ని ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఓ కొత్త ఫ్యాషన్ ట్రెండ్ ‘నెయిల్ థియరీ’.
ఎవరూ అంతగా పట్టించుకోని గోళ్లకు కూడా ఓ సిద్ధాంతం ఉందంటే ఆశ్చర్యంగానే కాదు, ఆసక్తిగానూ అనిపిస్తుంది ఎవరికైనా. అయితే ఇదంతా సోషల్ మీడియా వల్ల కొత్తగా పాపులర్ అవుతోన్న థియరీ. దీనికి ఎలాంటి శాస్త్రీయతా లేదనేది స్పష్టం. కానీ ట్రెండీగా, ఫన్‌గా ఉందని స్టార్లు, సెలబ్రిటీలంతా వీటిని ఫాలో అవుతున్నారు. దాంతో యువతరం పొలోమంటూ వారిని ఫాలో అవుతోంది. గోళ్ల రంగులు ఒక్కోటి ఒక్కో సైకాలజీని తెలియజేస్తాయని ‘నెయిల్ థియరీ’ చెబుతోంది. వాటి వెనక ఉన్న సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే...
ఎరుపు రంగు గోళ్లు: 2022లో ట్రెండ్ అయిన తొలి నెయిల్ థియరీ ఇది. ప్రేమ,
ధైర్యం, మనోస్థయిర్యానికి ప్రతీక ఎరుపు రంగు. అందుకే గోళ్లకు ఈ రంగు వేసుకున్న వాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉంటారని చెబుతారు. అలాగే అందరినీ ఆకర్షించేందుకూ ఎరుపు రంగు బాగా దోహదపడుతుంది. సాధారణంగా ఎరుపురంగు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి అందర్నీ ఇట్టే ఆకర్షిస్తుంది. ప్రేమలో పడాలని, అందరి దృష్టినీ ఆకర్షించాలని కోరుకునే అమ్మాయిలు గోళ్లకు ఎరుపు రంగు వేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటారని ఫ్యాషన్ పండితులు చెబుతున్నారు. అయితే ఈ సిద్ధాంతాన్ని సీరియస్‌గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే పాతతరం మహిళలు ఎక్కువగా ఎర్ర రంగు నెయిల్ పాలిష్‌నే వేసుకునేవాళ్లు. అప్పట్లో మిగతా రంగులు అంతగా అందుబాటులో ఉండేవి కావు. కొన్ని ఉన్నా కూడా ఆ రంగులపై వారు అంతగా ఆసక్తి చూపించేవాళ్లు కాదు.
నలుపు రంగు గోళ్లు: ఇదో పాపులర్ ట్రెండ్. 2023 ఆఖరు నుంచి 2024 ప్రారంభం వరకు ట్రెండింగ్‌లో ఉంది. స్వతంత్రంగా వ్యవహరించే మహిళలు నలుపు రంగును గోళ్లకు వేసుకుంటారు. వారి డిక్షనరీలో భయం అనేది ఉండదు. స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడతారు. జీవితంలో హెచ్చుతగ్గులు నడుస్తున్న వేళ మగువలు నలుపు రంగు పాలిష్‌ను గోర్లకు వేసుకుని ఆత్మవిశ్వాసంగా ఫీల్ అవుతారని ఈ థియరీ చెబుతోంది. ఎరుపు రంగు ఎదుటివారిని ఆకట్టుకోవడానికి అయితే, నలుపు రంగు... అమ్మాయిల అంతర్గత ఆత్మస్థయిర్యాన్ని పెంచేందుకు దోహదం చేస్తుంది.
నీలం రంగు గోళ్లు: గత ఏడాది బాగా పాపులర్ అయిన ట్రెండ్ ‘బ్లూ నెయిల్ థియరీ’. 2024లో అత్యధికంగా గూగుల్ చేసిన పది ట్రెండ్లలో బ్లూ నెయిల్ థియరీ ఒకటి. దీనికి కారణం కొంతమంది యువతులు చేసిన రీల్స్. వాటిల్లో యువతులు తమ గోళ్లను చూపెడుతూ ఏ రంగు వేసుకోవాలని సహచరులను అడిగితే, వాళ్లు ‘నీలం’ అని చెబుతారు. ఆ రీల్స్ అన్ని దేశాలలో హిట్టయ్యి బ్లూ నెయిల్ థియరీని పాపులర్ చేశాయి. ఏ అమ్మాయి అయినా తన గోళ్లకు నీలం రంగు వేసుకుంది అంటే, తను ‘ఆల్రెడీ కమిటెడ్’ అని చెప్పకనే చెప్పినట్టు. ఎందుకంటే మగవాళ్లకి ఇష్టమైన రంగు నీలం. అందుకే రిలేషన్‌షిప్ కోసం వెతికే అబ్బాయిలు గోళ్ల రంగును చూసి ప్రపోజ్ చేయడం మంచిదని అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. నీలం రంగు నెయిల్ పాలిష్ వేసుకున్న అమ్మాయి కనిపించిందంటే... ఆమె ఎంగేజ్‌మెంట్ రింగు ధరించినట్టుగానే భావించాలంటున్నారు.
తెల్ల రంగు గోళ్లు: అనాదిగా స్వచ్ఛత, పవిత్రతలకు చిహ్నం తెలుపు. ఎవరైనా తెలుపు రంగు నెయిల్ పాలిష్ వేసుకున్నారంటే అది వారి స్టేటస్ సింబల్ అని, బంధం ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఎదుటివారికి ఇట్టే తెలిసిపోతుంది. తెలుపు రంగుకు యువకులు, పురుషులు తొందరగా ఆకర్షితులవుతారు. ముత్యం లాంటి స్వచ్ఛత గల స్త్రీని ఇష్టపడని వాళ్లు ఎవరు? వాస్తవానికి ఏ వయసు మగువల గోళ్లకైనా నప్పే ఒకే ఒక్క రంగు తెలుపు.
ఆకుపచ్చ రంగు గోళ్లు: 2025లో వెలుగులోకి వచ్చిన ట్రెండ్ ఇది. శాంతి, సమృద్ధి, ఆరోగ్యం, అదృష్టాన్ని కాంక్షించేవాళ్లు ఆకుపచ్చ నెయిల్ పాలిష్‌ని వేసుకుంటున్నారు. జేడ్ పాలిష్, మెటాలిక్ గ్రీన్ గోళ్లతో సింథియా ఎరివో, కర్దాషియా లాంటి హాలీవుడ్ స్టార్లు ఈ రంగును పాపులర్ చేస్తున్నారు. క్యాజువల్‌గా ఉంటూ క్లాసీలుక్ ఇస్తాయి ఈ రంగు గోళ్లు.
ఇవేగాక మగువల సౌకుమార్యానికి ప్రతీకగా నిలిచే గులాబీ... విజ్ఞత, లగ్జరీకీ ప్రతీకగా ఊదారంగు నెయిల్ థియరీలు వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే ఈ సిద్ధాంతాలు వ్యక్తిగత ఫ్యాషన్ల కన్నా ఎదుటి వారిని ఆకర్షించే ధోరణిలోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో కొద్దిగా ఎలైట్ సెక్షన్‌లో మాత్రమే ఈ తరహా సిద్ధాంతాలపై చర్చ ఉంటుందనేది ఒక వాదన అయితే, గోళ్ల రంగును చూసి దగ్గరయ్యే వాళ్లను ఎంత వరకు నమ్మొచ్చనే చర్చ అంతర్జాతీయంగా జరుగుతోంది. ‘కుదిరితే నాలుగు మాటలు, ఓ కప్పు కాఫీ’ తరవాతే ఎవరి మధ్యనైనా పరిచయం పెరుగుతుందనేవాళ్లు ఈ తరహా నెయిల్ థియరీలను కొట్టి పారేస్తున్నారు.
అయితే ముందుగా చెప్పుకున్నట్టు సోషల్‌మీడియా ప్రభావం నేటి తరంపై కాస్త గట్టిగానే ఉంది. రీల్స్, ఇతరత్రా సొగసుకు సంబంధించిన వీడియోలు ఇలాంటి థియరీలను ట్రెండింగ్‌లో నిలుపుతున్నాయి. అమ్మాయిలు కూడా ట్రెండ్‌తో కొనసాగడానికే ఇష్టపడతారు. ఈ ధోరణితో చూస్తే... మొన్న ఎరుపు, నిన్న నీలం, నేడు ఆకుపచ్చ, రేపు ఏ రంగో? ‘నెయిల్’ అండ్ సీ.
రంగుల సైకాలజీ...
ఇంతకుముందు పొడవు, పొట్టి, గుండ్రం, బాదం... లాంటి గోళ్ల ఆకారాలను బట్టి వ్యక్తుల సైకాలజీ చెప్పేవాళ్లు. ఇప్పుడు గోళ్లకు వేసుకునే నెయిల్ పాలిష్‌ను చూసి మగువల మనస్తత్వం చెప్పేస్తున్నారు. వాస్తవానికి వివిధ రంగులు చెప్పే సైకాలజీనే గోళ్ల థియరీలకూ విస్తరిస్తున్నారు కొందరు ఫ్యాషన్ నిపుణులు.
తెలుపు - స్వచ్ఛత, ఎరుపు - ప్రేమ, నీలం - గాఢత, నలుపు - ఆత్మవిశ్వాసం, గులాబీ - సౌకుమార్యం, ఆకుపచ్చ- సమృద్ధి, ఊదా - విజ్ఞత
ఈ వార్తలు కూడా చదవండి
CBI: రూ.70 లక్షల లంచం డిమాండ్
Operation Sindoor: ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..
Southwest Monsoon: ముందుగానే నైరుతి రుతుపవనాలు
Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్
Read Latest Telangana News and National News
Updated Date - May 11 , 2025 | 09:17 AM