ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chhattisgarh: మన నయాగరాను చూసొద్దాం పదండి...

ABN, Publish Date - Oct 12 , 2025 | 08:03 AM

చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ పట్టణానికి ఉత్తరాన... 39 కిలోమీటర్ల దూరంలో ఇంద్రావతి నదికి చెందిన జలపాతమే ‘చిత్రకూట్‌’. దీని ఎత్తు 29 మీటర్లు. ఇది మన దేశంలోనే వెడల్పైన జలపాతంగా పేరొందింది. నీరు బాగా ఉన్న సమయంలో దీని వెడల్పు 200 మీటర్లు.

నయాగరా జలపాతం చూడాలంటే అందరికీ సాధ్యం కాదు. అలాంటివారికి మన పొరుగునే ఉన్న ‘చిత్రకూట్‌’ జలపాతం బెస్ట్‌ ఛాయిస్‌. ప్రకృతి ప్రేమికులకు తన సోయగాలతో... అచ్చంగా నయాగరా జలపాతాన్ని తలపిస్తుంది.

చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ పట్టణానికి ఉత్తరాన... 39 కిలోమీటర్ల దూరంలో ఇంద్రావతి నదికి చెందిన జలపాతమే ‘చిత్రకూట్‌’. దీని ఎత్తు 29 మీటర్లు. ఇది మన దేశంలోనే వెడల్పైన జలపాతంగా పేరొందింది. నీరు బాగా ఉన్న సమయంలో దీని వెడల్పు 200 మీటర్లు. ఈ కారణంగానే దీన్ని ‘భారతదేశపు నయాగరా’ అంటారు. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నపుడు ఈ జలపాతం మూడు పాయలుగా కిందకి దూకుతుంది. చిత్రకూట్‌ జలపాతం గుర్రపునాడ ఆకారంలో ఉంటుంది. నదిలో ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నపుడు గుర్రపు నాడా పైనుంచి నీరు దూకుతుంది. ఈ జలపాతం వద్ద ఒక శివాలయంతో పాటు... జలపాతానికి ఎడమ వైపున సహజంగా ఏర్పడిన గుహలున్నాయి, వీటిని ‘పార్వతీ గుహలు’ అంటారు. దట్టమైన అరణ్యం... చుట్టూ కొండలు... పచ్చని వాతావరణం... చల్లని నీరు... వీటన్నింటిని చూస్తే మనసు ప్రశాంతత పొందుతుంది.

ఇవీ ప్రత్యేకతలు...

వాతావరణ మార్పులకు, సూర్యకిరణాలకు తగ్గట్టుగా ఈ జలపాతం రంగులు మార్చుతుంది. దీనిని చూడటానికే పర్యాటకులు ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. తెల్లవారే సమయంలో కొండలపై నుంచి నీరు కింద పడుతుంటే... పైకి లేచే నీటి పొగ మధ్య నుంచి సూర్యకిరణాలు రంగు రంగులుగా దర్శనమిస్తుంటాయి. వీటిని చూసేందుకే పర్యాటకులు రాత్రికే అక్కడికి చేరుకుంటారు, చిత్రకూట్‌ జలపాతం దగ్గర పర్యాటకుల కోసం నిర్మించిన అతిథి గృహాలున్నాయి. చత్తీస్‌గఢ్‌ పర్యాటక శాఖ కూడా పర్యాటకుల కోసం కాటేజీలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేసింది. ఈ కాటేజీల దగ్గర నుంచి జలపాతం వ్యూ పాయింట్‌ అద్భుతంగా కనిపిస్తుంది. రూ. 2 వేల నుంచి 5వేలకు కాటేజీలు దొరుకుతాయి. అయితే ముందుగానే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఒక్కరోజులో జలపాతంతో పాటు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు చూసి, తక్కువ బడ్జెట్‌తో మంచి అనుభూతిని పొందవచ్చు. జగదల్పూర్‌ చిత్రకూట్‌ మధ్యలో ఎటువంటి రెస్టారెంట్లు, హోటల్స్‌ ఉండవు. కాబట్టి ముందుగానే జగదల్పూర్‌లో కావాల్సినవన్నీ కొనుక్కోవడం మంచిది. జలపాతం చుట్టుపక్కల భోజనం దొరకడం చాలా కష్టం. తినుబండారాలు, పానీపూరి, హాట్‌ చాట్‌, పావ్‌బాజీ వంటివి దొరుకుతాయి.

బైక్‌ రైడర్స్‌కి ఈ మార్గం అద్భుతంగా ఉంటుంది. జూన్‌ నుంచి ఫిబ్రవరి వరకు సందర్శకుల రద్దీ అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో జలపాతం ఉధృతంగా, ఎర్రగా ప్రవహిస్తుంది. జలపాతం చుట్టుపక్కల అడవిలో తిరగడానికి దారులున్నాయి. తెలుగువారికి అక్కడ భాషతో ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అక్కడ దుకాణాలు నిర్వహించే వారందరికీ తెలుగు తెలుసు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులుండవు. చిత్రకూట్‌ జలపాతం సందర్శన తర్వాత సమీపంలోని ఇతర పర్యాటక ప్రదేశాలను కూడా దర్శించుకుని రావొచ్చు.

ఎలా చేరుకోవాలి?

ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్‌ నుంచి జగదల్పూర్‌కు, విశాఖపట్నం నుంచి జగదల్పూర్‌కు రైలు సదుపాయం ఉంది. రోడ్డు మార్గంలో అయితే హైదరాబాద్‌ నుంచి జగదల్పూర్‌కు 600 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 290 కిలోమీటర్లు. విశాఖపట్నం నుంచి ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నరకు రైలు ఉంటుంది. మర్నాడు ఉదయం 5.30 గంటలకు అక్కడికి చేరుకుంటాం. తిరిగి అదే రైలు సాయంత్రం 6.30 గంటలకు ఉంటుంది. మరుసటి రోజు ఉదయానికి విశాఖపట్నం చేరుకోవచ్చు. జగదల్పూర్‌ నుంచి జలపాతం దగ్గరికి ట్యాక్సీలు, జీపులు అందుబాటులో ఉంటాయి.

- వెంకట మహేష్‌ వెల్లంకి,

98489 19121

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరలకు రెక్కలు.. నేటి ధరలు చూస్తే..

విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 12 , 2025 | 08:08 AM