Trump Hotel Rent Scheme: ట్రంప్ హోటల్ రెంట్ స్కీమ్..ఏఐ వీడియోతో నమ్మించేసి లక్షలు కొల్లగొట్టిన మోసగాళ్లు
ABN, Publish Date - May 27 , 2025 | 09:44 AM
సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా అనేక మందిని బురిడీ కొట్టించి డబ్బులు దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక 38 ఏళ్ల భారత అడ్వకేట్ డొనాల్డ్ ట్రంప్ హోటల్ రెంటల్స్ స్కీం (Trump Hotel Rent scheme) గురించి ఓ వీడియో చూసి పెట్టుబడి చేశాడు. కానీ అది చివరకు ఫేక్ అని తెలియడంతో లక్షలు పోగొట్టుకున్నాడు.
ఒక వీడియో చూసి పెట్టుబడి పెట్టాడొక కర్ణాటకకు చెందిన లాయర్. ఆ వీడియోలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నాడు. ట్రంప్ హోటల్ రెంటల్స్ స్కీమ్ (Trump Hotel Rent scheme) గురించి చెబుతున్నాడు. దీనిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రోజూ 3% లాభం వస్తుందని ఆ వీడియో చెబుతోంది. అది చూసి నిజమే కావచ్చని లాయర్ ఇన్వెస్ట్ చేశాడు. కానీ చివరకు అది ఫేక్ అని తెలియడంతో పెట్టిన డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు. అంతేకాదు అది అసలు నిజం వీడియో కానే కాదు. ఫేక్ ఏఐ వీడియో. సైబర్ మోసగాళ్లు ఏఐ వీడియోలను క్రియేట్ చేసి ఇలా మోసాలకు పాల్పడుతున్నారు.
ఎలా మోసపోయాడు
కర్ణాటక హవేరికి చెందిన 38 ఏళ్ల అడ్వకేట్ ఒకరు యూట్యూబ్‌లో ఓ వీడియో చూశాడు. Donald Trump Hotel Rentals అనే పేరుతో వీడియో కనిపించింది. ఆ వీడియో చూడగానే రోజు మూడు శాతం లాభాలు వస్తాయని ఆశపడ్డాడు. ఎందుకంటే, అందులో ట్రంప్ మొహం కనిపించడంతోపాటు, ఆయన వాయిస్ వినిపించింది. ఆ వీడియో నమ్మే మాదిరిగా ఉంది. ఆ క్రమంలో వీడియోలో ఉన్న లింక్‌ను క్లిక్ చేశాడు. వెంటనే ఒక మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయమన్నారు. ఆయన యాప్ ఇన్‌స్టాల్ చేసి, అందులో ఉన్న ఫారమ్‌ను ఫిల్ చేశాడు. బ్యాంక్ అకౌంట్, IFSC కోడ్ లాంటి వివరాలు ఇచ్చాడు. అంతేకాదు ఖాతా యాక్టివేషన్ కోసం రూ.1,500 కూడా చెల్లించాడు.
రోజూ లాభమంట
ఆయనకు మొదట కొన్ని రోజులు నిజంగానే లాభాలు వచ్చాయి. యాప్‌లో డబ్బు పెరిగిపోతుండటంతో, అతనికి ఇది నిజమేనేమో అన్న నమ్మకం కలిగింది. నేరగాళ్లు “మరింత పెట్టుబడి పెడితే, ఆదాయం రెట్టింపు అవుతుంది” అని చెప్పగా, ఆయన నమ్మి మరింత డబ్బు ఇన్వెస్ట్ చేశాడు. ఆ క్రమంలో జనవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకూ రూ.5.93 లక్షల్ని వివిధ బ్యాంక్ ఖాతాలు, UPI IDలు, డిజిటల్ వాలెట్లకు బదిలీ చేశాడు.
చివరకు మాత్రం..
చివరికి ఒకరోజు లాభాలు రావడం ఆగిపోయాయి. యాప్ ఓపెన్ చేయగానే లోడవ్వడం లేదు. వారిని కాంటాక్ట్ చేసినా, ఎవ్వరూ స్పందించడం లేదు. అప్పుడే అతను మోసపోయినట్టు అర్థమైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. మే 6, 2025న హవేరి సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో, అతను ఒక నకిలీ లింక్ ద్వారా మోసపోయినట్టు తేలింది. ఈ స్కామ్‌లో నేరగాళ్లు AI జనరేటెడ్ ట్రంప్ వీడియో ఉపయోగించి మోసం చేసినట్లుగా నిర్ధారించారు. పోలీసులు కొన్ని అకౌంట్లను ట్రేస్ చేసి రూ.1.5 లక్షలు ఫ్రీజ్ చేశారు. కానీ మిగతా డబ్బు వెనక్కి రావాలంటే మాత్రం సమయం పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఇవీ చదవండి:
గుంపులోకి దూసుకెళ్లిన కారు..47 మందికి గాయాలు..
సీక్రెట్ కోడ్ ట్రిక్స్.. సైబర్ నేరాలకు చెక్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 27 , 2025 | 09:44 AM