Create Secret Codes: సీక్రెట్ కోడ్ ట్రిక్స్.. అలాంటి సైబర్ నేరాలకు చెక్..
ABN , Publish Date - May 26 , 2025 | 09:07 AM
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డీప్‌ఫేక్‌లు మన జీవితాల్లోకి ప్రవేశించాయి. వీటి ద్వారా మన సొంత ముఖాలతో వాయిస్ ఉపయోగిస్తూ కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటి నుంచి బయటపడేందుకు ఓ కొత్త మార్గాన్ని ఉపయోగించాలని ఓ టెక్ నిపుణుడు (Create Secret Codes) చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తున్నప్పటికీ, సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డీప్‌ఫేక్ మోసాలు సామాన్యులను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లకు కొత్త అస్త్రంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో సైబర్ టెక్ నిపుణుడు కోడి బారో కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం రహస్య పాస్‌వర్డ్‌లను (Create Secret Codes) సృష్టించుకోవాలని సూచించారు. ఈ రహస్య కోడ్‌లు మీరు నిజమైన వ్యక్తితోనే సంభాషిస్తున్నారా లేక AIతో సృష్టించబడిన డీప్‌ఫేక్‌తోనా అని ధృవీకరించడంలో సహాయపడతాయన్నారు.
ఇప్పటికే అనేక స్కామ్స్..
గత కొన్ని సంవత్సరాలలో డేటా బ్రీచ్‌ల సంఖ్య విపరీతంగా పెరిగింది. చాలా మంది యూజర్ల ఈమెయిల్‌లు, ఫోన్ నంబర్‌లు, కాంటాక్ట్ లిస్ట్‌లు ఇప్పటికే హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ డేటాను ఉపయోగించి, సైబర్ నేరగాళ్లు మీ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడి మాదిరిగా నటించి మోసపూరిత లింకులు లేదా మెసేజులు పంపించి మోసాలకు పాల్పడుతున్నారు. ఉదాహరణకు మీ పాత ఈమెయిల్ ఖాతా హ్యాక్ అయ్యి దాని నుంచి మీ కాంటాక్ట్ లిస్ట్ దొంగిలించబడితే, హ్యాకర్లు ఆ లిస్ట్‌లోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇటీవల యూకేలోని మార్క్స్ అండ్ స్పెన్సర్, కో ఆప్ వంటి రిటైల్ సంస్థలపై జరిగిన సైబర్ దాడులు ఈ ముప్పును ఎదుర్కొన్నాయి. ఈ దాడులలో హ్యాకర్లు సోషల్ ఇంజనీరింగ్ మానవ తప్పిదాలను ఉపయోగించి సిస్టమ్‌లలోకి ప్రవేశించి స్కామ్స్ చేస్తున్నారు.
రహస్య పాస్‌వర్డ్‌లు ఎందుకు ముఖ్యం
సైబర్ భద్రతకు సంబంధించి సాధారణ పాస్‌వర్డ్‌లు లేదా టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌లు ఇప్పుడు సరిపోవు. ప్రత్యేకించి, వృద్ధులు, యువకులు, డిజిటల్ నైపుణ్యాలు తెలియని వారు, ఈ డీప్‌ఫేక్ మోసాలకు లక్ష్యంగా మారుతున్నారు. అందుకే, కుటుంబ సభ్యులు, సన్నిహిత స్నేహితులతో ఒక రహస్య కోడ్‌ను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని ఈ టెక్ నిపుణుడు చెబుతున్నారు. ఈ రహస్య కోడ్ ఒక సాధారణ పదం లేదా ఒక ప్రత్యేక సంకేతం కావచ్చు. ఇది మీకు, మీ ప్రియమైన వారికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఉదాహరణకు మీరు మీ సోదరుడితో “సముద్రం లోతు” అనే కోడ్‌ను నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ మీ సోదరుడు వీడియో కాల్‌లో డబ్బు అడిగితే, మీరు ఈ కోడ్‌ను అడిగి, అది నిజమైన వ్యక్తి అవునా, కాదా అని నిర్ధారించుకోవచ్చు.
ఎలా ప్రారంభించాలి
ఈ విషయాల గురించి మొదట మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. ఆ క్రమంలో మీ కుటుంబ సభ్యులు, సన్నిహిత స్నేహితులతో కలిసి ఒక రహస్య కోడ్‌ను ఎంచుకోండి. ఇది సులభంగా గుర్తుంచుకోగలిగినది. ఇతరులు ఊహించలేనిది అయి ఉండాలి. ఒకసారి కోడ్‌ను ఉపయోగించి, అది సరిగ్గా పనిచేస్తుందో లేదో పరీక్షించండి. దీని ద్వారా పెరుగుతున్న సైబర్ మోసాలను కట్టడి చేయవచ్చని టెక్ నిపుణుడు కోడి బారో అంటున్నారు.
ఇవీ చదవండి:
నేడు పంజాబ్ vs ముంబై మధ్య కీలక మ్యాచ్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి