Plane Crash: మరణ విహంగం
ABN, Publish Date - Jun 13 , 2025 | 05:20 AM
గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం(ఏఐ-171) కూలిపోయిన ఘటనలో 290మంది దుర్మరణంపాలయ్యారు.
గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం 290 మంది దుర్మరణం
మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ
టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిన ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఘటన
లండన్‌కు వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం
పైలట్లు సహా విమానంలోని 240 మంది దుర్మరణం
మృత్యుంజయులుగా బయటపడింది ఇద్దరే
జనావాసాలపైకి దూసుకుపోయిన విమానం
మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడ్డ బోయింగ్-787
హాస్టల్‌లోని 50 మంది మెడికల్ విద్యార్థుల మృతి!
గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలు
మృతుల గుర్తింపునకు కొనసాగుతున్న డీఎన్‌ఏ సేకరణ
అహ్మదాబాద్‌కు రామ్మోహన్‌నాయుడు, అమిత్‌షా
మధ్యాహ్నం ఒకటిన్నర! అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బోయింగ్ 787 గాల్లోకి లేచింది! కేవలం 59 సెకన్లలోనే ఎలా పైకి లేచిందో అలాగే కిందకు కూలిపోయింది! చుట్టుపక్కల జనావాసాల్లోకి దూసుకుపోయింది! విమానం అప్పుడే బయలు దేరడంతో ట్యాంకు నిండా ఇంధనమే! అది కూడా.. ఏకంగా 1.25 లక్షల లీటర్లు! దాంతో, భారీ విస్ఫోటం. పెద్దఎత్తున మంటలు! కరి మబ్బులు నేలకు దిగాయా అన్నట్లు చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగ! ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 240 మంది మరణించారు! వారిలో అత్యధికుల మృతదేహాలు గుర్తు కూడా పట్టలేనంత దారుణంగా కాలిపోయాయి! కొందరికి తల, మరికొందరికి కాళ్లు, చేతులు తెగి రోడ్డుపైన పడ్డాయి! ఈ ఘోరం కారణంగానే మరో దారుణమైన విషాదమూ చోటుచేసుకుంది! కూలుతూనే జనావాసాల్లో దిగిన విమానం అక్కడి మెడికల్ కాలేజీ హాస్టల్లోకి దూసుకెళ్లింది! మధ్యాహ్న భోజన విరామం కావడంతో అప్పుడే అక్కడ మెడికోలు, డాక్టర్లు, సిబ్బంది భోజనాలు చేస్తున్నారు! పేలిన విమానం, దాని శకలాలు హాస్టల్లోకి చొచ్చుకురావడంతో వారిలో దాదాపు 50 మంది వరకూ దుర్మరణం చెందారని దైనిక్ భాస్కర్ గుజరాతీ ఎడిషన్ దివ్య భాస్కర్ పేర్కొంది! ప్రమాదంలో పెద్దఎత్తున స్థానికులు గాయపడ్డారని తెలిపింది! ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ఇద్దరు మృత్యుంజయులుగా బయటపడడం నిజంగా అద్భుతమే! ప్రమాదం ఎందుకు.. ఎలా జరిగిందన్నది నిపుణులకూ అంతుచిక్కడం లేదు! ఇంజన్లు విఫలం కావడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నా.. దానిపైనా భిన్నాభిప్రాయాలే!!
భయానకం.. బీభత్సం!
ఆకాశమే కూలినంత శబ్దం.. భారీ విస్ఫోటనం.. కన్ను మూసి తెరిచే సరికి అంతా విధ్వంసం.. తెగిపడ్డ తలలు, ముక్కలైన శరీరాలు.. మాంసపు ముద్దలు.. 90 శాతానికి పైగా కాలిపోయిన మృతదేహాలు..
ఎటు చూసినా చిందరవందరగా పడి ఉన్న విమాన శకలాలు.. పేలుడు, అగ్నికీలల ధాటికి కమ్మేసిన పొగ.. మంటల్లో కాలి నల్లగా మసిబారిన భవనాలు.. కాలి బూడిదైన చెట్లు, వాహనాలు..!!
ఆ ప్రాంతాన్ని చూసిన వారెవరైనా సరే ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యేంత భయోత్పాతం. ఎయిరిండియా విమాన ప్రమాదం తర్వాత బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్, పరిసర ప్రాంతాల వద్ద పరిస్థితి ఇది.
ప్రమాదం అనంతరం అంబులెన్సు, ఫైరింజన్ల సైరన్ల మోతతో ఆ ప్రాంతంలో ఉద్విగ్న వాతావరణం నెలకొనగా.. సహాయక చర్యలు జరుగుతున్న కొద్దీ.. ఆ ప్రాంతాన్ని మృత్యుదేవత కబళించిందేమో అనేలా పరిణామాలు మారాయి.
విమానం కూలి పేలుడు సంభవించి అగ్నికీలలు ఎగసిపడుతుండగా.. ఆకాశాన్నే మింగేసే అంత నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. మెస్ భవనం పైకప్పు కూలిపోయి.. ఆ భవనం పూర్తిగా ధ్వంసమవ్వగా.. మెస్ వంట గదిలోని సామగ్రి, వస్తువులు కూడా బుగ్గి అయ్యాయి.
విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాద జరగ్గా.. విమానంలోని భారీగా ఉన్న ఇంధనం వల్ల పేలుడు తీవ్రత కూడా అధికంగా ఉంది. మెస్ భవనంతోపాటు చుట్టు పక్కల ఉన్న కొన్ని భవనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. మెస్ భవనం చుట్టుపక్కల నిలిపి ఉంచిన వాహనాలు, పరిసరాల్లోని చెట్లు కాలిపోయాయి.
అహ్మదాబాద్, జూన్12: గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం(ఏఐ-171) కూలిపోయిన ఘటనలో 290మంది దుర్మరణంపాలయ్యారు. టేకాఫ్ సమయంలో సీటు బెల్టులు పెట్టుకున్న ప్రయాణికుల మృతదేహాలు.. భారీ ప్రమాదంతో కాలిపోయి, చెల్లా చెదురుగా మృతదేహాలు పడిపోయాయి. కాలిపోయి, బిగుసుకుపోయిన స్థితిలో రోడ్డుపై మృతదేహాలు కనిపించాయి. కొందరి శరీరాలు పూర్తిగా అగ్నికి ఆహుతవ్వగా.. తల, కాళ్లు, చేతులు విడిపోయి కనిపించాయి. కడపటి వార్తలందేసరికి 50మృతదేహాలు మాత్రమే లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మిగతా వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయే ప్రమాదమున్నందున.. సంఘటనా స్థలి వద్ద నమూనాల సేకరణ జరిగే నిమిత్తం సైన్యంతో పహారా ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వారిలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు రమేశ్ విశ్వా్‌సకుమార్, మరో ప్రయాణికుడు మినహా.. మిగతా వారంతా చనిపోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 59 సెకన్లలోనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీ స్పష్టం చేస్తోంది. అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ జీఎస్ మాలిక్, కేంద్ర విమానయాన వర్గాల కథనం ప్రకారం.. ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.38కి టేకాఫ్ అయ్యింది. సెకన్ల వ్యవధిలోనే.. విమానం 825 అడుగులకు ఎగిరాక.. పైలట్ కెప్టెన్ సుమిత్ సభర్వాల్ ‘మేడే కాల్(సహాయాన్ని కోరడం)’ ఇచ్చారు.
దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) సిబ్బంది స్పందించేలోగా విమానం 625అడుగుల ఎత్తుకు పడిపోయింది. అప్పటి నుంచి పైలట్ల ద్వారా సంకేతాలు కట్ అయ్యాయి. టేకాఫ్ అయిన 59వ సెకనుకు.. విమానం ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలోని జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఓ వైద్య కళాశాల హాస్టల్ భవనంపై పడింది. భవనానికి ముందువైపు విమానం తోకభాగం, వెనకవైపు తలభాగం ఉండడాన్ని బట్టి, ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు విమానం ఓ చెట్టును ఢీకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ‘‘పెద్ద ఎత్తున వ్యాపించిన మంటల కారణంగా ఎవరినీ రక్షించలేకపోయాం’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. చూస్తుండగానే.. ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించాయని ప్రతక్ష్య సాక్షులు తెలిపారు. దట్టమైన పొగ ఐదారు కిలోమీటర్ల దూరం వరకు కనిపించిందని పేర్కొన్నారు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌కు ఇంధన సామర్థ్యం ఎక్కువ(1.25 లక్షల లీటర్లు)గా ఉంటుంది. ఫుల్ ట్యాంక్ కారణంగా భారీ పేలుడు సంభవించడమే కాకుండా.. మంటలు వేగంగా వ్యాపించాయి. రంగంలోకి దిగిన ఫైరింజన్లు గంటపాటు శ్రమించి, మంటలను ఆర్పివేసినా.. భారీ ప్రాణనష్టం చోటుచేసుకుంది. దుర్ఘటన జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది, పైలట్ కెప్టెన్ సుమిత్ సభర్వాల్, కోపైలట్/ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఉన్నారు. 169 మంది భారతీయులు, 53మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ పాస్‌పోర్టు హోల్డర్లు, ఒక కెనెడియన్ ఉన్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. మెడికల్ కాలేజీ విద్యార్థులకు సరిగ్గా 1-2గంటల మధ్య మధ్యాహ్న భోజన సమయం కావడంతో.. మెడికోలు హాస్టల్ పైఅంతస్తులోని మెస్‌లో భోజనం చేస్తున్నారు. అదే సమయంలో విమానం పడడంతో 50 మంది మృతిచెందినట్లు దైనిక్ భాస్కర్ గుజరాతీఎడిషన్ ‘దివ్య భాస్కర్’ పేర్కొంది. పదుల సంఖ్యలో గాయపడినట్లు రిపోర్ట్ చేసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అహ్మదాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా వడోదరలోని సయాజీ ఆస్పత్రి నుంచి 137 యూనిట్ల రక్త నిల్వలను తెప్పించినట్లు అధికారులు తెలిపారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఆరు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, రెండు బీఎ్‌సఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని చెప్పారు. ఈ ప్రమాదానికి బాధ్యులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
ఏఏఐబీ, డీజీసీఏ దర్యాప్తు
విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) రంగంలోకి దిగిందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఏఏఐబీ డీజీ, ఇతర అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై సమీక్ష నిర్వహించారు. అటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కూడా ప్రమాదంపై దర్యాప్తును ప్రారంభించింది. ప్రమాదానికి కారణాలింకా తెలియరాలేదని పేర్కొంది. కెప్టెన్ సుమిత్ సభర్వాల్‌కు 8,200గంటలు, కోపైలట్‌కు 1,100 గంటల మేర విమానాలను నడిపిన అనుభవం ఉందని వివరించింది. అహ్మదాబాద్ విమానాశ్రయంలోని రన్‌వే 23 నుంచి విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపట్లోనే విమానం కూలిపోయినట్లు వివరించింది. పైలట్ ‘మేడే కాల్’ ఇచ్చిన కాసేపటికే.. ఏటీసీ సిబ్బంది మార్గదర్శనం చేస్తుండగా సిగ్నల్స్ తెగిపోయాయని వెల్లడించింది. ఈ ప్రమాదంపై సమాచారం కోసం హాట్‌లైన్ నంబర్ 1800- 5691444నుఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రమాదం జరిగిన తర్వాత విమానాశ్రయంలో సేవలను నిలిపివేశామని, సాయంత్రం 4 గంటల సమయంలో పునరుద్ధరించినట్లు వెల్లడించింది. పౌరవిమానయాన సంస్థ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల కుటుంబ సభ్యులు 011-24610843, 9650391589, 9978405304, 070-23251900, 9974111327లకు ఫోన్ చేసి, వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.
దర్యాప్తునకు సహకరిస్తాం: అమెరికా
విమాన ప్రమాదంపై దర్యాప్తునకు భారత అధికారులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎ్‌ఫఏఏ) తెలిపింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీబోర్డు బృందాలు దర్యాప్తునకు సహకరిస్తాయని పేర్కొంది.
హుటాహుటిన అహ్మదాబాద్‌కు రామ్మోహన్ నాయుడు
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే విజయవాడలో ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ఆయన... దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన బయలుదేరి అహ్మదాబాద్ వెళ్లారు. ప్రమాదస్థలానికి చేరుకుని, అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు.
మొత్తం ప్రయాణికులు : 230
భారతీయులు : 169
బ్రిటిషర్లు : 53
పోర్చుగీసు పౌరులు : 7
కెనెడియన్లు : 1
విమాన సిబ్బంది : 12
పైలట్, కోపైలట్ : 2
సీనియర్ సిబ్బంది : 2
ఇతర క్రూ సభ్యులు : 8
పైలట్ అనుభవం : 8,200 గంటలు
కో పైలట్ అనుభవం : 1,100 గంటలు
ఆ గణేశుడే రక్షించాడు
ప్రమాదానికి గురైన విమానం ఎక్కలేకపోయిన ఓ మహిళ భావోద్వేగం
ట్రాఫిక్‌లో చిక్కుకుని విమానాశ్రయానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడమే ఓ మహిళకు వరమైంది. ఎయిరిండియా విమానాన్ని ఎక్కలేకపోవడంతో ఆమె ప్రాణాలతో మిగిలింది. ఇలా 10 నిమిషాల ఆలస్యం భూమి చౌహాన్ అనే మహిళ ప్రాణాన్ని నిలబెట్టింది. భర్తతో కలిసి లండన్‌లో నివాసముంటున్న భూమి చౌహాన్ రెండేళ్ల తర్వాత ఇటీవల స్వదేశానికి వచ్చారు. పనులు ముగించుకుని ఒంటరిగా లండన్ తిరుగుప్రయాణమైన ఆమె.. ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం ఎక్కాల్సింది. కానీ, విమానాశ్రయానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడంతో ఫ్లైట్ మిస్సయ్యారు. అయితే, ప్రమాద వార్త తెలిసిన వెంటనే తన నోట మాట రాలేదని భూమి చౌహాన్ విలేకరులతో అన్నారు. తాను పూజించే వినాయకుడే తనని రక్షించాడని ఆమె భావోద్వేగంగా చెప్పారు.
ప్రమాదానికి గురైన విమానం వివరాలు
ఫ్లైట్ నంబర్ : ఏఐ171/ఏఐసీ171
విమానయాన సంస్థ : ఎయిరిండియా
ఎయిర్‌క్రాఫ్ట్ పేరు : బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్
బయల్దేరిన స్థానం : అహ్మదాబాద్
గమ్యస్థానం : లండన్
ఎన్నిగంటల్లో చేరాలి : 9 గంటల 2 నిమిషాలు
గ్రౌండ్ స్పీడ్ : 174 కేటీఎస్
వెర్టికల్ స్పీడ్ : 896 ఎఫ్‌పీఎం
మృతదేహాల గుర్తింపునకు డీఎన్‌ఏ పరీక్షలు
మృతదేహాలతో అహ్మదాబాద్ ప్రభుత్వాస్పతి మార్చురీ నిండిపోయింది. ఓ వైపు బంధుమిత్రుల ఆర్తనాధాలు, మరోవైపు క్షతగాత్రుల హాహాకారాలతో ఆస్పత్రి ప్రాంగణంలో భయానక పరిస్థితులు కనిపించాయి. విమాన ప్రమాదంలో మృతిచెందిన 241 మందిని గుర్తించేందుకు సాయంత్రం 5 గంటల నుంచి ఆస్పత్రిలో డీఎన్‌ఏ పరీక్షలను ప్రారంభించారు. డీఎన్‌ఏ నమూనాలు ఇచ్చేందుకు మృతుల బంధుమిత్రులు బాధాతప్త హృదయాలతో క్యూలైన్‌లో నిలబడ్డ దృశ్యాలు అక్కడి వారిని కలిచివేశాయి. డీఎన్‌ఏ నమూనాల సేకరణకు సమయం పడుతుందని గుజరాత్ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ధనుంజయ్ ద్వివేది మీడియాకు తెలిపారు. మృతుల తల్లిదండ్రులు లేదా పిల్లలు లేదా సమీప రక్తసంబంధీకులు నమూనాలను ఇవ్వాలని కోరారు. చికిత్స పొందుతున్న మెడికోల పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
మృత్యుంజయుడు.. రమేశ్
ఘోర ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలోని ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వందల మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి తప్పించుకున్న రమేశ్ విశ్వా్‌సకుమార్(40) మృత్యుంజయుడిగా నిలిచాడు. విమానం నేలకూలిన వెంటనే బయటికొచ్చిన రమేశ్.. ప్రాణభయంతో ఘటనాస్థలి నుంచి దూరంగా వెళుతుండగా చుట్టుపక్కల వారు అతనిని వీడియో కూడా తీశారు. విమానంలో 11ఏ సీటులో కూర్చున్న రమేశ్.. బోర్డింగ్ పాస్ ఇంకా అతని వద్దే ఉంది. ‘‘విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లకు పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. కళ్లు తెరిచి చూసేసరికి నా చుట్టూ మృతదేహాలే ఉన్నాయి. వెంటనే పైకి లేచి పరుగెత్తా’’ అని రమేశ్ పేర్కొన్నారు. ప్రమాదంలో రమేశ్ కళ్లు, వీపు, కాళ్లు, చేతులకు గాయాలవ్వగా.. కొన్ని శరీర భాగాలకు కాలిన గాయాలయ్యాయి. కాగా, భవన నిర్మాణ కార్మికుడైన రమేశ్ భలియా... బ్రిటన్ పౌరుడు. 20 ఏళ్లుగా లండన్‌లోనే ఉంటున్న ఆయన కుటుంబసభ్యులను కలిసేందుకు ఇటీవల భారత్‌కు వచ్చిన రమేశ్, అతని సోదరుడు అజయ్‌కుమార్(45)తో కలిసి లండన్ తిరుగు ప్రయాణమయ్యారు. ప్రమాదం తర్వాత అజయ్ ఆచూకీ తెలియరాలేదు. కాగా, ఈ ప్రమాదం నుంచి మరో వ్యక్తి కూడా ప్రాణాలతో బయటపడినట్లు తెలిసింది. అయితే, ఆ వివరాలు తెలియాల్సి ఉంది.
అదే చివరి సిగ్నల్...!
ఫ్లైట్ రాడార్ నుంచి కీలక సమాచారం
ఎయిర్ ట్రాఫిక్‌ను రియల్‌టైమ్‌లో చూపించే లైవ్ ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్ రాడార్.. ఈ ప్రమాదానికి సంబంధించి కొంత కీలక డేటాను అందించింది. ‘టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత ఆ విమానం నుంచి మాకు చివరి సిగ్నల్ అందింది. బోయింగ్ 787-8 ప్రమాదంలో ఉన్నట్టు తెలిసింది’ అని ఫ్లైట్ రాడార్ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ప్రమాద సమయంలో విమానం భూమి నుంచి 625 అడుగుల ఎత్తులో ఉన్నట్టు ఫ్లైట్ రాడార్ డేటా సూచిస్తోంది. విమానం వెర్టికల్ స్పీడ్ 896 ఫీట్ పర్ మినిట్‌గా నమోదైంది.
అన్ని విభాగాలతో కలిసి నిరంతరం పనిచేస్తున్నాం
బాధిత కుటుంబాలకు సహకరిస్తున్నాం: అదానీ
అహ్మదాబాద్, జూన్ 12 : విమాన ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని అదానీగ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ నిర్విరామంగా పనిచేస్తున్నామని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ మద్దతుగా నిలుస్తున్నామని అదానీ ఎక్స్‌లో పేర్కొన్నారు. కాగా, అహ్మదాబాద్ విమానాశ్రయ నిర్వహణను అదానీ గ్రూపు చూస్తోంది. ప్రమాదం జరిగినందున ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..
లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా
For National News And Telugu News
Updated Date - Jun 13 , 2025 | 05:28 AM