Punjab Terror Plot: పంజాబ్‌లో ఉగ్రదాడి కుట్ర భగ్నం
ABN, Publish Date - May 07 , 2025 | 05:29 AM
పంజాబ్‌లో ఉగ్రదాడి కుట్రను భగ్నం చేశారు. పెద్ద సంఖ్యలో మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్న పంజాబ్ పోలీసులు
భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం
అమృత్‌సర్/ జమ్ము, మే 6: భారత్‌లో మరో ఉగ్రదాడి కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. నవాన్‌సహర్ జిల్లాలోని టిబ్బానంగల్-కులార్ రోడ్‌కు సమీపంలోని అటవీ ప్రాంతంలో గ్రనేడ్లతోపాటు ఐఈడీలు, వైర్‌లెస్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థలతోపాటు అమృత్‌సర్‌లోని రాష్ట్ర ప్రత్యేక ఆపరేషనల్ సెల్ (ఎస్‌ఎ్‌సఓడీ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ మందుగుండు సామగ్రి బయట పడింది. రెండు రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్లు, రెండు ఐఈడీలు, ఐదు పీ-86 హ్యాండ్ గ్రనేడ్లు, ఒక వైర్‌లెస్ కమ్యూనికేషన్ సెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు.
పంజాబ్‌లోని తమ స్లీపర్ సెల్స్ పునరుద్ధరణకు పాక్ నిఘా సంస్థ ఐఎ్‌సఐ, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థల సమన్వయంతో ఈ ఆయుధాలు సరఫరా చేసి ఉంటారని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీజీపీ తెలిపారు. మరోవైపు, జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో చొరబాటుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ పౌరుడి(20)ని సైనిక బలగాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి.
Updated Date - May 07 , 2025 | 05:29 AM