Tejashwi Yadav Accuses: డిప్యూటీ సీఎం 2 ఓటరు ఐడీలు కలిగి ఉన్నారన్న తేజస్వి యాదవ్.. క్లారిటీ
ABN, Publish Date - Aug 10 , 2025 | 01:34 PM
బీహార్ రాజకీయాల్లో మరో కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా రెండు ఓటరు ఐడీలు కలిగి ఉన్నారని తేజస్వి యాదవ్ ఆరోపించారు. దీనిపై విజయ్ సిన్హా తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.
బీహార్ (Bihar) రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఓటరు జాబితా సవరణ విషయంలో మరో కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్.. బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాపై (Vijay Sinha) సంచలన ఆరోపణలు చేశారు. విజయ్ సిన్హా రెండు ఓటరు ఐడీ కార్డులు (EPIC) కలిగి ఉన్నారని, ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని తేజస్వి ఆరోపించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటరు ఐడీ ఉండాలని ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెబుతోందనే విషయాన్ని గుర్తు చేశారు.
రెండు ఓటరు ఐడీలు, రెండు వయసులు
తేజస్వి యాదవ్ ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్‌లో దీని గురించి ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా రెండు ఓటరు ఐడీ కార్డులు కలిగి ఉన్నారని, అవి రెండు వేర్వేరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నాయని చెప్పారు. అంతేకాదు, ఈ రెండు కార్డుల్లో సిన్హా వయసు కూడా వేర్వేరుగా ఉందట.
బంకీపూర్ సెగ్మెంట్‌లో ఒక ఓటరు ఐడీలో సిన్హా వయసు 60 కాగా, లఖిసరాయ్‌లో మరో ఐడీలో 57 అని ఉందని తేజస్వి వెల్లడించారు. ఇది ఎలా సాధ్యం? సిన్హా రెండు ఐడీల కోసం సంతకం చేశారా? లేక ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియే మోసమా? అని తేజస్వి ప్రశ్నించారు.
రెండు జాబితాల్లో..
లఖిసరాయ్ అసెంబ్లీలో ఓటరు ఐడీ నంబర్ IAF3939337, బంకీపూర్‌లో AFS0853341. జనవరి ఓటరు జాబితాలో బంకీపూర్‌లో సిన్హా పేరు ఉంది. బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) లఖిసరాయ్‌కి వెళ్లినప్పుడు సంతకం చేశారు. బంకీపూర్‌కి వెళ్లినప్పుడు మళ్లీ సంతకం చేశారు. అందుకే రెండు జాబితాల్లో ఆయన పేరు ఉందని తేజస్వి వివరించారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ SIR ప్రక్రియలో మోసం జరుగుతోందా? లేక డిప్యూటీ సీఎం మోసం చేస్తున్నారా? ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తేజస్వి డిమాండ్ చేశారు.
సిన్హా కౌంటర్
విజయ్ సిన్హా వెంటనే తేజస్వి ఆరోపణలకు స్పందించారు. మా కుటుంబం గతంలో బంకీపూర్ అసెంబ్లీ ప్రాంతంలో ఉండేది. తన పేరును బంకీపూర్ ఓటరు జాబితా నుంచి తొలగించమని అప్లై చేసినట్లు చెప్పారు. తర్వాత లఖిసరాయ్ జాబితాలో పేరు చేర్చుకున్నట్లు వెల్లడించారు. రెండు జాబితాల్లో తన పేరు ఉన్న విషయం తెలిసిన వెంటనే, బంకీపూర్ నుంచి తొలగించమని అభ్యర్థించినట్లు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
తేజస్విని టార్గెట్ చేస్తూ, సిన్హా బీజేపీ స్టైల్‌లో జంగిల్ రాజ్ అని విమర్శించారు. మేము అలాంటి మోసాలు చేయమని, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సరైన సమాచారం లేకుండా రాజకీయాలను కించపరుస్తున్నారని సిన్హా ఎద్దేవా చేశారు. బీహార్‌లో ఎన్నికల ముందు ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ఆర్జేడీ, కాంగ్రెస్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ ప్రక్రియ వల్ల భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించబడతాయని ఆరోపిస్తున్నాయి. అయితే, ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.
ఇవి కూడా చదవండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 10 , 2025 | 01:39 PM