Moratorium vs EMI: ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? లేక మారటోరియం తీసుకోవాలా? ఏది బెటర్
ABN , Publish Date - Aug 07 , 2025 | 08:37 PM
మీ జాబ్ అనుకోకుండా పోయిందా? లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా. ఇలాంటి సమయంలో లోన్ EMIలు కట్టడం గురించి ఆలోచిస్తున్నారా. ఇలాంటి సమయంలో బ్యాంకులు అందించే లోన్ మారటోరియం గురించి వినే ఉంటారు. ఇది ఏంటి, ఎలా పనిచేస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఊహించని విధంగా ఉద్యోగం పోతే, ఆర్థికంగా కుదుటపడటం చాలా కష్టం. ప్రతి నెలా చెల్లించే లోన్ EMIలు ఈ సమయంలో చాలా పెద్ద భారం అవుతాయి. అలాంటి సమయంలో మారటోరియం అనే ఆప్షన్ మనకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ దీన్ని తీసుకోవాలా లేదా అనేది చాలా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం.
మారటోరియం అంటే ఏంటి?
మారటోరియం అనేది బ్యాంకులు లేదా NBFCలు ఇచ్చే ఒక తాత్కాలిక రిలీఫ్. ఇది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారికి మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు ఉద్యోగం కోల్పోవడం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మొదలైన సందర్భాలలో ఉపయోగపడుతుంది. అయితే ఇది లోన్ మాఫీ మాత్రం కాదు. కేవలం చెల్లింపుల్ని కొంతకాలం పాటు వాయిదా వేయడం మాత్రమే. ఈ సమయంలో మీరు EMIలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ బ్యాంక్ మీపై వడ్డీ మాత్రం వేస్తుంది. అంటే మీరు చెల్లించాల్సిన మొత్తము పెరిగే అవకాశం ఉంది.
మారటోరియం ఎలా అడగాలి?
దీని కోసం మీరు లోన్ తీసుకున్న బ్యాంకును సంప్రదించండి. మీ ప్రస్తుత పరిస్థితిని ఓపికగా వివరించండి. ఉద్యోగం పోయిందని లేదా ఆసుపత్రి ఖర్చులు ఎక్కువయ్యాయని వివరించండి. డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఉద్యోగం పోయినట్లయితే టర్మినేషన్ లెటర్, లేకుంటే తగిన ఇతర డాక్యుమెంట్స్ సమర్పించాలి. వివరాలు స్పష్టంగా అడగాలి. వడ్డీ ఎలా వేస్తారు? ఎంతకాలం మారటోరియం ఉంటుంది? EMIలు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయనే విషయాలు తెలుసుకోవాలి.
మారటోరియం తీసుకోవడంలో లాభాలు
తాత్కాలికంగా ఆర్థిక భారం తగ్గుతుంది
మీరు ఈ కాలంలో డిఫాల్టర్‌గా పరిగణించబడరు
ఎటువంటి పెనాల్టీలు ఉండవు
లోపాలు ఏంటి
వడ్డీ కొనసాగుతుంది, అంటే మొత్తం చెల్లించాల్సిన డబ్బు పెరుగుతుంది.
కొన్ని సందర్భాల్లో మీ క్రెడిట్ కార్డ్ యూజ్ కూడా పరిమితం కావచ్చు
లోన్ టెన్యూర్ పెరగవచ్చు లేదా తర్వాతి EMIలు ఎక్కువ కావచ్చు
మారటోరియం ఎంచుకోవాలా?
ఒకవేళ మీ ఆదాయం తగ్గిపోవడం లేదా వ్యాపారం మూతపడటం వంటి పరిస్థితుల్లో మారటోరియం తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ, మీరు EMIలు కొనసాగించగలిగే స్థితిలో ఉంటే, చెల్లించుకోవడం మంచిది. ఎందుకంటే, మారటోరియం తీసుకుంటే తర్వాత వడ్డీ భారం ఎక్కువవుతుంది. కానీ హోమ్ లోన్ తీసుకుని ఇంకా మొదటి దశలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సమయంలో EMIలు ఎక్కువగా వడ్డీ భాగాన్ని కవర్ చేస్తాయి. మారటోరియం తీసుకుంటే, మీ మొత్తం వడ్డీ ఖర్చు భారీగా పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి