Supreme Court: పరిగణనలోకి ఆధార్ కూడా..
ABN, Publish Date - Jul 11 , 2025 | 05:08 AM
ఎన్నికల కమిషన్ బిహార్‌లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు సైతం
బిహార్‌లో ఈసీ చేపట్టిన ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ
ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని ధర్మాసనం స్పష్టీకరణ
నిలిపివేతకు నో.. తదుపరి విచారణ 28న
సుప్రీం తీర్పుతో ప్రజాస్వామ్యానికి ఊరట: కాంగ్రెస్
న్యూఢిల్లీ, జూలై 10: ఎన్నికల కమిషన్ బిహార్‌లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిలిపివేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని 324 అధికరణ ప్రకారం, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 ప్రకారం చేపట్టిన ఈ ప్రక్రియ రాజ్యాంగబద్ధమైనదేనని స్పష్టం చేసింది. అయితే.. శాసనసభ ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియను నిర్వహించడం ఏమిటని ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించింది. ఓటర్లు తమ గుర్తింపును ధ్రువీకరించుకోవడానికి అనుమతించే పత్రాల జాబితాలో.. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులను గుర్తింపు పత్రాలుగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ ప్రక్రియపై పలు పార్టీలు, ఎన్జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అలా దాఖలైన పదికి పైగా పిటిషన్లను.. జస్టిస్ సుధాన్షు ధూలియా, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధర్మానం విచారించచింది. ఎన్నికల కమిషన్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది.. ఆధార్‌ను పౌరసత్వ గుర్తింపు పత్రంగా అంగీకరించలేమని కోర్టుకు తెలిపారు. దీనికి కోర్టు.. పౌరసత్వాన్ని ధ్రువీకరించాల్సింది హోం శాఖ అని, అది ఈసీ పని కాదని గుర్తుచేసింది. గుర్తింపు ప్రక్రియకు ఈసీఐ అనుమతిస్తున్న 11 పత్రాల జాబితా సమగ్రమైనదేమీ కాదని.. కనుక, ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులను కూడా పరిగణనలోకి తీసుకుంటే అందరికీ న్యాయం జరుగుతుందన్నది తమ అభిప్రాయమని పేర్కొంది. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈసీదేనని.. ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కారణాలు మాత్రం వెల్లడించాలని ఆదేశించింది. ‘‘మీరు ఈ ప్రక్రియను చేపట్టడం సమస్య కాదు. కానీ.. చేపట్టిన సమయమే సమస్య. నవంబరులో జరిగే శాసనసభ ఎన్నికలకు దీనికి ముడిపెట్టడమెందుకు? ఎన్నికలతో సంబంధం లేకుండా దీన్నెందుకు నిర్వహించలేరు? కొంచెం ముందే దీన్ని ఎందుకు నిర్వహించలేదు?’’ అని విచారణ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. ఓటర్ల జాబితా ఒక్కసారి ఖరారైతే కోర్టులు అందులో జోక్యం చేసుకోవని.. ఇదంతా ఎన్నికలకు ముందు జరగడం వల్ల.. నష్టపోయిన వ్యక్తులు సవరించిన జాబితాను కోర్టులో సవాల్ చేసే అవకాశాన్ని కోల్పోతారని పేర్కొంది. ఇక.. పిటిషనర్లలో ఒకరైన అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణన్ వాదనలు వినిపించారు.
ప్రజాప్రాతినిధ్య చట్టంలో సమగ్ర సవరణ, సంక్షిప్త సవరణ గురించి మాత్రమే ఉందని.. ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ గురించి అందులో ఎక్కడా లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఓటరు జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపారు. మరీ ముఖ్యంగా 2003 తర్వాత ఓటరుగా నమోదు చేసుకున్నవారంతా తమ గుర్తింపును ధ్రువీకరించుకోవాలంటూ కటాఫ్ తేదీని పేర్కొనడం అన్యాయమన్నారు. పిటిషనర్ల తరఫున వాదన వినిపించిన మరో న్యాయవాది అభిషేక్ సింఘ్వి.. ఇది ఓటరు జాబితా స్ర్కీనింగ్‌లా కాక, పౌరసత్వ స్ర్కీనింగ్ ప్రక్రియలాగా ఉందని వ్యాఖ్యానించారు. అందరి వాదనలూ విన్న ధర్మాసనం.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3) పక్రారం ఈసీకి ఆ అధికారం ఉందని పేర్కొంది. ఈసీని అనుమానించడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. అయితే, దీనిపై విచారణ జరగాల్సి ఉందని పేర్కొంది. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై జూలై 21లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీకి సూచించి.. తదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేసింది. ఆలోగా ముసాయిదా జాబితాను ఈసీ ప్రచురించదని పిటిషనర్లకు తెలిపింది.
విపక్షాలకు చెంపపెట్టు: బీజేపీ
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో గుర్తింపు ధ్రువీకరణకు.. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులను పరిగణనలోకి తీసుకోవాలంటూ సుప్రీం ద్విసభ్య ధర్మాసనం చేసిన సూచన ప్రజాస్వామ్యానికి ఊపశమనాన్నిచ్చిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఈసీ ఆ సూచనను పరిగణనలోకి తీసు కుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించడం, ఆ ప్రక్రియను కొనసాగించడానికి అనుమతించడం ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. ఓటర్లను తొలగించేస్తున్నారంటూ ఏడ్చేకన్నా.. ఓటర్ల మనసును చూరగొనే ప్రయత్నం చేయాలని విపక్షాలకు ఆయన సూచించారు.
Updated Date - Jul 11 , 2025 | 06:00 AM