ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: మా పరిధి చాలా పెద్దది

ABN, Publish Date - May 06 , 2025 | 04:26 AM

సుప్రీంకోర్టుపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబేపై ధిక్కార చర్యలకు నిరాకరిస్తూ, పరిమిత ఆదేశాలు మాత్రమే జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు పరిధి ఎంతో విశాలమని, ఈ వ్యవహారాన్ని అంతగా ఆమోదించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది

  • సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య.. బీజేపీ ఎంపీ దూబేపై ‘ధిక్కార’ విచారణకు నో

  • అయితే పరిమిత ఆదేశాలిస్తామని స్పష్టం

న్యూఢిల్లీ, మే 5: సుప్రీంకోర్టుపైన, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాపైన తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబేపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలన్న పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే తమ పరిధి చాలా విస్తృతమైనదని జస్టిస్‌ ఖన్నా సోమవారం స్పష్టంచేశారు. ‘అయితే దీనిపై పరిమిత ఆదేశాలు జారీచేస్తాం. అందులో కారణాలను రికార్డు చేస్తాం. మా అభిప్రాయాలను వ్యక్తీకరిస్తాం. ధిక్కార పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం లేదు’ అని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు విధించడంపై దూబే తీవ్ర స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. జస్టిస్‌ ఖన్నాపైనా ఆరోపణలు చేశారు. ఆయన న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడారని.. కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది విశాల్‌ తివారీ సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇది సోమవారం జస్టిస్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. తివారీ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని 129వ అధికరణ ప్రకారం దూబేపై ధిక్కార చర్యలు ప్రారంభించాలని కోరారు.


అత్యున్నత న్యాయస్థాన గౌరవాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉందని, ఇలా వదిలేయడానికి వీల్లేదని.. గతంలో (1991లో) ఢిల్లీ జ్యుడీషియల్‌ సర్వీసుల కేసులో ధిక్కార చర్యల వినతిని కోర్టు పరిగణనలోకి తీసుకుందని గుర్తుచేశారు (ఆ తీర్పులో.. సుప్రీంకోర్టు పరిధి, అధికారం పరిమితమైనవి కావని.. కోర్టు తన పరిధిని తాను నిర్ణయించగలదని.. అదే ఫైనల్‌ అని జస్టిస్‌ కేఎన్‌ సింగ్‌, జస్టిస్‌ కుల్‌దీప్‌సింగ్‌, జస్టిస్‌ ఎన్‌ఎం కస్లీవాల్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది). దీనిపై సీజేఐ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. పెండింగ్‌ బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవలసిందేనంటూ సుప్రీంకోర్టు ఇటీవల చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వక్ఫ్‌ సవరణ చట్టంలోని కొన్ని అంశాలపై జస్టిస్‌ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిని ఝార్ఖండ్‌లోని గొడ్డా లోక్‌సభ సభ్యుడు దూబే, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తప్పుబట్టారు. ‘‘భారత ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. మిమ్మల్ని నియమించే అథారిటీకి మీరెలా ఆదేశాలిస్తారు? ఈ దేశంలో చట్టాలు చేసేది పార్లమెంటు. పార్లమెంటును మీరెలా శాసించగలరు? 3 నెలల్లో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని ఏ చట్టం చెబుతోంది. దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలని మీరు (కోర్టు) భావిస్తున్నారా? దేశంలో మతయుద్ధాలకు సుప్రీంకోర్టే కారణం. తన పరిధులు దాటి వ్యవహరిస్తోంది.


ప్రతిదానికీ సుప్రీంకోర్టుకే వెళ్లేటట్లయితే ఇక పార్లమెంటును, అసెంబ్లీని మూసివేయాలి’ అని దూబే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు కోర్టు పరువుకు నష్టం కలిగించేవిగా.. రెచ్చగొట్టేవిగా.. విద్వేషపూరితంగా ఉన్నాయని, ఆయనపై ధిక్కార చర్యలు తీసుకోవలసిందేనని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ కూడా కోరింది. ఈ దాడి ఓ సంస్థగా సుప్రీంకోర్టుపైనే గాక.. వ్యక్తిగా సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాపై కూడా అని.. ఇది ఆమోదయోగ్యం కాదని.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తీర్మానం కూడా ఆమోదించింది. ఆయనపై ధిక్కార చర్యలకు అనుమతివ్వాలని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణికి సైతం ఓ లాయర్‌ లేఖ రాశారు. దూబే వ్యాఖ్యలు వ్యక్తిగతమని బీజేపీ కూడా పేర్కొంది. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత.. పిటిషనర్‌ తివారీని దూబే తాజాగా టార్గెట్‌ చేశారు. ఆయన ఆశలన్నీ కన్నీటిలో కొట్టుకుపోయాయంటూ ఓ హిందీ గీతాన్ని ‘ఎక్స్‌’లో ఉటంకించారు.


Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..

Updated Date - May 06 , 2025 | 04:26 AM