Supreme Court: పౌరసత్వానికి ఆధార్‌ను పరిగణనలో తీసుకోలేం.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Aug 12 , 2025 | 05:06 PM
ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టే అధికారం ఈసీఐకి ఉందా అనే ప్రాథమిక అంశాన్ని నిర్ణయించాల్సి ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. అలాంటి అధికారం లేనట్టయితే ఈ అంశం ఇక్కడితో ముగుస్తుందని, ఆ అధికారం ఈసీఐకి ఉన్నట్లయితే ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియపై ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు.
న్యూఢిల్లీ: ఆధార్ సేవలను కీలకమైన గుర్తింపు డాక్యుమెంట్‌గానే పరిగణనలోకి తీసుకుంటున్నామని, భారతదేశ పౌరసత్వానికి అది కచ్చితమైన ప్రూఫ్ కాదని, సరైన వెరిఫికేషన్ తప్పనిసరని ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న వైఖరిని సుప్రీంకోర్టు (Supreme Court) సమర్ధించింది. బిహార్ ప్రత్యేక సమగ్ర సవరణ (Bihar Special Intensive Revision)కు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది. ఆధార్‌ను కంక్లూజివ్ ప్రూఫ్‌గా ఆమోదించలేమని ఎన్నికల కమిషన్ చెప్పడం సరైనదేనని జస్టిస్ సూర్య కాంత్ అన్నారు.
ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టే అధికారం ఈసీఐకి ఉందా అనే ప్రాథమిక అంశాన్ని నిర్ణయించాల్సి ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. అలాంటి అధికారం లేనట్టయితే ఈ అంశం ఇక్కడితో ముగుస్తుందని, ఆ అధికారం ఈసీఐకి ఉన్నట్లయితే ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియపై ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ తన వాదన వినిపిస్తూ, 1950 తర్వాత పుట్టిన ప్రతివ్యక్తి భారతదేశ పౌరుడేనని, అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎక్సర్‌సైజ్‌లో విధానపరమైన తీవ్ర తప్పిదాలున్నాయని అన్నారు. ఉదాహరణగా ఒక చిన్న అసెంబ్లీ నియోజకవర్గంలో నివసిస్తున్న 12 మందిని చనిపోయినట్టు పేర్కొన్నారని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించ లేదని అన్నారు. పోల్ ప్యానల్ సరైన విధానాన్ని అనుసరించకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ఓటర్ల తొలగింపు జరిగిందని, ముఖ్యంగా అవసరమైన దరఖాస్తులు సమర్పించలేక పోయిన వారిపై ఈ ప్రభావం ఉంటుందని అన్నారు. 2003 ఓటర్ల జాబితాలో పేరున్న వారిని కూడా కొత్తగా ఫామ్‌లు సమర్పించమనడం, అలా చేయని పక్షంలో రెసిడెన్స్‌లో ఎలాంటి మార్పు లేనప్పటికీ వారిని తొలగించడం జరుగుతుందన్నారు. ఈసీఐ ప్రకటించిన గణాంకాల ప్రకారం 7.24 కోట్ల మంది అవసరమైన ఫామ్స్ దాఖలు చేశారని, అయినా 65 లక్షల మంది ఓటర్ల పేర్లు సరైన వెరిఫికేషన్ లేకుండా తొలగించారని అన్నారు. పేర్ల తొలగింపును బలపరచే ఎలాంటి సర్వే నిర్వహించ లేదని అఫిడవిట్‌లో ఎన్నికల కమిషన్ అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటువంటి ప్రక్రియలో కొన్ని లోపాలు ఉంటాయని ఈసీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదించారు. చనిపోయిన వ్యక్తులను బతికి ఉన్నట్టు, సజీవంగా ఉన్నవారిని చనిపోయినట్టు ప్రకటించడం వంటి తప్పదాలని సరిదిద్ద వచ్చన్నారు. ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలోనే వాస్తవాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.
ఇవి కూడా చదవండి..
జస్టిస్ వర్మ నోట్ల కట్టల ఉదంతం కీలక మలుపు.. అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన లోక్‌సభ స్పీకర్
తిక్క రేగిందంటే బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపిస్తాం.. బిలావల్‌కు మిథున్ చక్రవర్తి వార్నింగ్
For More National News and Telugu News
Updated Date - Aug 12 , 2025 | 05:38 PM