Justice Varma: జస్టిస్ వర్మ నోట్ల కట్టల ఉదంతం కీలక మలుపు.. అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన లోక్‌సభ స్పీకర్
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:16 PM
ఇంట్లో నోట్ల కట్టలు లభించిన వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ స్వీకరించారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో నోట్ల కట్టలు లభించిన ఘటనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆయన అభిశంసన కోసం లోక్‌సభ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. ఈ ఉదంతంపై విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్యానెల్‌లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు జస్టిస్ ఎమ్ఎమ్ శ్రీవాత్సవ, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్యులు సభ్యులుగా ఉన్నారు.
అభిశంసన తీర్మానంపై ప్రతిపక్ష, పాలక పక్షానికి చెందిన 146 మంది సంతకం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ అభిశంసన ప్రక్రియ ప్రారంభం కావాల్సిందేనని అన్నారు. అవినీతికి పార్లమెంటు పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని అన్నారు.
ఇక స్పీకర్ ఏర్పాటు చేసిన కమిటీ ఈ ఉదంతానికి సంబంధించిన సాక్షులు ప్రశ్నించి, ఆధారాలను పరిశీలిస్తుంది. విచారణ అనంతరం, తుది నివేదికను స్పీకర్‌కు సమర్పిస్తుంది. అనంతరం నివేదికను సభ ముందు ఉంచుతారు. ఈ ఉదంతంలో న్యాయమూర్తి దోషిగా తేలిన పక్షంలో ఆయన అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. రాజ్యసభలో కూడా ఇదే ప్రక్రియను అమలు చేస్తారు. ఉభయ సభలు ఆమోదించిన తీర్మానానికి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు.
ఇవి కూడా చదవండి
గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి
రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..
For More National News and Telugu News