Rains: నైరుతీ రుతుపవనాల ప్రభావం.. దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు
ABN, Publish Date - May 26 , 2025 | 02:07 PM
దేశ వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. 16ఏళ్ల తర్వాత ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటం, ఈదురుగాలు తోడవడంతో అనేక రాష్ట్రాల్లో బీభత్సకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంటర్నెట్‌డెస్క్: దేశ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. 16ఏళ్ల తర్వాత ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటంతో దాదాపు దేశమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా అనేక రాష్ట్రాల్లో బీభత్సకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కేరళ వర్షాలకు తడిసిముద్దైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేరళలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అటు, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు ఊటీలో చెట్టుపడి బాలుడి మృతి చెందగా, కర్ణాటకలో బెళగావి జిల్లాలో గోడకూలి నిద్రలోనే మూడేళ్ల బాలిక ప్రాణాలొదిలింది. మహారాష్ట్రలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. ముంబయిలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సబర్బన్ రైలు సర్వీసులు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదార్, మహిమ్, పరెల్, బాంద్రా, కాలాచౌకీతో పాటు మరిన్ని ప్రాంతాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపిలేకుండా కురిసిన వానతో నగరంలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. దిల్లీ కంటోన్మెంట్, ధౌలా కువాన్, సుబ్రోతో పార్క్, నానక్ పురాలు పూర్తిగా నీట మునిగాయి. ఉత్తరప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మావోయిస్టు మృత దేహాల తరలింపులో అడ్డంకులు...
జమ్మలమడుగు శివారెడ్డి కాలనీలో దారుణం
For More AP News and Telugu News
Updated Date - May 26 , 2025 | 02:09 PM