Rahul Gandhi Accuses EC of Voter Fraud: ఓట్ల చోరీపై..సినిమా ఇంకా ఉంది
ABN, Publish Date - Aug 13 , 2025 | 03:06 AM
న్నికల కమిషన్ ఈసీపై ఓట్ల చోరీ ఆరోపణలను కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరింత తీవ్రతరం చేశారు...
ఒక వ్యక్తికి ఒక ఓటు’ విధానం రాజ్యాంగానికి మూలస్తంభం
ఈసీ అమలు చేయడం లేదు
అందుకే మేం రాజ్యాంగ రక్షణకు పోరాడుతున్నాం: రాహుల్ గాంధీ
లోక్‌సభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: అభిషేక్ బెనర్జీ
న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఎన్నికల కమిషన్ (ఈసీ)పై ఓట్ల చోరీ ఆరోపణలను కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరింత తీవ్రతరం చేశారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు’ అనేది రాజ్యాంగానికి మూల స్తంభమని.. ఈ వ్యవహారంలో ఈసీ తన విధి నిర్వర్తించడం లేదని ధ్వజమెత్తారు. సోమవారం ఈసీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్రగా బయల్దేరిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సినిమా ఇంకా ఉంది (పిక్చర్ అభీ బాకీ హై)’ అని హెచ్చరించారు. కేవలం ఒక్క నియోజకవర్గంలోనే ఓట్ల చోరీ జరుగలేదని.. చాలా ఓట్ల ఇలా జరిగిందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో ఓ పద్ధతి ప్రకారం చేశారని.. ఇది ఈసీతో పాటు తమకూ తెలుసని చెప్పారు. ‘గతంలో ఇందుకు ఆధారాల్లేవు. ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఒకే ఓటు అనేది రాజ్యాంగ మూలస్తంభం. దానిని అమలుచేయాల్సిన ఈసీ ఆ పనిచేయడం లేదు. అందుచేత మేం రాజ్యాంగ రక్షణకు పూనుకున్నాం. దీనిని కొనసాగిస్తాం’ అని స్పష్టంచేశారు. బిహార్ ఓటర్ల జాబితాలో మింతా దేవి అనే మహిళ వయసును 124 ఏళ్లుగా ఈసీ పేర్కొనటమే గాక, ఆమె తొలిసారి ఓటుహక్కు పొందినట్లుగా చెప్పడాన్ని ప్రస్తావించారు. ఇలాంటి తప్పుడు కేసులు అనేకం ఉన్నాయన్నారు. అంతకుముందు.. బిహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణపై పార్లమెంటులో చర్చించాలంటూ ఇండీ కూటమి ఎంపీలు పార్లమెంటు భవన సముదాయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. వారంతా మింతాదేవి ఫొటో, పేరు ముద్రించిన టీ షర్టులు ధరించారు. ఈ నిరసనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రాతో పాటు డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), టీఆర్ బాలు (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్‌సీపీ-ఎ్‌సపీ). వామపక్షాల ఎంపీలు పాల్గొన్నారు. రాజీవ్‌కుమార్, జ్ఞానేశ్‌కుమార్ సారథ్యంలో ఈసీ బీజపీ విభాగంగా మారిపోయిందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు.
కుట్రపన్నడమే బీజేపీ నైజం: అఖిలేశ్
ఎన్నికల అక్రమాలకు కుట్రలు పన్నడమే బీజేపీ చేసే అతిపెద్ద పని అని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికలను ప్రభావితం చేయడానికే బిహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్) చేపట్టారని అన్నారు. ఏడాది కిందట చేపట్టాల్సిన ఈ సవరణ ప్రక్రియను.. ప్రతిపక్షాల ఓట్లను తొలగించడానికి ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు చేపట్టారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ తనకున్న రాజ్యాంగ ప్రతిపత్తిని దుర్వినియోగం చేస్తోందని ఆర్‌జేడీ నేత, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఓటర్ల ప్రత్యేక సవరణను ఆయన మంగళవారం పట్నాలో తప్పుబట్టారు.
లోక్‌సభను రద్దు చేయాలి: అభిషేక్
ఓటర్ల జాబితాల్లో అవకతవకలు ఉన్నాయని ఈసీ భావిస్తే.. మొదట ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గం రాజీనామా చేయాలని టీఎంసీ లోక్‌సభాపక్ష నేత అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేశారు. లోక్‌సభను రద్దుచేయాలన్నారు. ఎంపిక చేసిన రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా ‘సర్’ చేపట్టాలని స్పష్టంచేశారు. బిహార్, బెంగాల్లో ఓటర్ల హక్కులను అణచివేసేందుకే తాజాగా సవరణ చేపట్టారని కోల్‌కతాలో ఆరోపించారు. గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్, తమిళనాడుల్లో ఎందుకు చేపట్టలేదని నిలదీశారు.
రేపు కాగడా ర్యాలీ
‘ఓటు చౌర్యం’పై కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14న దేశవ్యాప్తంగా ‘లోక్ తంత్ర బచావో’ పేరుతో కాగడ ర్యాలీలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ అంశంపై మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్, భన్వర్ జితేంద్ర సింగ్, గులాం అహ్మద్ మిర్, అజయ్ మాకెన్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఎన్‌ఎ్‌సయూఐ నేత కన్హయ్యకుమార్ ఇండీ కూటమి భవిష్యత్ కార్యాచరణ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 14న ‘లోక్ తంత్ర బచావో మశాల్ మార్చ్’, 22 నుంచి సెప్టెంబరు 7 వరకు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ‘ఓటు దొంగలు.. అధికారపీఠాన్ని వదిలేయండి’ నినాదంతో ర్యాలీలు, సెప్టెంబరు 15 నుంచి నెలరోజుల పాటు ఓటుహక్కు రక్షణ కోసం సంతకాల సేకరణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ పోరాటంలో ఇండీ కూటమి సమష్టిగా పనిచేస్తుందని చెప్పారు. అంతకు ముందు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ కర్ణాటకలోని మహాదేవపుర నియోజకవర్గం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఓట్ల చౌర్యంతో కాంగ్రెస్ 48 లోక్‌సభ స్థానాలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి
రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..
For More National News and Telugu News
Updated Date - Aug 13 , 2025 | 03:06 AM