PM Modi: పాక్‌కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
ABN, Publish Date - May 30 , 2025 | 02:57 PM
పాకిస్థాన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ శక్తి ఎలాంటిదో ఆ దేశానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదంపై పోరును భారత్ ఇంకా ఆపలేదని తెలిపారు.
పట్నా, మే 30: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తామని బిహార్ పర్యటన సందర్భంగా గతంలో తానిచ్చిన హామీ నేరవేర్చానని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతిదాడి చేసి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బిహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఆయన కరకట్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. శ్రీరాముడు ఒక్కసారి మాట ఇచ్చారంటే.. దానికి కట్టుబడి ఉంటారన్నారు. అదే విధానాన్ని తామూ అనుసరిస్తున్నట్లు తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడి జరిగిన రెండో రోజు అంటే మే 24వ తేదీన బిహార్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేస్తామంటూ బిహార్‌లోని మధుబన్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రకటించారు. నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ వాగ్దానం చేసిన 35 రోజులకు మళ్లీ తాను బిహార్‌కు వచ్చానని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
భారత్ మహిళల సిందూరం శక్తి ఎలా ఉంటుందో పాకిస్థాన్ చూసిందని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ తమకు రక్షణగా ఉందని ఉగ్రవాదులు భావిస్తున్నారని, వారికి సైతం భారత్ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించామని ఎద్దేవా చేశారు. అంతేకాదు.. పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇది నయా భారత్ శక్తి అంటూ ఆయన అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌కు భారత్ శక్తి బాగా అర్థమైందన్నారు. అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ జరుపుతున్న పోరు ఆగలేదని స్పష్టం చేశారు. మరోసారి ఈ తరహా దాడి జరిగితే మాత్రం పాము తలను నాశనం చేస్తామని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ను ప్రధాని మోదీ పరోక్షంగా హెచ్చరించారు.
మరికొన్ని నెలల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వరుసగా మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఎన్డీయే కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 80 స్థానాలను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇవే ఎన్నికల్లో జేడీయూ 45 స్థానాలకు కైవసం చేసుకుంది. మిత్ర ధర్మంలో భాగంగా సీఎం పదవి నితీశ్ కుమార్ చేపట్టారు. అదీకాక.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 29 స్థానాలను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు గెలుచుకున్న విషయం విదితమే.
ఇవి కూడా చదవండి
రూ. 500 నోట్ల కట్టలు కిటికీలో నుంచి విసిరేసినా .. దొరికిపోయాడు
బాత్‌రూమ్‌లో నీళ్లు లేవు.. మండిపడ్డ నటి
For National News And Telugu News
Updated Date - May 30 , 2025 | 04:55 PM