Omar Abdullah: కశ్మీర్‌ను పాక్ మరోసారి అంతర్జాతీయ అంశంగా మార్చింది: సీఎం ఒమర్ అబ్దుల్లా
ABN, Publish Date - May 11 , 2025 | 11:30 PM
కొన్నేళ్లుగా సాధించిన ఆర్థిక, దౌత్య పురోగతి మొత్తం పహల్గాం దాడితో కనుమరుగైందని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థికంగా, దౌత్యపరంగా కొన్నేళ్లుగా సాధించిన పురోగతి మొత్తం పహల్గాం దాడితో కనుమరుగైందని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. చాలా కాలం తరువాత కోలుకున్న రాష్ట్ర పర్యాటక రంగం మళ్లీ కుదేలైపోయిందని అన్నారు. చివరకు కాశ్మీర్ అంశాన్ని పాక్ అంతర్జాతీయ విషయంగా మార్చేసిందని విచారం వ్యక్తం చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈ సమయంలో కశ్మీర్ టూరిస్టులతో నిండిపోయి ఉండేది. ఆదాయం సమకూరేది. ఈ సమయంలో పిల్లలు స్కూల్లకు వెళ్లి వస్తుండేవారు. రోజుకు 50 నుంచి 60 విమానాలు రాకపోకలు సాగిస్తుండేవి’’ అని అన్నారు. ప్రస్తుతం అంతా నిర్మానుష్యంగా మారిందని, స్కూల్లు మూతబడ్డాయని, ఎయిర్‌పోర్టులు, గగనతలాన్ని మూసివేశారని విచారం వ్యక్తం చేశారు.
‘‘ఒక రకంగా చూస్తే పరిస్థితిలో ఏ మార్పు లేదు. పాకిస్థాన్ మరోసారి కావాలనే కశ్మీర్‌ను అంతర్జాతీయ అంశంగా మార్చేసింది. మధ్యవర్తిత్వం నెరపేందుకు అమెరికా ఆసక్తి ప్రదర్శించింది’’ అని అన్నారు. ఎన్ని సంక్లిష్టతలు ఉన్నా సీజ్ ఫైర్ ఇంతకాలం కొనసాగిందని, మళ్లీ పరిస్థితులు మొదటికి వచ్చాయని అన్నారు. ఒకరకంగా చూస్తే పరిస్థితిలో ఏమార్పు రాలేదని భావించాల్సి వస్తోందని అన్నారు. ‘‘మూడు వారాల క్రితం వరకూ ఈ ప్రాంతం పర్యాటకులతో కళకళలాడింది. ఆ తరువాత ఈ దారుణ మానవ హననం జరిగింది’’ అని ఆయన విచారం ఆవేదన వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 22న పహల్గాం దాడి జరగడంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అగ్గిమీద గుగ్గిలమైన భారత్ పాక్‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసుకున్నా పాక్ మాత్రం సామాన్య భారత పౌరులను బలితీసుకుంది. దీంతో, భారత్ పాక్ వైమానిక స్థావరాలపై భారీ మిసైల్లతో విరుచుకుపడింది. భారత్ దాడులతో బెదిరిపోయిన పాక్ చివరకు అగ్రరాజ్యాన్ని ఆశ్రయించింది. అమెరికా దౌత్యంతో పాక్ డీజీఎమ్ఓ భారత్‌కు ఫోన్ చేసి కాల్పుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ విషయమై రేపు మరోసారి ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి:
కృష్ణబిలంలో పడి నక్షత్రం ధ్వంసం.. అద్భుత ఫొటో షేర్ చేసిన నాసా
ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ
పాక్ మిలిటరీ స్థారవరాలపై భారత్ వైమానిక దాడులు.. షాకింగ్ పిక్చర్స్
Updated Date - May 11 , 2025 | 11:30 PM